‘నిర్భయ’తోనూ ఆగని అత్యాచారాలు
తక్షణమే మద్యాన్ని నియంత్రించాలి
ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యు రాష్ర్ట విస్తృత కౌన్సిల్ సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి
ప్రజాపక్షం / హైదరాబాద్ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళలపై హింస విపరీతంగా పెరిగిపోయిందని, నిర్భయ చట్టం వచ్చినప్పటికీ మహిళల మీద అత్యాచారాలు ఆగడం లేదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి విమర్శించారు. మద్యాన్ని ఆదాయ వనరుగా చూస్తు న్న రాష్ట్ర ప్రభుత్వం… మద్యం షాపుల సంఖ్య పెంచడం సిగ్గుచేటు అని మండిపడ్డారు. మద్యం మత్తులో మహిళలపై హింస పెరుగుతుందని, తక్షణమే మద్యాన్ని నియంత్రించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లోని మఖ్దూంభవన్‌లో భారత జాతీయ మహిళా సమాఖ్య(ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యు) రాష్ర్ట విస్తృత కౌన్సిల్ సమావేశం బుధవారం రాష్ర్ట అధ్యక్షురాలు ఉస్తేల సృజన అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వం… ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందన్నారు. కార్పొరేట్ శక్తులకు తలొగ్గి ప్రభుత్వ రంగ సంస్థలను వారికి ధారాదత్తం చేస్తున్నారని ధ్వజమెత్తారు. నిత్యావసర వస్తువుల ధరలు, పెట్రోల్, డీజిల్ ధరలు, గ్యాస్ ధరలు చుక్కలు చూపెడుతున్నాయని, ధరల పెరుగుదల కారణంగా మహిళలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. వీటిని నియంత్రించడంలో ప్రభుత్వాలు తీవ్రంగా విఫలమయ్యాయని విమర్శించారు విద్యుత్ చార్జీలు కూడా విపరీతంగా పెంచడం వల్ల పేద,మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అభిప్రాయపడ్డారు. రాష్ర్టంలోని టిఆర్‌ఎస్ ప్రభుత్వం కూడా ఎన్నికలలో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందని విమర్శించారు. రాష్ర్టంలో కూడా పసిపిల్లలపై, మహిళలపై విపరీతంగా దాడులు పెరిగిపోయాయని, వాటిని నియంత్రించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు. అర్హులైన పేద మహిళలందరికీ డబుల్ బెడ్ రూమ్‌లు ఇవ్వాలని, రేషన్ కార్డులు ఇవ్వాలని, గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేసే మహిళలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, తక్షణమే వారి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యు జాతీయ కార్యదర్శి డాక్టర్ రజని మాట్లాడుతూ గీత ముఖర్జీ నాయకత్వంలో మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని పార్లమెంట్‌లో బిల్లు పెట్టి 25 సంవత్సరాలు అయిందని, నేటికీ బిల్లుకు మోక్షం రాకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం తమకు కావాల్సిన చట్టాలను దొడ్డిదారిలో పాస్ చేయించుకుంటుందని, మహిళా బిల్లు విషయానికి వచ్చే సరికి అఖిలపక్షం సహకరించడం లేదని చెప్పడం దారుణమన్నారు. ఇప్పటికైనా మహిళా బిల్లును ప్రవేశపెట్టకపోతే మహిళా సమాఖ్య ఉద్యమాలను తీవ్రతరం చేస్తుందని హెచ్చరించారు. గ్రామీణ మహిళలు రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారని, వారికి సరైన పౌష్టికాహారం అందించాలని, ఆడపిల్లల భద్రతకు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా సమాఖ్య రాష్ర్ట సీనియర్ నాయకురాలు ప్రేమ్ పావని, ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యు రాష్ర్ట ప్రధాన కార్యదర్శి నేదునూరి జ్యోతి, ఉపాధ్యక్షురాలు ఎస్ ఛాయాదేవి, లలితాదేవి, సహాయ కార్యదర్శి జై లక్ష్మి కష్ణకుమారి, కార్యవర్గ సభ్యులు సుగుణమ్మ, రహీల, గిరిజ,ఫైమిద, జంగమ్మ, మల్లేశ్వరి,కౌన్సిల్ సభ్యులు కోటమ్మ, పద్మజ రత్నకుమారి, పద్మ, రాధ, శాంత మహేశ్వరి, జ్యోతి శ్రీమాన్, నాగ జ్యోతి, హైమవతి తదితరులు పాల్గొన్నారు.
మహిళలపై పెరిగిన హింస
RELATED ARTICLES