చాకలి ఐలమ్మ స్ఫూర్తితో ముందుకు సాగాలి
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి
హన్మకొండలో ప్రారంభమైన ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యు రాష్ట్ర మహాసభలు
ప్రజాపక్షం / వరంగల్ మహిళా సమస్యలపై ప్రత్యక్షపోరాటాలకు సిద్దం కావాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి మహిళలకు పిలుపునిచ్చారు.ఆదివారం హన్మకొండ నక్కలగుట్టలోని హరిత హోటల్ లో భారత జాతీయ మహిళా సమాఖ్య(ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ) రాష్ట్ర రెండవ మహాసభలు ఘనంగా ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భంగా హరిత కాకతీయ హోటల్ ఆవరణలో ఏర్పాటు చేసిన ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ పతాకాన్ని మహిళా సమాఖ్య సీనియర్ నాయకురాలు చాడ పుష్పమాల ఎగురవేశారు. అనంతరం హరిత హోటల్ లోని డాక్టర్ కె. వసుమతి ప్రాంగణంలో జరిగిన ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ మహాసభలను చాడ ప్రారంభించి మాట్లాడారు. మహిళలపై రోజు రోజుకు పెరుగుతున్న దాడులు, అత్యాచారాలు, వివక్ష, అణిచివేతలకు వ్యతిరేకంగా పోరాడాలని అన్నారు. మహిళల కోసం అనేక చట్టాలు చేసినప్పటికీ అమలులో లోపాల కారణంగా న్యాయం జరగడం లేదన్నారు. చట్ట సభలలో 33 శాతం రిజర్వేషన్ కల్పించాలని ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ పోరాడుతున్నదని,నాడు తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న ఆరుట్ల కమలాదేవి, చాకలి ఐలమ్మ స్పూర్తితో ముందుకు సాగాలని, సామాజిక మార్పు, చైతన్యం కోసం ఉద్యమించాలని సూచించారు. దేశంలో బిజెపి ఫాసిస్ట్ మతోన్మాద పాలన కొనసాగుతున్న దని, ప్రధాని నరేంద్ర మోడీ అంబానీ, ఆదానీ కోసమే పని చేస్తున్నారని అన్నారు. మోడి పాలనలో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటాయని, పెట్రోల్, డీజిల్ తో పాటు రూ. 400 వున్న గ్యాస్ ధర 1200 పెంచారని, చివరికి చేనేత వస్త్రాలపై కూడా జీఎస్టీ విదించి ప్రజలను దోచుకుంటున్నారని అన్నారు.మరోవైపు తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను కూడా బిజెపి వక్రీకరిస్తున్నదని,సాయుధ పోరాటంలో రక్తం ఏరులై ప్రవహించిన తెలంగాణ గడ్డపై కాషాయపు జెండాను ఎగురవేయాలని చూస్తున్నారని, చాకలి ఐలమ్మ వారసులుగా తెలంగాణలో బిజెపి ఆటలు సాగనివ్వబోమని ప్రతిన భూనాలని కోరారు. అందుకే మునుగోడు ఉప ఎన్నికలలో బిజెపి ని ఓడించడమే లక్ష్యంగా కమ్యూనిస్టు లు నిలబడతారని అన్నారు. రాష్ట్రంలో కేసిఆర్ ఇచ్చిన హామీల అమలుకు పోరాడాలని,నిరుద్యోగ భృతి, డబుల్ బెడ్రూం ఇండ్లు, ఫించన్లు, ఇండ్ల స్థలాలు ఇవ్వడంతో పాటు అంగనవాడీ, మద్యాహ్నం బోజన వర్కర్స్ సమస్యలు పరిష్కరించే వరకూ ఒత్తిడి తేవాలన్నారు. రానున్న రోజులలో ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ బలోపేతమే లక్ష్యంగా మహిళా సమస్యలతో పాటు స్థానిక సమస్యలపై ప్రత్యక్ష పోరాటాలకు సన్నద్ధం కావాలన్నారు. మహిళా సమాఖ్య నిర్వహించే పోరాటాలకు సిపిఐ ఎల్లప్పుడూ అండగా నిలబడుతుందని చెప్పారు. ఈ మహాసభలలో ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె. రజనీ, రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఉస్తేల సృజన, నేదునూరి జ్యోతి,మాజీ ఎమ్మెల్యే పోతరాజు సారయ్య,సిపిఐ హనుమకొండ జిల్లా కార్యదర్శి కర్రె బిక్షపతి,వర్కింగ్ ప్రెసిడెంట్ మండ సదాలక్ష్మి, రాష్ట్ర ఉపాధ్యక్షులు చాయా దేవి,పోటు కళావతి, కోశాధికారి ఎం. నళినీ, లతాదేవి,లక్ష్మి, వివిధ జిల్లాల నాయకులు సుగుణమ్మ, తోట చంద్రకళ, కొరిమి సుగుణ. మంచాల రమాదేవి, ఎం. సాంబలక్ష్మి, వైష్ణవి, రాసమల్ల దీనా, టి. రహేలా, ఆర్. శ్రీ విద్య. సువర్ణ, అనసూయ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజానాట్యమండలి కళాకారులు ఆలపించిన గేయాలు ఉత్తేజాన్ని నింపాయి.
మహిళా సమస్యలపై ప్రత్యక్ష పోరాటాలకు సన్నద్ధం కావాలి
RELATED ARTICLES