అర్ధరాత్రి కుట్ర : అందలమెక్కిన ఫడ్నవీస్
అజిత్ పవార్ భాతృద్రోహం: ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం
బిజెపి అంతఃపుర కుట్రకు తోడ్పడిన గవర్నర్
శనివారం ఉదయం 5:47 గంటలకు రాష్ట్రపతి పాలన ఎత్తివేత
7:30 గంటలకు గోప్యంగా ప్రమాణ స్వీకారం నిర్వహణ
ఈనెల 30లోపు అసెంబ్లీలో బలనిరూపణకు ఆదేశం
శరద్ పవార్ పార్టీ (ఎన్‌సిపి)లో, కుటుంబంలో చీలిక
బిత్తరపోయిన శివసేన, ఎన్‌సిపి, కాంగ్రెస్ కూటమి
ముంబయి: మహారాష్ట్ర రాజకీయాల్లో ఎప్పటికప్పుడు షాకింగ్ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా దేవేంద్ర ఫడ్నవీస్ మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. చివరి క్షణాల్లో బిజెపివైపు మొగ్గు చూపిన నేషనల్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అజిత్ పవార్ ఉపముఖ్యమంత్రిగా శనివారం ప్రమాణస్వీకారం చేశారు. ఎవరూ ఊహించని విధంగా శనివారం ఉదయం 7.30 గంటలకే మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ వారిచేత రాజ్‌భవన్‌లో ప్రమాణస్వీకారం చేయించారు. ఈ ప్రమాణస్వీకార వ్యవహారం అంతా ఓ ‘గూడుపుఠాణీ’ అని కొందరు భావిస్తున్నారు. 2014లో ఇదే దేవేంద్ర ఫడ్నవీస్ వేలాది మంది మద్దతుదార్ల నడుమ వాంఖడే స్టేడియంలో ఆర్భటం మధ్య ప్రమాణస్వీకారం చేశారు. కానీ ఈసారి ‘రహస్యంగా’ ప్రమాణస్వీకారం చేశారు. ఈనెల 30లోపు అసెంబ్లీలో బల నిరూపణ చేసుకుకోవాలని గవర్నర భగత్‌సింగ్ కోశ్యారీ బిజెపికి సూచించారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో బలపరీక్ష ఆసక్తికరంగా మారింది. ఫడ్నవీస్‌కు ఎన్‌సిపి ఎంఎల్‌ఎలు మద్దతు తెలపకపోతే బలపరీక్షను ఎదుర్కొవడం సవాలే. దీంతో ప్రభుత్వాన్ని నెగ్గించుకునేందుకు బిజెపి, ఫడ్నవీస్‌ను అడ్డకునేందుకు విపక్షాలు ప్రణాళికలు రచిస్తున్నాయి. మహారాష్ట్రలో ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయలేని స్థితిలో గవర్నర్ సిఫార్సుపై నవంబర్ 12న రాష్ట్రపతి పాలన విధించారు. ఇప్పుడు దానిని ఉపసంహరించారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కేంద్ర పాలన ఉపసంహరణ ప్రకటనపై సంతకం చేయగానే, దానిని వెంటనే శనివారం తెల్లవారుజామున 5.47 గంటలకు గెజిట్ ప్రకటనగా జారీచేశారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో గత ఎల ప్రజలు ఇచ్చిన తీర్పును శివసేన గౌరవించలేదని ఫడ్నవీస్ నిందించారు. ‘ప్రజలు స్పష్టమైన తీర్పును ఇచ్చారు. కానీ ఫలితాల అనంతరం శివసేన ఇతర పార్టీలతో పొత్తుపెట్టుకుంది. ఆ తర్వాత మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించారు. మహారాష్ట్రకు కావలసింది స్థిరమైన ప్రభుత్వం, కానీ ‘కిచిడీ’ ప్రభుత్వం కాదు’అని ఫడ్నవీస్ వ్యాఖ్యానించారు. ‘మహారాష్ట్ర ప్రజలకు మరోసారి సేవ చేసుకునే భాగ్యాన్ని ప్రధాని నరేంద్ర మోడీ, పార్టీ అధ్యక్షుడు అమిత్ షా, జెపి నడ్డా నాకిచ్చారు’ అని బిజెపి నాయకుడు ఫడ్నవీస్ చెప్పారు. ‘అజిత్ పవార్ కొంత మంది స్వతంత్ర ఎంఎల్‌ఎలు, చిన్న పార్టీలతో బిజెపికి మద్దతునిచ్చారు. దాంతో బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దావాచేసింది’ అని కూడా ఆయన వివరించారు. ఉపముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అజిత్ పవార్ ‘ఎన్నికల ఫలితాలను అక్టోబర్ 24న ప్రకటించినప్పటి నుంచి ఏ పార్టీ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తానని ప్రకటించలేదు. రైతు సమస్యలతోపాటు మహారాష్ట్ర అనేక సమస్యలు ఎదుర్కొంటోంది. అందుకే మేము స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే నిర్ణయం తీసుకున్నాం’ అన్నారు.
