ప్రజాపక్షం/హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ఎం. ముఖేశ్ గౌడ్ (60) సోమవారం నాడు మరణించారు. ఆయన కొంత కాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం నుంచి ముఖేశ్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. శరీరం సహకరించకపోవడంతో కొద్ది రోజుల క్రితం ఆయనను ఇంటికి పంపగా, పరిస్థితి విషమించడంతో సోమవారం ఉద యం ఆయనను తిరిగి అపోలో ఆసుపత్రిలో చేర్చారు. అక్కడే చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ముఖేశ్‌కు భార్యలక్ష్మి, ఇద్దరు కుమారులు విక్రమ్‌గౌడ్, విశాల్‌గౌడ్, కుమార్తె శిల్ప ఉన్నారు. వీరిలో విక్రమ్ గౌడ్ టిపిసిసి కార్యదర్శిగా కొనసాగుతున్నారు. ముఖేశ్ మూడు సార్లు ఎంఎల్ఏగా, రెండుసార్లు మంత్రిగా పని చేశారు. హైదరాబాద్ నగరంలో బలమైన కాంగ్రెస్ నాయకునిగా ఆయనకు పేరుంది. రెండు రోజుల వ్యవధిలో కాంగ్రెస్‌లో ఇద్దరు నాయకులు మరణించడం ఆ పార్టీలో కార్యకర్తల్లో విషాధాన్ని నింపింది. ముఖేశ్ గౌడ్ భౌతికకాయానికి మంగళవారం ఫిల్మ్‌నగర్‌లోని జెఆర్సి ఫంక్షన్ హాల్ సమీపంలోని గౌడ స్మశాన వాటికలో అంత్యక్రియలు జరగనున్నాయి. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
యూత్ లీడర్ నుండి మంత్రి వరకు: ముఖేశ్ గౌడ్ 1959 జులై 1వ తేదీన జన్మించారు. చిన్న వయసులోనే 1986లో హైదరాబాద్ కార్పొరేషన్‌కు జాంబాగ్ కార్పొరేటర్‌గా ఆయన రాజకీయ జీవిత ప్రస్థానం ప్రారంభమైంది. 1988లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా, 30 ఏళ్ళ వయసులోనే తొలిసారిగా 1989లో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అతి చిన్న నియోజకవర్గమైన మహారాజ్గం జ్ నుండి ఎంఎల్ఎగా ఎన్నికయ్యారు. 2004లో అదే నియోజకవర్గం నుండి విజ యం సాధించారు. నియోజకవర్గాల పునర్విభజన తరువాత 2009లో గోషామహల్ ఎంఎల్ఎగా గెలుపొందారు.1994, 1999, 2014లతో పాటు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. 2007లో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మంత్రివర్గంలో బిసి సంక్షేమ శాఖమంత్రిగా, 2009లో కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రి వర్గంలో మార్కెటింగ్ శాఖ మంత్రిగా ముఖేష్ గౌడ్ పని చేశారు. టిడిపి సీనియర్ నేత, మాజీ హోం మంత్రి దేవేందర్ గౌడ్‌కి ముఖేశ్ స్వయానా మేనల్లుడు.
సిఎం దిగ్భ్రాంతి: మాజీ మంత్రి ముఖేశ్‌గౌడ్ మృతి పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పత్రికా ప్రకటనలో తీవ్ర సంతాపాన్ని తెలియజేశారు. మంత్రిగా, ఎంఎల్ఎగా ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ముఖేశ్ అంత్యక్రియలను అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించినట్లు సిఎం కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఇందుకు ఏ ర్పాట్లు చే యాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషిని ఆయన ఆదేశించారు.
ప్రముఖుల నివాళి: ముఖేశ్ మరణ వార్త తెలిసిన వెంటనే రాజ్యసభ ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్, మల్లికార్జున్ ఖర్గే, టిపిసిసి అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మాజీ ప్రతిపక్ష నేత కుందూరు జానారెడ్డి, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, పొ న్నాల లక్ష్మయ్య, మధుయాష్కీగౌడ్, దామోదర్ రాజనర్సింహా, తదితరులు అపోలో ఆసుపత్రికి వెళ్ళి ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు. వారితో పాటు ఎంపి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్, వంశీ చందర్ రెడ్డి, సంపత్ కుమార్, దాసోజు శ్రవణ్, గూడూరు నారాయణ రెడ్డి తదితరులు శ్రద్ధాంజలి ఘటించారు.
ముఖేశ్ గౌడ్ మృతికి సిపిఐ సంతాపం: మంత్రి, కాంగ్రెస్ నాయకుడు ముఖేశ్ గౌడ్ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ మృతి చెందడం దిగ్భ్రాంతికి గురిచేసిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు పర్యాయాలు మంత్రిగా పనిచేశారని, మూడు సార్లు ఎంఎల్ఎ గా గెలుపొందారని ఆయన పేర్కొన్నారు. ముఖేశ్ యువజన కాంగ్రెస్‌లో క్రియాశీల పాత్ర పోషించారని, కల్లుగీత కార్మికుల సంక్షేమం కోసం, వారి అభ్యున్నతికి కృషి చేశాడని కొనియాడారు. బలహీన వర్గాల ప్రజలు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అభివృద్ధి చెందాలనే బలమైన ఆకాంక్ష కలిగి ఉండేవారని చాడ పేర్కొన్నారు. ముఖేశ్ గౌడ్ మృతికి సిపిఐ రాష్ట్ర సమితి తరఫున సంతాపాన్ని, ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.
మాజీమంత్రి ముఖేశ్‌గౌడ్ కన్నుమూత
RELATED ARTICLES