వ్యవసాయ బిల్లులు రైతులకు వ్యతిరేకంగా ఉన్నాయి
డాక్టర్ కె.కేశవరావు విమర్శ
ప్రజాపక్షం / హైదరాబాద్ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులో ప్రతి క్లాజ్, సబ్ క్లాజ్ రైతులకు వ్యతిరేకంగా ఉన్నాయని టిఆర్‌ఎస్ పార్లమెంటరీ పక్ష నేత డాక్టర్ కె.కేశవరావు విమర్శించారు. పార్లమెంట్ సభ్యునిగా తన 12 సంవత్సరాల అనుభవంలో ఎప్పుడూ జరగని రీతిలో నిబంధనలను అతిక్రమించారని, మాట్లాడే హక్కు ను కూడా కాలరాశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలోని పార్లమెంట్ ఆవరణలో టిఆర్‌ఎస్ లోక్‌సభ పక్ష నేత నామనాగేశ్వర్‌రావుతో కలిసి డాక్టర్ కేశవరావు మీడియాతో మాట్లాడుతూ బిల్లులను తిరస్కరించాలని రెండు తీర్మానాలు వచ్చినప్పటికీ సమ యం ఇవ్వలేదని, ముగ్గురు, నలుగురు సభ్యులపైన దాడులు కూడా జరిపించారని వివరించారు. 12 రాజకీయ పార్టీల సభ్యులందరూ కలిసి డిప్యూటీ చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానమిచ్చామని, దీనిపై సోమవారం (నేడు) ఒత్తిడి తీసుకొస్తామన్నారు. డిప్యూటీ చైర్మన్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రభావితం చేసి బిల్లులను ఆమోదింపచేసుకుందని ఆరోపించారు. వ్యవసాయ బిల్లుపైన సభలో చర్చ అంతా బాగానే జరిగిందని, కానీ ఓటింగ్ సమయం వచ్చేసరికే పరిస్థితులు అన్ని ఒక్కసారిగా మారిపోయాయయన్నారు. రాజ్యాంగంలో వ్యవసాయం అనేది రాష్ట్రాల సబ్జెక్టు అన్నారు. ప్రస్తుతం అమలు చేస్తున్న రైతుబంధు, రైతుబీమా, నిరంతర కరెంటు కేంద్రం ప్రవేశపెట్టిన బిల్లుతో రాదని చెప్పారు. తాము ఎప్పుడూ రైతులతోనే ఉంటామన్నారు. మద్దతు ధర లేకుండా ఇప్పుడు కూడా బయటవాళ్ళు కొనుగోలు చేస్తున్నారని, మద్దతు ధర కంటే తక్కువగా పంట కొనుగోలు చేయవద్దని కేంద్రం చెప్పగలదా అని ప్రశ్నించారు. నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ జై జవాన్, జై కిసాన్ వీరిద్దరూ బాగుంటే దేశం బాగుంటుందన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా రైతాంగం రోడ్డెక్కిందన్నారు. రాజ్యసభలో ఓటింగ్ పెడితే బిల్లు వీగిపోతుందని వాయిస్ ఓటింగ్‌తో ప్రజాస్వామ్య గొంతు నొక్కారని ఆరోపించారు. రాబోయే రోజుల్లో తమకు జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా రైతులు ముందుకొస్తారన్నారు. వ్యవసాయ బిల్లుపై రాజకీయ పార్టీలను ఎందుకు ఏకం చేయలేకపోయారని, కనీసం ఈ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించవచ్చు కదా ఆయన ప్రశ్నించారు. కనీసం రైతులను ఆహ్వానించి సమావేశాన్ని నిర్వహించాల్సిందన్నారు. ఇంత పెద్ద అంశంపై విపక్షాలు మాట్లాడుతుంటే కేంద్రం బుల్‌డోజ్ చేసిందన్నారు. ఈ బిల్లు ఆమోదం పొందడం రైతులకు ఒక బ్లాక్‌డే గా అభివర్ణించారు. బిల్లు ఆమోద సమయంలో సభ ప్రసారాలను నిలిపివేశారన్నారు.
మాట్లాడే హక్కును కాలరాశారు
RELATED ARTICLES