వందల్లో మరణాలు.. భారీగా ఆస్తి నష్టం..
ముంబయి: మహారాష్ట్రను భారీ వర్షాలు, వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. వందల సంఖ్య లో మరణాలు సంభవించగా, గల్లంతైన వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. ఇక జరిగిన నష్టం గురించి ఎంత చెప్పి నా తక్కువే. వందలాది ఇళ్లు పాక్షికంగా లేదా పూర్తిగా ధ్వంసమయ్యాయి. రహదారులపై నడిచే పరిస్థితులు కూడా లేవు. భారీ ఆస్తి నష్టం జరిగిన నేపథ్యం లో రాష్ట్రం ఎప్పటికి కోలుకుంటుందోనన్న ఆందోళన వ్యక్తమవుతున్నది. భారీ వర్షాలకు ఇళ్లు కూలడం, కొండ చరియలు విరిగిపడడం వంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ కారణంగా గత రెండు రోజుల్లో మృతి చెందిన వారి సంఖ్య 136కి పెరిగిందని అనధికార వర్గాల సమాచారం. రాయ్‌ఢ్, రత్నగిరి తదితర జిల్లాల్లో సుమారు 90,000 మందిని లోతట్టు ప్రాంతాల నుంచి సురక్షిత స్థలాలకు తరలించారు. రాయ్‌గఢ్ జిల్లా మహర్ తాలూకాలోని తలాయి గ్రామంలో మొత్తం 30 ఇళ్లు ఉండగా, కొండ చరియలు విరిగిపడడంతో అవన్నీ శిథిలమయ్యాయి. ఈ ఘటనలో మరణించిన వారి సంఖ్య 44కు చేరింది. శిథిలాల కింద ఎంత మంది ఉన్నారో తెలియడం లేదు. ఈ ఒక్క జిల్లాలోనే ఆరు చోట్ల కొండ చెరియలు విరిగిపడడం ప్రకృతి బీభత్సానికి అద్దం పడుతున్నది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే హెలికాప్టర్ ద్వారా వరద ముంపు ప్రాంతాలను సందర్శించారు. బాధితులను అన్ని రకాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. భారీ వర్షాలు, వరదల కారణంగా 76 మంది మృతి చెందారని, 38 మంది గాయపడ్డారని తెలిపారు. 30 ఆచూకీ తెలియడం లేదని అన్నారు. ప్రస్తుతం వరద ఉధృతి కొంత తగ్గినప్పటికీ, అది సృష్టించిన విలయం, విషాదం ఇంకా సమస్యలను సృష్టిస్తునే ఉన్నాయి. గ్రామాలకు గ్రామాలే ఇతర ప్రాంతాలతో సంబంధం లేకుండా వరద నీటిలో చిక్కుకపోవడంతో, సహాయక చర్యలు ముమ్మరం చేశారు. అయితే, చాలా వరకు రోడ్లు పూర్తిగానో, పాక్షికంగానో ధ్వంసం కావడంతో సహాయక చర్యలకు విఘాతం ఏర్పడుతున్నది. నిపుణుల అంచనా మేరకు మహారాష్ట్రలో పరిస్థితులు చక్కబడేందుకు కనీసం ఐదారు మాసాలు పడుతుంది. అంతవరకూ ప్రజలకు కష్టాలు తప్పవు. రాబోయే కాలంలో మరిన్ని వర్షాలు పడితే, పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుందనే ఆందోళన ప్రజల్లో లేకపోలేదు.
‘మహా’ విషాదం
RELATED ARTICLES