HomeNewsBreaking Newsమాటలతో నమ్మించి... చేతలతో పేదల గొంతుకోస్తున్నారు

మాటలతో నమ్మించి… చేతలతో పేదల గొంతుకోస్తున్నారు

ప్రభుత్వాలపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ధ్వజం
భూ బకాసురులను వదిలేసి పేదల గుడిసెలపై ఉక్కుపాదం మోపుతారా?
మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లా దేవరయాంజల్‌లో గుడిసెలు వేసుకున్న పేదల సమస్యలను తెలుసుకున్న సిపిఐ నేతలు
ప్రజాపక్షం/మేడ్చల్‌ జిల్లాప్రతినిధి అష్టకష్టాలతో బతుకులీడుస్తున్న పేదలను… ప్రభుత్వాలు మాటలతో నమ్మించి చేతులతో గొంతు కోస్తున్నాయని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి విమర్శించారు. ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్న మంత్రులను, బడా నాయకులను, భూ బకాసురులను వదిలేసి పేదల గుడిసెలపై ఉక్కుపాదం మోపి తొలగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేడ్చల్‌-మల్కాజ్‌గిరి జిల్లా దేవరయాంజల్‌ గ్రామ రెవెన్యూ పరిధిలో ప్రభుత్వ భూమిలో పేద గిరిజనులు వేసుకున్న గుడిసెలను చాడ వెంకట్‌రెడ్డి, సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యు లు సయ్యద్‌ అజీజ్‌ పాషా, సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎన్‌.బాలమల్లేష్‌, జిల్లా కార్యదర్శి డి.జి.సాయిలుగౌడ్‌, తెలంగాణ సర్వోదయ మం డలి అధ్యక్షుడు ఆర్‌.శంకర్‌నాయక్‌, తెలంగాణ గిరిజన సమాఖ్య ప్రధాన కార్యదర్శి అంజయ్య నాయక్‌ తదితరులు సందర్శించి వారి సమస్యలు తెలుసుకుని అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా గుడిసెవాసులు ఏర్పా టు చేసిన బహిరంగ సభలో చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూవందల ఎకరాల ప్రభుత్వ భూము ల్లో ఫామ్‌హౌస్‌లు, గోదాములు వెలుస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం వహిస్తోందని నిలదీశారు. కబ్జాకు గురైన 1500 ఎకరాల దేవరయాంజల్‌ దేవాలయ భూములను ప్రభుత్వం ఎందుకు స్వాధీనం చేసుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. పేదల గుడిసెలు మాత్రం తొలగిం చి వారి ప్రతాపాన్ని చూపిస్తారా అని మండిపడ్డారు. పేదలకు ఏమి సహాయం చేశారని ప్రధాని మోడీ ఆజాదీ కా అమృత్‌ మహోత్సవం జరుపుకుంటున్నారని, స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయినా డాక్టర్‌ అంబేద్కర్‌ రచించిన రాజ్యాంగాన్ని ఎందుకు అమలు చేయడం లేదని చాడ వెంకట్‌రెడ్డి ప్రశ్నించారు. రాజ్యాంగం పౌరులకు ప్రసాదించిన హక్కులతో ‘జల్‌, జంగల్‌, జమీన్‌’ నినాదంతో పోరాటాలు నిర్వహించాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. ఇంధన ధరలు విపరీతంగా పెరగడంతో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని, వాటిని కొనలేక, తినలేక పేదల బతుకులు బజారున పడుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దున్నేవాడిదే భూమి అనే నినాదంతో భూ పోరాటాలు చేసి పది లక్షల ఎకరాలు పేదలకు పంచిన ఘనత ఒక్క సిపిఐకే ఉందని గుర్తు చేశారు. అజీజ్‌ పాషా మాట్లాడుతూ నగర శివారు ప్రాంతాల్లో భూ పోరాటాలు చేసిన సిపిఐ సుమారు 40కి పైగా కాలనీలు ఏర్పాటు చేసి పట్టాలు ఇప్పించామని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఏడున్నర ఏళ్లు గడుస్తున్నా ఇప్పటివరకు పేదలకు ఒక్క పట్టా కూడా మంజూరు చేయలేదని విమర్శించారు. బడుగు బలహీన వర్గాలకు సిపిఐ ఎప్పుడూ అండగా ఉంటుందని, పోరాటాల ద్వారానే ఇళ్ల పట్టాలు సాధించుకోవాలన్నారు. బాలమల్లేష్‌ మాట్లాడుతూ కూలి చేసుకునే పేద ప్రజలు దేవరయాంజల్‌ ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకుని జీవనం సాగిస్తున్నారని, ప్రభుత్వం వెంటనే స్పందించి వారికి ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం స్పందించనట్లయితే ఇళ్ల పట్టాల సాధన కోసం వేలాది మందితో ఈనెల 13న ‘ఛలో కీసర కలెక్టరేట్‌’ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. ఈ సభలో సిపిఐ నేతలు వెంకట్‌రెడ్డి, రొయ్యల కృష్ణమూర్తి, ఉమామహేశ్‌, శంకర్‌, సహదేవ్‌, గుడిసెవాసుల సంఘం నేతలు మున్నా, వినోద్‌ నాయక్‌, సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.
ఆందోళన కలిగిస్తున్న రియల్టర్ల హత్య
ప్రజాపక్షం / హైదరాబాద్‌ : భూ వివాదాల కారణంగా ఇబ్రహీంపట్నంలో రియాల్టర్ల హత్య ఆందోళన కలిగిస్తోందని సిపిఐ రాష్ర్ట కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ధరణిలో లొసుగుల కారణంగా తలెత్తిన భూవివాదాలు ఈ హత్యకు దారితీసిందని మీడియాలో వార్తలు వచ్చాయని అన్నారు. ఈ మేరకు బుధవారం నాడు ఆయన ఒక పత్రికా ప్రకటనను విడుదల చేశౠరు. ధరణి పోర్టల్‌ ఉన్న లొసుగులను సరిచేయకుండా కాలయాపన చేస్తున్నందున రాష్ర్ట వ్యాపితంగా పలు చోట్ల భూ వివాదాలు తలెత్తుతున్నాయని తెలిపారు. లొసుగులను సరిచేయాలని పది డిమాండ్లతో ఇప్పటికే సిపిఐ తరుపున ముఖ్యమంత్రి లేఖ రాసిన విషయాన్ని చాడ గుర్తు చేశారు. ఈ సమస్యలపై మంత్రివర్గ ఉపసంఘం రాష్ర్ట ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, ఇప్పటికీ మంత్రివర్గ ఉపసంఘంలో తీసుకున్న చర్యలు బహిర్గతం కాకపోవడం దారుణమన్నారు. తక్షణమే ధరణిలో నెలకొన్న లోటుపాట్లను సరిచేసేందుకు అవసరమైన సూచనల కోసం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని, అలాగే రాష్ర్టంలో భూ, రియల్‌ ఎస్టేట్‌ మాఫియాను అరికట్టాలని చాడ వెంకటరెడ్డి డిమాండ్‌ చేశారు. లేకపోతే సామాన్యులు, మధ్యతరగతి ప్రజలు వీరి బారిన పడి తమ జీవత కష్టార్జీతాన్ని కోల్పోయే ప్రమాదం ఉందన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments