పేద స్త్రీలకు ఏటా రూ. 1 లక్ష మహాలక్ష్మీ పథకం
చట్టసభల్లో తక్షణం రిజర్వేషన్ల అమలు
ప్రతిజిల్లాలో సావిత్రీబాయ్ ఫూలే హాస్టల్స్
కాంగ్రెస్ అధికారంలోకొస్తే మహిళలకు ఐదు గ్యారంటీలు అమలు చేస్తాం
మహారాష్ట్ర బహిరంగ సభలో రాహుల్ ప్రకటన
ధూలే : లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీని గెలిపిస్తే దేశంలో మహిళలకు “మహిళా న్యాయ్” పేరుతో ‘ఐదు గ్యారంటీలు’ అమలు చేస్తామని మహారాష్ట్రలో బుధవారం జరిగిన బహిరంగసభలో రాహుల్‌గాంధీ హామీ ఇచ్చారు. కాంగ్రెస్‌పార్టీ కేంద్రంలో అధికారంలోకి రాగానే చట్టసభల్లో మహిళా రిజర్వేషన్‌లను అమలు చేస్తామన్నారు. పేద మహిళలకు ప్రతి సంవత్సరం లక్ష రూపాయకలు నగదు, మహిళలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 50 శాతం రిజర్వేషన్‌లను తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అమలు చేస్తామని రాహుల్‌గాంధీ ప్రకటించారు. దేశంలోని ప్రతి జిల్లాలో ‘సావిత్రీబాయ్ ఫూలే హాస్టల్స్’ మహిళలకోసం ఏర్పాటు చేస్తామని చెప్పారు. మహారాష్ట్ర ధూలే జిల్లాలోఅచ్చంగా మహిళలు పాల్గొన్న పెద్ద బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. రాహుల్‌గాంధీ మణిపూర్ నుండి ప్రారంభించిన భారత్ జోడో న్యాయ యాత్రలో భాగంగా మహారాష్ట్ర పర్యటనలో ఈ ప్రకటన చేశారు. ఆశా వర్కర్లు, (అక్రెడిటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిస్ట్), అంగన్‌వాడీలలో పనిచేసే మహిళలు (ప్రభుత్వం నడిపే స్త్రీ శిశు సంక్షేమ కేంద్రాలు), మధ్యాహ్న భోజన పథకాలలో కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ఇస్తున్న బడ్జెట్ వాటాలను రెట్టింపు చేస్తామని కూడా రాహుల్‌గాంధీ మహిళలకు భరోసా ఇచ్చారు. మహిళలకు వచ్చే అనేక సమస్యల నుండి వారిని రక్షించేందుకు వీలుగా ఒక నోడల్ అధికారిని ఏర్పాటు చేఇ, వారి హక్కుల సాధన అంశాలపై చైతన్య వంతులను చేస్తామని, మహిళలు తమ హక్కుల కోసం తామే కేసులు వాదించుకుని పోరాడేవిధంగా వారికి శిక్షణ ఇస్తామని చెప్పారు. రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్ర తొలివిడతలో ఇప్పటికే కన్యా కుమారి నుండి శ్రీనగర్ వరకూ 4,000 కిలోమీటర్లు పాదయాత్ర పూర్తిచేశారు. ఈ రెండో విడత మణిపూర్ నుండి ముంబయ్ వరకూ తలపెట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్రలో కూడా లక్షలాదిమంది ప్రజలతో ఆయన తన అభిప్రాయాలు పంచుకుంటున్నారు. పేదలు, సామాన్య ప్రజలు, విద్యార్థులు, యువకులు, మహిళల సమస్యలు వింటున్నారు. తన యాత్ర సందర్భంగా ఎక్కువ మంది మహిళలు తాము హింసకు గురి అవుతున్నట్లు చెప్పారన్నారు.
కాంగ్రెస్ భాగీదారీ
అన్యాయం జరుగుతున్న కారణంగా హింస, విద్వేషాలున్నాయని చెప్పారన్నారు. దేశంలో 16 లక్షల కోట్ల రూపాయలను ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు రద్దు చేసిందనీ, కానీ రైతులు, యువకులకు ఉన్న అప్పులను మాత్రం రద్దు చేయకుండా వారిని అణచివేతకు గురిచేస్తోందని ధూలే ర్యాలీలో రాహుల్‌గాంధీ మోడీ ప్రభుత్వాన్ని విమర్శించారు. కాంగ్రెస్‌పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే ప్రజలందరినీ భాగస్వాములు (భాగీదారీ) చేస్తుందని చెప్పారు. కులాలు, మతాలకు అతీతంగా నిర్ణయాలు చేయడంలోనూ, దేశ ప్రజలకు వనరులు పంపిణీ చేయడంలోనూ అందరినీ భాగసాములను చేస్తామనీ, సమ్మిళితం చేస్తామని రాహుల్‌గాంధీ ప్రకటించారు. లోక్‌సభలో రిజర్వేషన్ బిల్లును ఆమోదించడం ద్వారా దేశంలో మహిళలను మోడీ ప్రభుత్వం వెర్రిబాగులవాళ్ళను చేసేసిందని, బిల్లును చట్టంగా మార్చినప్పటికీ దానిని అమలుచేసే పరిస్థితులు కల్పించలేదని విమర్శించారు. ఈ చట్టం అమలులోకి రావాలంటే కనీసం పది సంవత్సరాలు పైగా ఆగాలని కేంద్రం చెబుతోందని విమర్శించారు. రాహుల్‌గాంధీ కంటే ముందుగా ఈ సభలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్‌లు ప్రసంగించారు.
మా హామీలు జుమ్లా కాదు, శిలాశాసనం
దీనికంటే ముదుగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఒక వీడియో సందేశం ఇస్తూ, మహాలక్ష్మీ పథకం కింద దేశంలో పేద మహిళలకు రూ.1 లక్ష బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తామని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో 50 శాతం మహిళలకు ఉద్యోగాలు రిజర్వే చేస్తామని చెబుతూ దీనిని హిందీలో “ఆధి అబది పూరా హక్” గా పేర్కొన్నారు. కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి వస్తే ఇప్పుడు బహిరంగ సభలో చేస్తున్న వాగ్దానాలన్నింటినీ పక్కాగాఅమలు చేస్తామని ఖర్గే ప్రకటించారు. “మేం చేసే వాగ్దానాలు జుమ్లా కాదు, పక్కాగా అమలుచేస్తాం, మా వాగ్దానాలు శిలాశాసనం, వాటిని అమలుచేసి తీరుతాం” అని ఖర్గే ఉద్ఘాటించి చెప్పారు. మహిళలకు వారి హక్కులను తెలియజేసేవిధంగా విద్యావంతులను చేస్తామనీ, దీనికోసం ఒక “అధికార్ మైత్రి” (నోడల్ ఆఫీసర్)ను నియమిస్తామని, వారు తమ హక్కులకోసం పోరాటం చేయడానికి ఈ నోడల్ అధికారి సహాయం చేస్తారని ఖర్గే ఆ వీడియో సందేశంలో తెలియజేశారు. జైరామ్ రమేశ్ మాట్లాడుతూ, కాంగ్రెస్‌పార్టీ దేశంలోని ప్రతి గ్రామ పంచాయతీలోనూ ఒక అధికార్ మైత్రిని ఏర్పాటు చేస్తామని, వారు మహిళల హక్కులకోసం పోరాడతారని, మహిళలకు వారు సహకరిస్తారని చెప్పారు.
మహిళలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 50 శాతం రిజర్వేషన్
RELATED ARTICLES