HomeNewsBreaking Newsమహిళా రెజ్లర్లకు బ్రిజ్‌ భూషణ్‌వేధింపులు నిజమే

మహిళా రెజ్లర్లకు బ్రిజ్‌ భూషణ్‌వేధింపులు నిజమే

సాక్ష్యాలు ఉన్నాయి.. కోర్టుకు తెలిపిన ఢిల్లీ పోలీసులు

న్యూఢిల్లీ: భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యుఫ్‌ఐ) మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ సింగ్‌ తనకు అవకాశం దొరికిన ప్రతిసారీ మహిళా రెజర్లను వేధించారని ఢిల్లీ పోలీసులు కోర్టుకు తెలిపారు. ఉద్దేశపూర్వకంగానే రెజర్ల గౌరవానికి భంగం కలిగించారని పేర్కొన్నారు. బ్రిజ్‌ భూషణ్‌కు వ్యతిరేకంగా సాక్ష్యాధారాలు ఉన్నాయని కోర్టుకు సమర్పించిన నివేదికలో పోలీసులు పేర్కొన్నారు. తమపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు ఆరుగురు మహిళా రెజ్లర్లు దాఖలు చేసిన కేసులో చార్జిషీట్‌ దాఖలు చేసిన తర్వాత బ్రిజ్‌ భూషణ్‌పై అభియోగాల నమోదు కోసం ఢిల్లీలోని రౌస్‌ అవెన్యూ కోర్టు ఇరు వర్గాల వాదనలు వింటోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసుల తరఫున అడిషనల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ అతుల్‌ శ్రీవాస్తవ వాదనలు వినిపిస్తున్నారు. బ్రిజ్‌ భూషణ్‌కు తాను ఏం చేస్తున్నానో తనకు తెలుసునని, రెజ్లర్ల గౌరవానికి భంగం కలిగించడమే ఆయన ఉద్దేశమని శ్రీవాస్తవ కోర్టుకు తెలిపారు. క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ (సిఆర్‌పిసి) కింద సెక్షన్లు 161 (పోలీసులు సాక్షులను విచారించడం), 164 (మేజిస్ట్రేట్‌ చేత రికార్డ్‌ చేసిన వాంగ్మూలాలు) కింద రాతపూర్వక ఫిర్యాదు, రెండు రికార్డ్‌ చేసిన వాంగ్మూలాలు ఇందులో ఉన్నాయి. బ్రిజ్‌ భూషణ్‌పై అభియోగాలు నమోదు చేసే అధికారం కోర్టు పరిధిలో ఉందని శ్రీవాస్తవ తెలిపారు. భారత్‌ వెలుపల జరిగే కేసులకు సిఆర్‌పిసి సెక్షన్‌ 188 కింద అనుమతి అవసరమని బ్రిజ్‌ భూషణ్‌ తరఫు న్యాయవాది చేసిన వాదనను ఆయన తిప్పికొట్టారు. అయితే, గతంలో ఇచ్చిన తీర్పును శ్రీవాస్తవ ప్రస్తావిస్తూ, అన్ని నేరాలు భారతదేశం వెలుపల జరిగితేనే అనుమతి అవసరమని వాదించారు. ఈ నేరాలు ఢిల్లీతో పాటు ఇతర ప్రాంతాల్లో జరిగాయని, అందువల్ల అనుమతి అవసరం లేదని ఆయన అన్నారు. బ్రిజ్‌ భూషణ్‌ తరపు న్యాయవాది రాజీవ్‌ మోహన్‌ వాదనలు వినిపిస్తూ, ఆ అనుమతి పొందితే తప్ప దేశం వెలుపల జరిగిన నేరాలపై నిర్ణయం తీసుకునే అధికారం ఢిల్లీ కోర్టుకు లేదని అన్నారు. భారత శిక్షాస్మృతి (ఐపిసి) లోని సెక్షన్లు 354 (మహిళ గౌరవానికి భంగం కలిగించే ఉద్దేశ్యంతో దాడి లేదా క్రిమినల్‌ బలవంతం), 354 ఏ (లైంగిక వేధింపులు), 354 డి (వెంబడించడం), 506 (క్రిమినల్‌ బెదిరింపు) కింద ఢిల్లీ పోలీసులు ఈ ఏడాది జూన్‌ 15 న ఛార్జీషీట్‌ దాఖలు చేశారు. అదనపు చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ హర్జీత్‌ సింగ్‌ జస్పాల్‌ జులై 20న బ్రిజ్‌ భూషణ్‌, సస్పెండ్‌ అయిన డబ్ల్యూఎఫ్‌ఐ అదనపు కార్యదర్శి వినోద్‌ తోమర్‌లకు బెయిల్‌ మంజూరు చేశారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments