మహిళలపై వివక్షను రూపుమాపాలి
ఎన్ఎఫ్ఐడబ్ల్యు మహాసభలో వరంగల్ జెడ్పి చైర్పర్సన్ గండ్ర జ్యోతి
స్త్రీల పట్ల మోడీ ప్రభుత్వం మొసలి కన్నీరు : అన్నీ రాజా
ప్రజాపక్షం/వరంగల్ ప్రతినిధి మహిళా సంక్షేమంతోనే సమాజాభివృద్ధి సాధ్యమని వరంగల్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ గండ్ర జ్యోతి అన్నారు. హనుమకొండలోని హరిత హోటల్లో జరుగుతున్న ఎన్ఎఫ్ఐడబ్ల్యు రాష్ట్ర రెండో మహాసభలలో భాగం గా సోమవారం జరిగిన ప్రతినిధుల సభనుద్దేశించి గండ్ర జ్యోతి మాట్లాడారు. నేడు మహిళలు అన్నిరంగాలలో రాణించి పురుషులతో సమానంగా గుర్తింపు తెచ్చుకున్నప్పటికి.. నేటికీ ఇంకా మహిళల పట్ల వివక్షత కొనసాగుతూనే ఉందన్నారు. సమాజంలో సగ భాగం ఉన్న మహిళల అభివృద్ధి జరగకుండా సమాజ అభివృద్ధిని ఆశించడం సరికాదని, మహిళలు లేకుండా అసలు సమాజమే లేదన్నారు. గతంలో మహిళలు హక్కుల కోసం పారాడారని, కొంత వరకు హక్కులు సాధించుకున్నా ఇంకా సాధించుకోవాల్సింది ఉందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల రక్షణ కోసం షీ టీమ్లను ఏర్పాటు చేసిందని, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్లను అమలు చేస్తుందని తెలిపారు. నేడు మహిళల సంక్షేమంలో అంగన్వాడీ, ఆశా వర్కర్లు కీలక పాత్రను పోషిస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వంతో పాటు మహిళా సంఘాలు మహిళా సంక్షేమం కోసం కృషి చేయాల్సిన అవసరం ఎంతైన ఉందన్నారు. ఎన్ఎఫ్ఐడబ్ల్యు జాతీయ ప్రధాన కార్యదర్శి అన్నీ రాజా మాట్లాడుతూ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం మహిళల పట్ల మొసలి కన్నీరు కారుస్తుందని విమర్శించారు. పూర్తిగా ఫాసిస్టు, మనువాద ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉందని, గుజరాత్లో బిల్కిస్ బానో ఉదంతంలో అత్యాచారానికి పాల్పడిన పదకొండు మంది దోషులను జైలు నుంచి విడుదల చేసిన ఘనత మోడీ ప్రభుత్వానిదేనన్నారు. పూర్తిగా ప్రజాస్వామ్యహక్కులను కాలరాస్తూ తీస్తాసెతల్వాద్ వంటి మహిళను జైల్లో పెట్టారని, బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాతనే దేశంలో మహిళలపై అఘాయిత్యాలు, అత్యాచారాలు పెరిగిపోయాయని విమర్శించారు. మోడీ ప్రభుత్వం నిత్యావసరాలు, గ్యాస్, పెట్రోలు, డీజిల్ ధరలను పెంచి సామాన్యులపై పెనుభారం మోపుతూ ప్రభుత్వ సంస్థలను అప్పనంగా అంబానీ, ఆదానీలకు కట్టబెడుతుందన్నారు. అందుకే మహిళలంతా మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఈ మహాసభలలో ఎన్ఎఫ్ఐడబ్ల్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నేదునూరి జ్యోతి, రాష్ట్ర అధ్యక్షురాలు ఉస్తెల సృజన, వర్కింగ్ ప్రెసిడెంట్ మండ సదాలక్ష్మి, ఉపాధ్యక్షురాలు ఛాయాదేవి, పోటు కళావతి, నాయకులు లతాదేవి, లక్ష్మి, కోశాధికారి నళిని, వివిధ జిల్లాల నాయకులు ఎం.రమాదేవి, తోట చంద్రకళ, కొరిమి సుగుణ, టి.రాహేలా, ఆర్.శ్రీవిద్య, వైష్ణవి, రాసమల్ల దీన, సువర్ణ,సాంబలక్ష్మి,శ్రావణి తదితరులు పాల్గొన్నారు. అనంతరం మహాసభలో కార్యదర్శి నివేదిక ప్రవేశపెట్టగా నివేదికపై చర్చలు జరిగాయి.
-చాడ,అన్నీ రాజాను సన్మానించిన టూరిజం ఉద్యోగులు
ప్రజాపక్షం / హనుమకొండ : తెలంగాణ టూరిజం కాంట్రాక్ట్ అండ్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఘం ఆద్వర్యంలో హనుమకొండలోని హరిత హోటల్లో ఎన్ఎఫ్ఐడబ్ల్యు రాష్ట్ర మహాసభలకు విచ్చేసిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, ఎన్ఎఫ్ఐడబ్ల్యు జాతీయ ప్రధాన కార్యదర్శి అన్నీ రాజాను సన్మానించారు. ఈ కార్యక్రమంలో టూరిజం కాంట్రాక్ట్ అండ్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సబ్బు, రాజమౌళి,అశోక్ రెడ్డి,పుల్లా రెడ్డి,సాంబశివ రెడ్డి,అజయ్,శ్రీనివాస్,కిరణ్,సాయి,గిరి తదితరులు పాల్గొన్నారు.
మహిళా సంక్షేమంతోనే… సమాజాభివృద్ధి సాధ్యం
RELATED ARTICLES