హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో తమకే మద్దతు ఇవ్వాలని మరోసారి సిపిఐకి కాంగ్రెస్ వినతి
మఖ్దూంభవన్‌లో చాడతో కోదండరెడ్డి బృందం భేటీ
ప్రజాపక్షం / హైదరాబాద్: హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో మద్దతివ్వాలని సిపిఐని కాంగ్రెస్ నేతలు కోరారు. కాంగ్రెస్ నాయకులు కోదండరెడ్డి నేతృత్వంలో ప్రతినిధి బృందం సోమవారం మఖ్దూంభన్‌లో సిపిఐ రాష్ట్ర నాయకులతో భేటీ అయింది. భేటీ అనంతరం కాంగ్రెస్ నాయకులు కోదండరెడ్డి, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి విలేకరులతో మాట్లాడారు. సిపిఐ, కాంగ్రెస్‌ల మధ్య సిద్ధాంతపరంగా విభేదాలు లేవని కోదండరెడ్డి అన్నారు. దేశ, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా అనేకసార్లు కలిసి పనిచేసినట్లు తెలిపారు. 2004లో యుపిఎ ప్రభుత్వం ఏర్పడినపుడు ఉభయ కమ్యూనిస్టు పార్టీలు కాంగ్రెస్‌తో కలిసి పనిచేశాయని గుర్తు చేశారు. కమ్యూనిస్టు పార్టీ ల సహకారంతో రాష్ట్రంలోనూ, దేశంలో నూ అనేక సమస్యలను పరిష్కరించడం జరిగిందన్నారు. భూ పంపిణీ, పేదల సమస్యలు సిపిఐ సహకారంతోనే జరిగాయన్నారు. 2018 ఎన్నికల్లోనూ పొత్తు పెట్టుకున్నామని, చిన్న చిన్న సమస్యలు ఉన్నా సిపిఐ సహకారం కోసం వచ్చామన్నారు. హుజూర్‌నగర్ ఉప ఎన్నిక చాలా కీలకమైందని, ఇక్కడ సిపిఐ మద్దతు ఇస్తుందని ఆశిస్తున్నామన్నారు. పార్టీలో చర్చిం చి నిర్ణయం తీసుకుంటామని చెప్పారని కోదండరెడ్డి తెలిపారు. సానుకూల నిర్ణ యం తీసుకుంటారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
నేడు నిర్ణయం : చాడ వెంకట్‌రెడ్డి
గతంలో అనేక సార్లు కాంగ్రెస్‌తో కలిసి పనిచేశామని చాడ వెంకట్ రెడ్డి చెప్పారు. 2004, 2014లో కాంగ్రెస్‌తో కలిసి పనిచేశామని 2018లో సిపిఐ, కాంగ్రెస్, టిడిపి, టిజెఎస్ పార్టీలు కూటమిగా ఏర్పడి పోటీ చేశాయన్నారు. ఆ తర్వాత అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయని తెలిపారు. పార్లమెంటు ఎన్నికల నాటికి కూటమి విడిపోయిందన్నారు. అన్ని పార్టీలు హుజూర్‌నగర్ ఎన్నికల్లో మద్దతు అడుగుతున్నాయని, తాము కూడా పోటీ చేస్తే బాగుండనిపిస్తుందన్నారు. మంగళవారం జరిగే పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో చర్చించి, కేంద్ర పార్టీ అభిప్రాయం తీసుకొని నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థి పెడితే బాగుంటుందని భావించామని, అయితే ఆ పరిస్థితి లేకుండా పోయిందన్నారు. సిపిఐ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేస్తున్నందునే ఆటుపోట్లు ఎదుర్కొంటూ నిలబడ్డామని చాడ వెంకట్‌రెడ్డి ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.