HomeNewsBreaking Newsమహిళా భద్రతలో దేశానికే ఆదర్శం

మహిళా భద్రతలో దేశానికే ఆదర్శం

పోలీస్‌ శాఖపై రాష్ట్ర మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ సునీతా లక్ష్మారెడ్డి ప్రశంస
ప్రజాపక్షం/హైదరాబాద్‌: రాష్ట్రంలో మహిళా భద్రతపై పోలీసు శాఖ చేపట్టిన పలు వినూత్న కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ వి.సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. రాష్ట్రంలో మహిళల భద్రతపై పోలీసు శాఖ ద్వారా అమలవుతున్న పలు కార్యక్రమాలపై హైదరాబాద్‌లోని డిజిపి కార్యాలయంలో శనివారం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో సునీతాలక్ష్మారెడ్డితో పాటు ఇతర సభ్యు లు, డిజిపి ఎం.మహేందర్‌ రెడ్డి, మహిళా భద్రత విభా గం అడిషనల్‌ డి.జి స్వాతి లక్రా, హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పోలీసు కమిషనర్లు అంజనీకుమార్‌, వి.సి.సజ్జనార్‌, మహేష్‌ భగవత్‌, డిఐజి సుమతి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో మహిళా భద్రతపై పోలీసు శాఖ ద్వారా అమలవుతున్న పలు కార్యక్రమాలను సునీ తాలక్ష్మారెడ్డి ప్రశంసించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళాభద్రతపై పోలీసు శాఖ అమలు చేస్తున్న పలు కార్యక్రమాల ద్వారా రాష్ట్రంలోని మహిళల్లో ఆత్మవిశ్వాసం ఏర్పడిందన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం, సైబర్‌ నేరాల పట్ల పిల్లలు, యువతులు, మహిళలకు చైతన్య కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహించడాన్ని ఆమె అభినందించారు. ప్రవాసభారతీయుల వివాహాలకు సంబంధించిన కేసుల విషయంలో ఎన్‌ఆర్‌ఐ సెల్‌ను మరింత పటిష్టపర్చాలని సూచించారు. మహిళలపై జరిగే అత్యాచారలకు సంబంధించి నిందితులకు శిక్ష పడడంతో పాటు బాధిత మహిళలకు తగు సహాయ, పునరావాస కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. డిజిపి మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం మహిళా భద్రతకు ముఖ్యమంత్రి కెసిఆర్‌ అత్యంత ప్రాధాన్యత ఇచ్చారన్నారు. ఇందులో భాగంగానే ప్రత్యేకంగా మహిళా భద్రత విభాగాన్ని ఏర్పాటు చేశామని వివరించారు. 2014లో షీ-టీంలు, 2016లో భరోసా కేంద్రాలను ప్రారంభించామని, దేశంలోని మరే రాష్ట్రంలో లేనివిధంగా పోలీసు నియామకాల్లో 33శాతం రిజర్వేషన్‌ను మహిళలకు కేటాయించిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని గుర్తుచేశారు. ప్రజల భాగస్వామ్యంతోనే పటిష్టమైన పోలీసింగ్‌ సాధ్యమని, ఈ నేపథ్యంలో పౌర సమాజం భాగస్వామ్యంతోనే మూడు కమిషనరేట్‌ల పరిధిలో ఆరు లక్షలకు పైగా సిసి కెమెరాలను ఏర్పాటు చేశామని వివరించారు. మహిళా భద్రతలో భాగంగా రాష్ట్రంలోని అన్ని పోలీసు కమిషనరేట్‌లు, ఎస్‌పి కార్యాలయాలు, పోలీస్‌ స్టేషన్లలో మహిళా భద్రతకు అత్యంత ప్రాధాన్యతను ఇచ్చేలా చర్యలు చేపట్టామని డిజిపి వివరించారు. మహిళలపై జరిగే నేరాలను పోలీసు శాఖ సీరియస్‌గా తీసుకుంటుందని, దీనిలో భాగంగా నిందితులకు శిక్ష పడేలా చర్యలు చేపట్టామని తెలిపారు. బాల్య వివాహాల నిరోధానికి ప్రాధాన్యతనిస్తున్నామన్నారు. గృహహింస అనేది సామాజిక సమస్య అని, ఈ అంశంపై చేపట్టాల్సిన చర్యలపై మహిళా కమిషన్‌ తగు అధ్యయనం చేసి సూచనలు చేయాలని డిజిపి కమిషన్‌ను కోరారు. మహిళా భద్రత విభాగం అడిషనల్‌ డిజి స్వాతి లక్రా మాట్లాడుతూ మహిళలపై జరిగే నేరాలకు సంబంధించి మహిళా భద్రత విభాగానికి అందే ఫిర్యాదుల దర్యాప్తును, వాటి పరిష్కారాన్ని సాధ్యమైనంత త్వరితగతిన పూర్తి చేస్తున్నామని తెలిపారు. తమ సమస్యల పరిష్కారానికి షీ-టీమ్‌ లకు అందిన ఫిర్యాదులపై తీసుకున్న చర్యల పట్ల 96శాతం మహిళలు సంతృప్తి వ్యక్తం చేశారన్నారు. నగరంలో షీ-టీం ల గురించి 89శాతం మహిళలకు అవగాహన ఉందని తెలిపారు. హైదరాబాద్‌ నగరంలో మహిళా భద్రతా చర్యల్లో భాగంగా ఏర్పాటు చేసిన భరోసా కేంద్రాలను దాదాపు 10 రాష్ట్రాల ప్రభుత్వ ప్రతినిధులు, సుప్రీం కోర్టు న్యాయమూర్తులు, అధికారుల బృందం సందర్శించారని హైదరాబాద్‌ నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ తెలిపారు. సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో స్పెషల్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ ఏర్పాటు చేశామని కమిషనర్‌ సజ్జనార్‌ వివరించారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆజిపూర్‌ లాంటి సంఘటనల్లో నిందితులకు అతితక్కువ సమయంలోనే శిక్ష పడేలా చర్యలు చేపట్టామని రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేష్‌ భగవత్‌ తెలిపారు.

DO YOU LIKE THIS ARTICLE?
Prajapaksham
Prajapaksham
Praja Paksham Telugu News (తెలుగు వార్తలు) offers the Latest Telugu News, Breaking News in Telugu (ముఖ్యాంశాలు) from Andhra Pradesh and Telangana. National News, International News Headlines in Telugu Daily. prajapaksham.in is flagship online website of PrajaPaksham Newspaper
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments