15 ఎకరాల్లో అన్ని మతాలాకు వైకుంఠధామం కేటాయిస్తాం
జవహర్ నగర్ కార్పొరేషన్ అభివృద్ధికి మరో రూ. 30 కోట్లు
లీచెట్ ట్రీట్మెంట్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి కెటిఆర్
ప్రజాపక్షం/మేడ్చల్ ప్రతినిధి / జవహర్‌నగర్ రాష్ట్రంలో పేదలకు ఇండ్లు, ఇండ్ల స్థలాలు అం దించేందుకు బిఆర్‌ఎస్ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని రాష్ట్ర ఐటి, పురపాలక శాఖల మంత్రి కె.తారకరామారావు చెప్పారు. దేశానికి హైదరాబాద్ నగరం ఆదర్శం కానుందన్నారు. మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలో ప్రభుత్వ ఉత్తర్వులు 58 కింద అర్హులైన 3,619 మంది కి ఇళ్ల పట్టాలు అందజేయడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. జిల్లాలోని జవహర్‌నగర్‌లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూ.250 కోట్ల వ్యయంతో నూతనంగాఏర్పాటు చేసిన మురుగునీటి శుద్దీకరణ ప్లాంట్ (లీచెట్ ట్రీట్మెంట్ ప్లాంట్)ను మంత్రి కెటిఆర్ శనివారం ప్రారంభించారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి, ఎంఎల్‌సి శంభీపూర్‌రాజు, రాజ్యసభ సభ్యుడు అయోధ్యరామిరెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ మల్లిపెద్ది శరత్ చంద్రారెడ్డి, జిహెచ్‌ఎంసి మేయర్ గద్వాల విజయలక్ష్మి, కలెక్టర్ అమోయ్‌కుమార్, మాజీ ఎంఎల్‌ఎ సుధీర్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ ‘గత ఆరు నెలల క్రితం జవహర్‌నగర్‌కు వచ్చా… పట్టాలు అందజేస్తానని… మాట ఇచ్చా…. మాటను నిలబెట్టుకోవడం సంతోషంగా ఉంది’ అని కెటిఆర్ అన్నారు. జవహర్‌నగర్ ప్రాంతవాసుల ఇబ్బందులను పరిష్కరించేందుకు అన్ని విధాల సహకరిస్తామన్నారు. ప్రభుత్వ ఉత్తర్వులు 58, 59కి సంబంధించి కటాఫ్ 2014 వరకు ఉంటే మంత్రి మల్లారెడ్డి ప్రత్యేకంగా శ్రద్ద తీసుకుని దానిని 2020 వరకు పొడిగించి, అప్పటివరకు అర్హులైన వారికి పట్టాలు ఇప్పించారన్నారు. జవహర్‌నగర్ డంపింగ్ యార్డుకు వచ్చే తడి, పొడి చెత్తను వేరు చేసి తద్వారా తడి చెత్త నుంచి ఎరువు ఉత్పత్తి చేసి, పొడి చెత్తతో ఈ ప్రాంతంలో రూ.550 కోట్లతో ప్రత్యేకంగా ప్రస్తుతం 20 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోందని, రూ.550 కోట్లతో త్వరలోనే మరో 28 మెగావాట్ల విద్యుత్‌ను మొత్తం 48 మెగావాట్లు ఉత్పత్తి చేయడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వెల్లడించారు. ప్రతి రోజూ దుండిగల్‌తో పాటు మరో ప్రాంతాల్లో డంపింగ్ యార్డులు ఏర్పాటు చేసి ఒక్కో చోటకు 1500 టన్నుల చెత్తను తరలిస్తున్నామని, దీని వల్ల జవహర్‌నగర్‌కు కొంత ఇబ్బంది తగ్గుతుందని అన్నారు. ఏడాదిన్నరలోగా జవహర్‌నగర్‌లో అందమైన పార్కు ఏర్పాటు అవుతుందని అన్నారు. అలాగే జవహర్‌నగర్‌లో 15 ఎకరాల్లో అన్ని మతాల వారికి ఉపయోగపడే విధంగా స్మశాన వాటికను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు నర్సింహారెడ్డి, ఆర్‌డిఓ రవి, జవహర్‌నగర్ మేయర్ కావ్య, డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్, దమ్మాయిగూడ చైర్‌పర్సన్ ప్రణీత, ఫిర్జాదిగూడ మేయర్ జక్కా వెంకట్‌రెడ్డితో పాటు పలువురు మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, కమిషనర్లు పాల్గొన్నారు.
‘జవహర్‌నగర్ నా గుండె, శ్వాస’ : మంత్రి మల్లారెడ్డి
‘పేద ప్రజలు నివసించే జవహర్‌నగర్ నా గుండె, శ్వాస’ అని మంత్రి మల్లారెడ్డి అన్నారు. కార్పొరేషన్‌కు రూ.120కోట్లతో ప్రతి ఇంటికి మిషన్ భగీరథ ద్వారా ఉచితంగా నల్లా కనెక్షన్‌ను అందజేశామని, వేలాది కోట్లతో రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేశామని వివరించారు. జవహర్‌నగర్‌ను మోడల్ నగరంగా తీర్చిదిద్దే వరకు తన ఉద్యమం ఆగదన్నారు.
మాట ఇచ్చాం… పట్టాలు అందజేశాం
RELATED ARTICLES