శివసేన, ఎన్‌సిపి, కాంగ్రెస్ ఎంఎల్‌ఎలతో మహా బల ప్రదర్శన
162 మంది శాసనసభ్యులు హాజరైనట్లు శివసేన ఎంపి సంజయ్‌రౌత్ ప్రకటన
ముంబయి: క్షణక్షణం ఉత్కంఠను రేపుతున్న మహారాష్ట్ర రాజకీయం సోమవారం రాత్రి గ్రాండ్ హయత్‌హోటల్‌కు చేరింది. సుప్రీంకోర్టు తీర్పునకు ముందే శివసేన-, ఎన్‌సిపి,- కాంగ్రెస్ పార్టీలు తమతో ఉన్న ఎంఎల్‌ఎలతో మీడియా ఎదుట పరేడ్ నిర్వహించాయి. తద్వారా తమ బలాన్ని బాహ్య ప్రపంచానికి చాటిచెప్పాలనే ప్రయత్నంలో భాగంగా ఈ బల ప్రదర్శనకు శ్రీకారం చుట్టారు. తమ ఎంఎల్‌ఎలు చేజారిపోకుండా కాపాడుకుం టూ ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ వస్తున్న ఆ మూడు పార్టీలు ఎంఎల్‌ఎలందరినీ గ్రాండ్ హయత్ హోటల్ వద్దకు చేరుస్తున్నాయి. తమ మూడు పార్టీలతో పాటు స్వతంత్రులు, చిన్నా చిత కా పార్టీలకు చెందిన మొత్తం 162 మంది ఎంఎల్‌ఎలు తమ వెంట ఉన్నారంటూ చెబుతున్న నేతలు వారిని మీడియా ముందుకు తీసుకొచ్చారు. గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారీ పిలిస్తే అక్కడికే వెళ్లి పరేడ్ నిర్వహిస్తామని శివసేన నేతలు చెబుతున్నారు. ఈ పరేడ్‌ను గవర్నర్ చూస్తారని భావిస్తున్నట్టు శివసేన నేతలు ఆశాభావం వ్యక్తంచేశారు. ముంబయిలోని పలు స్టార్ హోటళ్లలో ఉన్న ఎంఎల్‌ఎలంతా ప్రత్యేక బస్సుల్లో గ్రాండ్ హయత్ వద్దకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఎంపి సం జయ్ రౌత్ మహారాష్ట్ర గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారీకి సవాలు విసిరారు. ప్రస్తుతం తమ వద్ద 162 మంది శాసనసభ్యులు ఉన్నారని, అవసరమైతే స్వయంగా వచ్చి చూసుకోవాలని అన్నారు. కాగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తమకు పూర్తి మెజార్టీ ఉందని, కానీ బల నిరూపణకు గవర్నర్ అవకాశం ఇవ్వట్లేదని రౌత్ పేర్కొన్నారు. దీంతో బహిరంగ బలప్రదర్శనకు దిగుతున్నట్లు వెల్లడించారు. ‘రండి.. వచ్చి చూడండి.. మాతో 162 మంది ఉన్నారు’ అని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లిఖార్జున ఖర్గే అన్నారు. కాగా, కోర్టు తీర్పునకు ఒక రోజు ముందే కూటమి నేతలు తమ శాసనసభ్యులలతో పరేడ్ నిర్వహించడం గమనార్హం. ముంబయిలోని గ్రాండ్ హయత్ హోటల్‌లో చేపట్టిన ఈ పరేడ్ వద్దకు ఎన్‌సిపి అధినేత శరద్ పవార్, కాంగ్రెస్ నేతలు మల్లిఖార్జున ఖర్గే, అశోక్ చవాన్, బాలాసాహెబ్ థోరాట్‌తో పాటు శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాక్రే, ఆయన తనయుడు ఆదిత్య థాక్రే, ఎన్‌సిపి ఎంపి, శరద్ పవార్ కుమా ర్తె సుప్రియా సూలే, తదితర కీలక నేతలంతా హోటల్ వద్దకు చేరుకున్నారు. ఇదిలా ఉండగా హోటల్‌కు హాజరైన ఎంఎల్‌ఎలనుద్దేశించి ఉద్ధవ్ థాక్రే ప్రసంగించారు. తమ పోరాటం ఎంతమాత్రమూ అధికారం కోసం కాదని ఆయన ప్రకటించారు. తమ పోరాటం ‘సత్యమేవ జయతే’ అన్న దానికోసమే కానీ, ‘సత్తా మేవ జయతే’ కోసం కాదని (అధికారం కోసం కాదు) అన్నారు. తమ కూటమిని ఎంత చీల్చాలని చూస్తే తమ మధ్య బంధం మరింత గట్టిదవుతుందని చెప్పారు. ఇంతటి రాజకీయ క్రీడ వెనకున్న నేతలను తాము ఓడించి తీరుతామని స్పష్టం చేశారు. సత్యం ఎప్పటికైనా బయటికొస్తుందని, బిజెపితో తాము నేరుగానే తలపడతామని హెచ్చరించారు. తామేం చేస్తామో బిజెపికి చేతల్లోనే చూపిస్తామని ఉద్ధవ్ స్పష్టం చేశారు. శరద్ పవార్ ప్రసంగింగిస్తూ మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు చేసేందుకు తమ కూటమికే మెజార్టీ ఉందనీ.. తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చే యగలమన్న విశ్వాసం వ్యక్తంచేశారు. బలం లేని దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం నిలబడదని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో బలం లేకుండా తొలిసారి ఇలా ప్రభు త్వం ఏర్పాటైందని చెప్పారు. పొత్తులపై నిర్ణయం తీసుకొనే అధికారం అజిత్ పవార్‌కు లేదన్నారు. కర్ణాటక, గోవా, మణిపూర్‌లో మెజార్టీ లేకపోయినా బిజెపి ప్రభుత్వాలు ఏర్పడ్డాయని ఈ సందర్భంగా పవార్ గుర్తు చేశారు. ఇది గోవా కాదు.. మహారాష్ట్ర అని తెలుసుకోవాలని బిజెపి పరోక్షంగా హెచ్చరించారు. మ హారాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం కలిసి పనిచేద్దామని పవార్ పిలుపునిచ్చా రు. అంతకముందు కాంగ్రెస్ నేత అశోక్ చవాన్ మాట్లాడుతూ.. తమ కూటమికి 162 మంది కంటే ఎక్కువ మంది సభ్యుల బలమే ఉందన్నారు. రాష్ట్రంలో బిజెపి అధికారం దక్కనీయకుండా చేసేందుకు శివసేనకు మద్దతిచ్చిన తమ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి కృతజ్ఞతలు చెప్పారు. గవర్నర్ తమ కూటమిని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలన్నారు. వీరిద్దరి ప్రసంగాలు ముగిసిన తర్వాత 162 మంది ఎంఎల్‌ఎలతో ఐక్యంగా ఉంటామని ప్రతిజ్ఞ చేశారు.