ముంబయి: మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రే(59) ముంబయిలోని శివాజీ పార్క్‌లో గురువారం సాయంత్రం ప్రమాణస్వీకారం చేశారు. ఈ పార్క్‌లోనే ఆయన తండ్రి బాల్ థాక్రే తొలిసారి దసరా ర్యాలీలో ప్రసంగించి శివసేన ఆవిర్భావాన్ని 1966లో ప్రకటించారు. మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ ఇదే సందర్భంలో ‘మహా వికాస్ అఘాడి’కి చెందిన ఆరుగురికిపైగా మంత్రులచేత ప్రమాణస్వీకారం చేయించారు. కాషాయ సిల్క్ కుర్తాలో ఉద్ధవ్ థాక్రే ప్రమాణస్వీకారానికి ముందు ‘శివరాజ్యాభిషేక్’ లేక ఛత్రపతి శివాజీ విగ్రహానికి వంగి నమస్కరించారు. ఆ తర్వాత ఆయన మరాఠిలో ప్రమాణస్వీకారం చేశారు. ఆయన ప్రమాణస్వీకారం చేసేటప్పుడు పలువురు ప్రముఖ రాజకీయ నాయకులతో ఆయన భార్య రష్మీ థాక్రే, కుమారుడు ఆదిత్య థాక్రే కూడా ఉన్నారు. ప్రమాణస్వీకార వేదికను ఓ పెద్ద కోటలా బాలివుడ్ ఆర్ట్ డైరెక్టర్ నితిన్ దేశాయ్ ఘనమైన వేదికగా రూపొందించారు. శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రే తన ప్రమాణస్వీకారంలో తన తల్లిదండ్రులను గుర్చుచేసుకున్నారు. ఎన్‌సిపి నాయకుడు జయంత్ పాటిల్ ప్రమాణస్వీకారమప్పుడు శరద్ పవార్‌కు శాల్యూట్ చేయగా, కాంగ్రెస్ నాయకుడు ప్రమాణస్వీకారం సందర్భంగా సోనియా గాంధీని గురించి ప్రస్తావించారు. వేదికపై పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ, ఆయన భార్య నీతా అంబానీ, వారి కుమారుడు అనంత్ కూడా కూర్చున్నారు. ఉద్ధవ్ థాక్రే దూరం అయిన ఆయన కజిన్ రాజ్ థాక్రే కూడా ప్రమాణస్వీకారోత్సవానికి హాజరయ్యారు. ఆయనను ఉద్ధవ్ థాక్రే స్వయంగా బుధవారం సాయంత్రం ఈ వేడుకకు ఆహ్వానించారు. పెద్ద వివాదాస్పదంగా రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన బిజెపికి చెందిన మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా ఈ వేడుకకు హాజరయ్యారు. ఆయన మహారాష్ట్ర అసెంబ్లీలో బలపరీక్షకు ముందే తన పదవికి రాజీనామా చేసి తప్పుకున్నారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసి మళ్లీ ఆ పార్టీలోకి తిరిగొచ్చిన ఎన్‌సిపి నాయకుడు అజిత్ పవార్ కూడా హాజరయ్యారు. అయితే ఈసారి ఉద్ధవ్ థాక్రే స్వయంగా అజిత్ పవార్‌ని ఉపముఖ్యమంత్రిగా సయంగా సూచించారు. ఆరు రోజుల్లో ఇది ఆయన రెండో ప్రమాణస్వీకారోత్సవం. శనివారం ఆయన దేవేంద్ర ఫడ్నవీస్‌తో ఉపముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి టివి ప్రసారాల ద్వారా అందరిని ఆశ్చర్యానికి గురిచేశారన్నది తెలిసిన విషయమే. నాలుగు రోజుల క్రితం తన ఉపముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి యుటర్న్ తీసుకున్నారు. దాంతో బిజెపి ప్రభుత్వానికి సంఖ్యాబలం