అన్ని వర్గాలకు న్యాయం చేసే విధంగా చట్టం చేయాలి
భారత జాతీయ మహిళా సమాఖ్య
ప్రజాపక్షం/హైదరాబాద్ మహిళా బిల్లుపై సమగ్రంగా చర్చించి, అన్ని వర్గాలకు న్యాయం చేసే విధంగా చట్టం చేయాలని భారత జాతీయ మహిళా సమాఖ్య(ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ) జాతీయ కార్యదర్శి డాక్టర్ రజిని అన్నారు. హైదరాబాద్ హిమాయత్ నగర్‌లోని ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రజిని మాట్లాడుతూ ప్రపంచంలో అన్ని దేశాల కంటే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం అన్నారు. జనాభాలో సగభాగం మహిళలు ఉన్నారని, జనాభాకు అనుగుణంగా చట్టసభలలో మహిళలకు సముచిత స్థానం కల్పించాలని భారత జాతీయ మహిళా సమాఖ్య సంవత్సరాలుగా పార్లమెంట్ లోపల బయట నిరంతరం నిర్వీరామ క్రియాశీల పోరాటాలు నిర్వహించిందన్నారు. పార్లమెంట్‌లో మొట్టమొదటిసారిగా గీతా ముఖర్జీ మహిళలకు కనీసం 33 శాతం రిజర్వేషన్‌లు కల్పించి, రాజ్యాధికారంలో మహిళలని భాగస్వామ్యులను చేసినప్పుడే దేశం సమగ్రంగా అభివృద్ధి చెందుతుందని, 12 సెప్టెంబర్ 1996న బిల్లు ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. తర్వాత 1998,1999, 2008లలో ప్రవేశ పెట్టినప్పటికి అనేక అడ్డంకులతో ఆమోదం కాలేదన్నారు. తిరిగి 2010లో బిల్లు ప్రవేశ పెట్టినప్పటికీ వీగి పోయిందని తెలిపారు. నాటి నుండి నేటి వరకు దేశ నలుమూలల భారత జాతీయ మహిళా సమాఖ్య పోరాటాలను కొనసాగిస్తూ వస్తున్న ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం 33 శాతం రిజర్వేషన్‌లు మహిళలకు కల్పించడాన్ని స్వాగతిస్తున్నామని రజిని అన్నారు. పార్లమెంట్‌లో చట్టాలు తయారు చేసేటప్పుడు మహిళలు చురుకుగా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మహిళల హక్కులతో పాటు మానవ హక్కులను దృష్టితో చర్చిస్తారన్నారు. మహిళలకు రాజకీయ రంగంలో స్వరాజ్యం వచ్చి 76 సంవత్సరాల తర్వాత పాలకులకు జ్ఞానోదయం కలగడం ఆలస్యమైనప్పటికీ అభినందనీయం అన్నారు. జాతీయ మహిళా సమాఖ్య దేవగౌడ ప్రధానిగా ఉన్నప్పుడు పార్లమెంట్‌లో గీతా ముఖర్జీ ఈ బిల్లును ప్రవేశపెట్టారని, అప్పుడు రాజ్యసభ ఆమోదించినప్పటికీ లోకసభలో వాయిదా వేయడం పార్లమెంట్‌లో పురుష ఆధిక్యత నిలబెట్టుకోవడం దురదృష్టకరమన్నారు. పారిశ్రామికవేత్తలుగా మహిళలకు భాగస్వామ్యం రానున్న కాలంలో కల్పించాలని కోరారు. మహిళా సమాఖ్య సీనియర్ నాయకురాలు పశ పద్మ ప్రేమ పావని మాట్లాడుతూ ప్రస్తుతం ప్రవేశపెట్టిన బిల్లులో మొదటిసారిగా పోరాడిన గీతా ముఖర్జీ పేరు ప్రస్తావించకపోవడం దురదృష్టకరమన్నారు. ఫిక్స్‌డ్ టైమ్ ప్రైమ్ లేదని, బిల్లు ఆమోదించినప్పుడు 2029లో జనాభా లెక్కల ఎన్నికల డిలిమిటేషన్ కసరత్తు తర్వాత అమలు చేయబడుతుందని, ప్రతిపాదన ఇది మహిళలపై ప్రతికూల ప్రభావం చూపెడుతుందని విమర్శించారు. ఢిల్లీ జాతీయ రాజధాని ప్రాంతం గురించి స్పష్టమైన ప్రస్తావన ఉన్నప్పటికీ ఇద్దర కేంద్ర పాలిత ప్రాంతాల గురించి ప్రస్తావించలేదన్నారు. బిల్లును సమగ్రంగా చర్చించి, అన్ని వర్గాలకు న్యాయం చేసే విధంగా చట్టం చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యు రాష్ట్ర అధ్యక్షురాలు ఉస్తేల సృజన, ప్రధాన కార్యదర్శి నేదునూరి జ్యోతి, సహాయ కార్యదర్శి ఎం.డి. ఫైమీద హైదరాబాద్ జిల్లా అధ్యక్షురాలు పడాల నళిని తదితరులు పాల్గొన్నారు.
మహిళా బిల్లుపై సమగ్ర చర్చ
RELATED ARTICLES