గుడిసెవాసులకు నివేశనా స్థలాల కోసం హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద సిపిఐ ధర్నా
పాల్గొన్న సిపిఐ నేతలు అజీజ్‌పాషా, చాడ వెంకట్‌రెడ్డి, కూనంనేని సాంబశివరావు
ప్రజాపక్షం/హైదరాబాద్ ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేసుకున్న పేదలకు 58 జి.ఓ ప్రకారం ఇళ్ల పట్టాలు ఇవ్వాలని సిపిఐ జాతీయ కార్యదర్శి సయ్యద్ అజీజ్ పాషా డిమాండ్ చేశారు. ప్రతి ప్రకటన జిఓగా భావించాలని, వాగ్ధానాలను అమలు చేసినప్పుడే ప్రజలకు విశ్వాసం కలుగుతుందని, మాట తప్పితే ప్రజల నుండి తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. ప్రభుత్వ, భూదాన్ భూముల్లో గుడిసెలు వేసుకున్న వారికి పట్టాలు ఇవ్వాలని’డిమాండ్ చేస్తూ సిపిఐ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో హైదరాబాద్, ఇందిరాపార్క్, ధర్నాచౌక్ వద్ద గురువారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అజీజ్ పాషా మాట్లాడుతూ గ్రేటర్ హైదరాబాద్ 1432 మురికివాడలు ఉన్నాయని, మరో 450 వరకు కొత్తగా వచ్చాయని, అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం మురికివాడలను ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. మురికివాడల్లో డ్రైనేజీ, తాగునీరు, రోడ్లు లాంటి కనీస సదుపాయాలు కల్పించడం లేదన్నారు. కొన్ని మురికివాడల్లో మాత్రమే డబుల్ ఇళ్లను నిర్మించారని, పేదల దగ్గర దళారులు డబ్బులు తీసుకుని ఇళ్లను కేటాయించారని విమర్శించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రజలకిచ్చిన వాగ్దానాలను, దళితులకు మూడెకరాల భూమిని, పేదలకు డబుల్ ఇళ్లు, మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని కోరారు.
గడీలను, అధికార కార్యాలయలను బద్దలు కొట్టే రోజొస్తుంది..: కూనంనేని
గడీలను, చీఫ్ సెక్రటరీతో సహా అధికార కార్యాలయాలను బద్దలు కొట్టే రోజు ఏదో ఒక రోజు వస్తుందని, ఇంకా స్నేహబంధాన్ని పాటిస్తున్నామని, ప్రజల బాధలను అర్థం చేసుకుని, సమస్యను పరిష్కరిస్తారని తాము ఆశిస్తున్నామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. చాలా మంది చీఫ్ సెక్రటరీలను సిపిఐ చూసిందని, కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు కన్నెర్రజేస్తే ఆ కంటి జ్వాలలకు వారు మాడిమసైపోతారని, తమతో కయ్యం పెట్టుకోవద్దని, తమను ఇబ్బంది పెట్టవద్దని హితువు పలికారు. ప్రభుత్వ భూములు కబ్జాలు కాకుండా చూడాల్సిన పోలీసుల బాధ్యతను తాము చూస్తున్నామని, రెవెన్యూ డ్యూటీలను తామే చేస్తున్నామని తెలిపారు. భూదాన్ బోర్డ్ భూములను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నంచే వారికి పోలీసులు మద్దతుగా నిలుస్తున్నారని, పేదలు గుడిసెలు వేసుకుంటే వారికి మద్దతు ఇస్తున్న తమపై కేసులు పెడుతున్నారని విమర్శించారు. ప్రభుత్వ భూముల్లో వెలిసిన గుడిసెలను పీకెయండి ‘మీరో.. మేమే తేల్చుకుంటాం’ అన్నారు. 