మహారాష్ట్రీయులకు వెన్నుపోటు
‘బిజెపితో చేతులు కలపాలని ఎన్‌సిపి నాయకుడు అజిత్ పవార్ నిర్ణయం తీసుకోవడం ఒకవిధంగా మహారాష్ట్ర ప్రజలను వెన్నుపోటు పొడవడమే’ అని శివసేన నాయకుడు సంజయ్ రౌత్ అభిప్రాయపడ్డారు. దేవేంద్ర ఫడ్నవీస్ మళ్ళీ సిఎంగా తిరిగి బాధ్యతలు చేపట్టడంతో మహారాష్ట్రలో నెలరోజులుగా ఉన్న రాజకీయ ప్రతిష్టంభన తొలగిపోయింది. శివసేన సమావేశంలో మహారాష్ట్ర సిఎంగా ఉద్ధవ్ థాక్రే ఉండాలన్న ఏకాభిప్రాయం ఏర్పడ్డాక కొన్ని గంటలలోనే దేవేంద్ర ఫడ్నవీస్ సిఎంగా ప్రమాణస్వీకారం చేయడంతో రాజకీయ దిగ్భ్రాంతికి గురిచేసింది.
అజిత్ పవార్ నిర్ణయం వ్యక్తిగతం : శరద్ పవార్
బిజెపితో చేతులు కలిపేందుకు తీసుకున్న అజిత్ పవార్ నిర్ణయం అతడి వ్యక్తిగతమైనదని, దానితో ఎన్‌సిపికి ఎలాంటి ప్రమేయంలేదని ఎన్‌సిపి చీఫ్ శరద్ పవార్ చెప్పారు.కొత్త ప్రభుత్వానికి ఉద్ధవ్ థాక్రేనే నేతృత్వం వహిస్తారని శరద్ పవార్ శుక్రవారం చెప్పారు. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక చేపట్టాల్సిన కార్యాచరణకు సంబంధించిన కనీస ఉమ్మడి కార్యక్రమంను కూడా మూడు పార్టీలు రూపొందించుకున్నాయి.దేవేంద్రఫడ్నవీస్ ప్ర మాణస్వీకారం చేశాక ‘బిజెపి ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించాలని ఎన్‌సిపి నాయకుడు అజిత్ పవార్ తీసుకున్న నిర్ణయం ఆయన స్వంత నిర్ణయం. ఎన్‌సిపి నిర్ణ యం కాదు. అతడి నిర్ణయాన్ని ఆమోదించడం లేక సమర్థించడం మేము చేయం’ అని శరద్ పవార్ చెప్పారు. మహారాష్ట్రలోని అసెంబ్లీలో 288 సీట్లకు బిజెపి 105, ఎన్‌సిపి 56 సీట్లు గెలుచుకున్నాయి. అవి రెండూ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడానికి కావలసిన మెజారిటీ వచ్చింది. కానీ సిఎం పదవి, ఇతర పదవుల విషయంలో ఆ రెండు పార్టీల మధ్య భేదాభిప్రాయాలు చోటుచేసుకున్నాయి. ఎన్నికల ముందే కూటమిగీ ఏర్పడిన ఎన్‌సిపికి 54 సీట్లు, కాంగ్రెస్‌కు 44 సీట్లు వచాయి.
వాట్సాప్ స్టేటస్‌లో సుప్రియా సూలే పోస్ట్‌లు
మహారాష్ట్ర రాజకీయ పరిణామాలపట్ల ఎన్‌సిపి ఎంపి సుప్రియా సూలే చలించిపోయారు. ఆమె తన వాట్సాప్ స్టేటస్‌లో పవార్ కుటుంబం, పార్టీల్లో చీలికలు ఏర్పడ్డాయని పేర్కొంది. మరో పోస్ట్‌లో అజిత్ పవార్‌ను ఉద్దేశించి ‘జీవితంలో ఎవరిని నమ్మాలి. జీవితంలో ఎప్పుడూ మోసం చేయడని అనుకున్నాం. అతడిని సమర్థించాం. ప్రేమించాం. కానీ చివరికి లభించిందేమిటి?’ అని పేర్కొన్నారు. పార్లమెంటులో శరద్ పవారం పార్టీ పనితీరును ప్రధాని నరేంద్ర మోడీ మెచ్చుకున్నప్పుడే మహారాష్ట్రలో నాటకీయ పరిణామాలు మొదలయ్యాయి. మహారాష్ట్రలో బిజెపియేతర ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడానికి ఎన్‌సిపి సిద్ధమయ్యాక ఈ పరిణామం చోటుచేసుకుంది. ఇదిలావుండగా ఇటీవల ఢిల్లీలో శరద్ పవార్, ప్రధాని మోడీని కలుసుకున్నప్పుడు కూడా మహారాష్ట్ర రాజకీయాల్లో అలజడి రేగింది. బిజెపి సర్కారును ఏర్పాటుచేయబోతున్నారన్న ఊహాగానాలు కూడా చక్కర్లు కొట్టాయి.
మహారాష్ట్రలో ‘మహా’ రాజకీయ నాటకం ప్రజాస్వామ్యాన్ని ‘కిడ్నాప్’ చేసిన బిజెపి
RELATED ARTICLES