ప్రజాపక్షం/ హైదరాబాద్ టిఆర్‌ఎస్‌కు చెందిన ప్రజాప్రతినిధులతో “మహా సమావేశాన్ని” నిర్వహించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించినట్టు తెలిసింది. రాష్ట్రంలో దాదాపు అన్ని ఎన్నికలు పూర్తయ్యాయి. లోక్‌సభ ఎన్నికలు మినహా అన్ని ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. దీంతో టిఆర్‌ఎస్‌కు చెందిన ప్రజాప్రతినిధులతో ఒక సమావేశాన్ని నిర్వహించి వారికి దిశనిద్దేశం చేయాలని కెసిఆర్ భావిస్తున్నట్టు సమాచారం. ఎంపిలు, ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు, జెడ్‌పి చైర్మన్లు, వైస్‌చైర్మన్లు, మేయర్లు, మున్సిపల్ చైర్‌పర్సన్లు ఇలా ప్రజాప్రతినిధులందరినీ ఈ సమావేశానికి ఆహ్వానించే అవకాశాలు ఉన్నాయి. ఈ నెల రెండవ వారంలోనే ఈ సమావేశాన్ని నిర్వహించాలని సిఎం యోచిస్తుండగా, కెసిఆర్ జన్మదినం రోజైన ఈ నెల 17వ తేదీన ఈ సమావేశం నిర్వహించే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే ఇదే నెల రెండవ వారంలోనే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైతే, జన్మదినం తర్వాత ఈ సమావేశాన్ని నిర్వహించే అవకాశాలు లేకపోలేదు. రాష్ట్రంలో రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత టిఆర్‌ఎస్ వరుసగా పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో భారీ విజయం సాధించింది. పైగా పంచాయతీరాజ్, మున్సిపల్ వంటి కొత్త చట్టాలను కూడా ప్రవేశపెట్టారు. దీనికి తోడు త్వరలోనే కొత్త రెవెన్యూ చట్టం కూడా తీసుకురావాలని సిఎం కెసిఆర్ భావిస్తున్నారు. ఈ విషయాలపై కూడా ప్రజాప్రతినిధులకు సిఎం కెసిఆర్ దిశనిర్ధేశం చేసే అవకాశాలు ఉన్నాయి. పైగా వరుస విజయాలనేపథ్యంలో ప్రజాప్రతినిధులందరితో ఒక సమావేశాన్ని నిర్వహించి ఇప్పటి వరకు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, అమలు చేసిన సంక్షేమ పథకాల ను వివరిస్తూనే రానున్న నాలుగు సంవత్సరాల ప్రభుత్వ పాలన ఎలా ఉండబోతుందో వారికి వివరించే అవకాశం ఉన్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
మహా భేటీకి టిఆర్‌ఎస్ కసరత్తు
RELATED ARTICLES