58 జిఓ ప్రకారం ప్రతి గుడిసెకు పట్టాలు ఇవ్వాల్సిన బాధ్యత సిఎంపైనే ఉన్నదన్నారు. ఇక తాము మూగ జీవుల్లాగా ఉండబోమని, ఇంకా ఎన్ని రోజులు కేసులు, జైల్లో పెడుతారో చూస్తామని, అంతిమంగా తాము ఏం చేస్తామో చూపిస్తామని కూనంనేని హెచ్చరించారు. లాఠీలను ఎత్తి ఇలాగే వ్యవహారిస్తే తిరగబడతామని హెచ్చరించారు. తామూ అన్నింటికీ సిద్ధమేనని, పేదలకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని భరోసానిచ్చారు. వెయ్యి, ఐదు వేల ఎకరాలు, వందల ఎకరాల్లో ఫామ్ హౌజ్ నిర్మించుకుంటారా?, పేదలకు 90 గజాలు ఇవ్వరా?, అని ప్రశ్నించారు. ఎర్రజెండా, కమ్యూనిస్టు పార్టీ లేకపోతే పేదవాడి గుండె సప్పుడు, శ్వాస ఆగిపోతుందని, పేదవారి కోసం పోరాటం చేయాలన్నా?, జైలుకు వెళ్లాలన్నా, లాఠీ దెబ్బలు తినాలన్నా, తూటలను ఆపడం ఒక కమ్యూనిస్టుల వల్లనే సాధ్యమన్నారు. కాంగ్రెస్, బిజెపి, బిఆర్‌ఎస్ వారు ప్రజలకు ఇండ్లు ఇప్పించారా? అని ప్రశ్నించారు. పేదల ఇంటి కోసం పోరాటం చేస్తూ గుడిసెవాసులకు అండగా ఉండే తాము దొంగలమా?, తమపై కేసులా?, తాము భూములను ఖాజేస్తున్నామా? అని కూనంనేని మండిపడ్డారు. వేలాది ఎకరాలు కబ్జా చేసే వారు దొరలా?, ముద్ర వేసి ఎంతైనా దోపిడీ చేస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
జిఓ 58 కాగితాలకే పరిమితమైంది
సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం పరోక్ష పన్నుల ద్వారా ప్రజల రక్తాన్ని జలగల్లాగా పీల్చుతున్నాయన్నారు. ప్రజల పక్షాన పోరాటం చేస్తున్న తమపై కేసులు పెడుతున్నారని, కేసులు కమ్యూస్టులకు కొత్త కాదన్నారు. పాలకులు మారినా ప్రజల బతుకుల్లో మార్పులు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పల్లె ముచ్చటలో ప్రజలు అనేక సమస్యలను తమ దృష్టికి తీసుకొచ్చారని, పేదలు తిరగడితే పాలకులు పారిపోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. సిఎం కెసిఆర్ ఆహ్వానం మేరకు 2014 డిసెంబర్ 9న సిపిఐ నేతలు ఆయనతో సమావేశమై అనేక సమస్యలను సిఎం దృష్టికి తీసుకెళ్లామని, గుంట భూమి కావాలని తాను ప్రతిపాదిస్తే, ఆయన 125 గజాలు ఇస్తానని, జిఓ 58 తీసుకొచ్చారని, కానీ ఆ జిఓ కాగితాలకే పరిమితమైందని విమర్శించారు. జిఓ 59,58 అమలు ఏమైందని ఆయన ప్రశ్నించారు. ఈ ధర్నాకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఈ.టి.నరసింహ అధ్యక్షత వహించగా రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పశ్య పద్మ, వి.ఎస్.బోస్, ఎన్.బాలమల్లేష్, కార్యవర్గ సభ్యులు ఎ.రవీంద్రచారి, నేదునూరి జ్యోతి, రాష్ట్ర సమితి సభ్యులు ముత్యాల యాదిరెడ్డి, పానుగంటి పర్యతాలు, సదాలక్ష్మి, హైదరాబాద్ జిల్లా కార్యదర్శి ఎస్. ఛాయాదేవి, సహాయ కార్యదర్శులు బి.స్టాలిన్, కమతం యాదగిరి, రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కార్యదర్శి డి.జి.సాయిలుగౌడ్, వరంగల్ జిల్లా కార్యదర్శి కర్రె భిక్షపతి, భూపాలపల్లి జిల్లా కార్యదర్శి రాజ్ కుమార్, ఎఐవైఎఫ్ రాష్ట్ర సమితి సభ్యులు మర్రి శ్రీమాన్ తదితరులు పాల్గొన్నారు. కాగా ప్రజానాట్యమండలి ప్రధాన కార్యదర్శి పల్లె నర్సింహ బృందం ఆలపించిన పాటలు సభికులను ఆకట్టుకున్నాయి.
మాట తప్పితేతిరుగుబాటు తప్పదు
RELATED ARTICLES