భండారా ప్రభుత్వ హాస్పిటల్లో పదిమంది శిశువుల మరణం
భండారా: మహారాష్ట్రలోని భండారాలో పెను ప్రమాదం చోటుచేసుకుంది. ఇక్కడి ప్రభుత్వ హాస్పిటల్లో నవజాత శిశు సంరక్షణ కేంద్రంలో శుక్రవారం మధ్యరాత్రి అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో పదిమంది నవజాత శిశువులు మృత్యువాత పడ్డారు. అయితే ఏడుగురు శిశువులను కాపాడినట్లు డాక్టర్లు తెలిపారు. చనిపోయిన శిశువులు నెల నుంచి మూడు నెలలవారని ఒక డాక్టర్ పేర్కొన్నారు. ఇక చనిపోయిన శిశువుల్లో ముగ్గురు కాలిన గాయాలతో మరణించగా, మిగిలిన ఏడుగురు పొగవల్ల ఊపిరాడక చనిపోయారని మహారాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేశ్ తోపే అన్నారు. సంఘటన పట్ల ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే విచారం వ్యక్తంచేశారు. విచారణకు ఆదేశించారని అధికారిక ప్రకటన తెలిపింది. చనిపోయిన శిశువుల కుటుంబాలకు తలా 5 లక్షల పరిహారం ఇవ్వనున్నట్లు తోపే తెలిపారు. శుక్రవారం రాత్రి 1.30కు ప్రత్యేక నవజాత శిశు సంరక్షణ కేంద్రంలో మంటలు చెలరేగాయి. అందులో ఉన్న 17 మందిలో పదిమంది మరణించారు. మిగిలిన ఏడుగురు శిశువులను కాపాడారు.
షార్ట్ సర్క్యూట్ కారణంగా..!
నవజాత శిశు రక్షణ కేంద్రంలో మంటలు రావడాన్ని ముందుగా ఒక నర్సు గుర్తించారు. ఆమె వెంటనే డాక్టర్లు, ఇతర సిబ్బందికి విషయాన్ని చేరవేశారు. వారంతా అక్కడికి అయిదు నిమిషాల్లో చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది ఏడుగురు శిశువుల ప్రాణాలు మాత్రమే కాపాడగలిగారు. పది రక్షించలేకపోయారు. అప్పుడే పుట్టిన శిశువులను ఉంచే గదికి నిరంతరం ఆక్సిజన్ సరఫరా ఉంటుందని భండారా జిల్లా సివిల్ సర్జన్ ప్రమోద్ ఖండతే తెలిపారు. ఇంకా మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక ఏర్పాట్లు కూడా ఉన్నాయని, సిబ్బంది వాటిని ఉపయోగించారని, అయితే పొగ చాలా ఎక్కువగా ఉందని ఆయన అన్నారు. మంటలు రావడంతో హాస్పిటల్లో ఐసియు, డయాలసిస్ విభాగం, లేబర్ గదిలోని రోగులను ఇతర వార్డులకు సురక్షితంగా తరలించినట్లు ప్రమోద్ ఖండతే తెలిపారు. ఇక నాలుగు అంతస్తుల భవనంలో మంటలకు కారణం తెలియాల్సి ఉంది. అయితే విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగి ఉండొచ్చని ఆయన అన్నారు. ఇదిలా ఉంటే సంఘటనకు బాధ్యలను వదిలిపెట్టమని మహారాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేశ్ తోపే స్పష్టంచేశారు. శిశువుల మరణం పట్ల రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ తదితరులు సంతాపం తెలిపారు.