న్యూఢిల్లీ : సిపిఐ నాయకురాలు, మహిళా ఉద్యమ నేత ప్రమీలా లూంబా కన్నుమూశారు. ఆమె వయస్సు 94 సంవత్సరాలు. జాతీయ మహిళా సమాఖ్య (ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యు) అగ్రనాయకురాలిగా గుర్తింపుపొందిన లూంబా సోమవారంనాడు ఢిల్లీలో తుదిశ్వాస విడిచారు. లూంబా ప్రముఖ విద్యావేత్త. ఢిల్లీలోని ఎన్నో ప్రముఖ విద్యాసంస్థలతో ఆమెకు అనుబంధముంది. గత కొంతకాలంగా ఆమె అస్వస్థతతో ఉన్నప్పటికీ, ఆఖరి నిమిషం వరకు ఆమె చురుగ్గానే వున్నారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌తోపాటు మహిళా సాధికారత కోసం లూంబా అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు. ఆమె భర్త, ఎఐటియుసి కార్యదర్శిగా పనిచేసిన సతీష్ లూంబా కొంతకాలం క్రితం ఒక ప్రమాదంలో మరణించారు. మహిళా ఉద్యమంలో గొప్ప నేతగా ప్రమీలా లూంబా ప్రశంసలు అందుకున్నారు. రెండుసార్లు సిపిఐ జాతీయ సమితి సభ్యులుగా కూడా పనిచేశారు. ఆమె మృతి పట్ల సిపిఐ జాతీయ కార్యదర్శివర్గం ప్రగాఢ సంతాపం తెలియజేసింది. ఈనెల 25వ తేదీ మంగళవారంనాడు జరిగిన లూంబా అంత్యక్రియల్లో సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి, కార్యదర్శులు డి.రాజా, అతుల్ కుమార్ అంజాన్, పెద్దసంఖ్యలో సిపిఐ, మహిళా నాయకులు, కార్యకర్తలు పాల్గొని నివాళులర్పించారు.
మహిళా ఉద్యమనేత ప్రమీలా లూంబా కన్నుమూత
RELATED ARTICLES