లేకుండా పోయింది. ఆ తర్వాత అజిత్ పవార్ తిరిగి ఎన్‌సిపి గూటికే చేరారు. కాలానుగుణ మార్పు కారణంగా ఇప్పుడు శివసేన తన పతాకాన్ని ఎన్‌సిపి, కాంగ్రెస్ పార్టీ పతాకాలతో పంచుకుంది. శివసేనకు ఎన్నో ఘట్టాల్లో శివాజీ పార్క్ మైలురాయిగా నిలిచింది. అక్కడే ఉద్ధవ్ థాక్రే ప్రమాణస్వీకారం చేయడం విశేషం. ప్రమాణస్వీకారోత్సవానికి ప్రధాని నరేంద్ర మోడీని ఉద్ధవ్ థాక్రే ఆహ్వానించారు. అయితే మోడీ వేడుకకు హాజరు కాకుండానే ఆయనకు అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ కూడా ఉద్ధవ్ థాక్రే ప్రమాణస్వీకారానికి హాజరుకాలేదు. అయితే మహారాష్ట్ర ముఖ్యమంత్రి అయినందుకు ఆయనకు ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు. థాక్రేకు రాసిన లేఖలో ఆమె మహారాష్ట్ర ప్రజల ఆకాంక్షలను కొత్త ప్రభుత్వం తీరుస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తంచేశారు. మన్మోహన్ సింగ్, రాహుల్ గాంధీ కూడా ప్రమాణస్వీకారోత్సవ వేడుకకు హాజరు కాలేదు. కానీ వారు కూడా థాక్రేను అభినందిస్తూ లేఖలు రాశారు. ఉద్ధవ్ థాక్రే కుమారుడు ఆదిత్య థాక్రే సయంగా ఢిల్లీకి వెళ్లి ఈ ముగ్గురు కాంగ్రెస్ నాయకులను ఆహ్వానించారన్నది ఇక్కడ గమనార్హం. అయితే వారెవరూ కూడా హాజరుకాలేదు. ప్రమాణస్వీకారోత్సవానికి వేలాది శివసేన కార్యకర్తలు హాజరయ్యారు. వారంతా ఉద్ధవ్ థాక్రేను చూడగానే ఉత్తేజంతో నినాదాలు చేశారు. దాంతో ఉద్ధవ్ థాక్రే వారి ముందు పిడికిలి ఎత్తి చూపారు. మహారాష్ట్ర అసెంబ్లీకి ముఖ్యమంత్రులుగా ప్రమాణస్వీకారం చేసినవారిలో ఉద్ధవ్ థాక్రే ఎనిమిదవ వ్యక్తి. ఆయన కనీసం ఎంఎల్‌ఎ కూడా కాదు. శివసేన నుంచి ఎన్నికైన ముఖ్యమంత్రుల్లో ఆయన మూడో వ్యక్తి. ఇదివరలో శివసేన నుంచి మనోహర్ జోషి, నారాయణ్ రాణే సిఎంలుగా ప్రమాణస్వీకారం చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీకి ఈ నెల జరిగిన ఎన్నికల్లో శివసేన, బిజెపి కలిసి పోటీ చేశాయి. బిజెపి 105 సీట్లు, శివసేన 56 సీట్లు గెలుచుకున్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి వారి కూటమికి కావలసిన మెజారిటీ కూడా లభించింది. కానీ శివసేన రొటేషన్ పద్ధతి ప్రకారం ముఖ్యమంత్రి పదవి కావాలని పట్టుపట్టడంతో వారి మధ్య అభిప్రాయభేదాలు తలెత్తాయి. దాంతో ఉద్ధవ్ థాక్రే బిజెపితో పొత్తును రద్దు చేసుకున్నారు. శివసేన, బిజెపితో దాదాపు 30 ఏళ్లపాటు మిత్రపక్షంగా ఉంది. ప్రస్తుతం ఆ పార్టీ కాంగ్రెస్,ఎన్‌సిపితో పొత్తుపెట్టుకుంది. ఆ రెండు పార్టీలు కూడా శివసేనకు సిద్ధాంతపరంగా విరుద్ధమైన పార్టీలు. శివసేనది పక్కా హిందుత్వ వైఖరి. వారిదేమో లౌకికవాద వైఖరి.
మహారాష్ట్ర సిఎంగా ఉద్ధవ్ థాక్రే ప్రమాణ స్వీకారం
RELATED ARTICLES