అక్లాండ్: క్రికెట్ చరిత్రలో అద్భుత, అరుదైన మ్యాచ్ ఏదైనా ఉందంటే అది కచ్చితంగా 2019 వన్డే ప్రపంచకప్ ఫైనల్. ప్రతిష్ఠాత్మక లారడ్స్ మైదానంలో జులై 14న జరిగిన ఇంగ్లాండ్ x న్యూజిలాండ్ తుది పోరు.. ప్రపంచ క్రికెట్‌లో మరుపురానిది. నరాలు తెగే ఉత్కంఠలో సాగిన ఆ మ్యాచ్ ’టై’ గా మారింది. సూపర్ ఓవర్‌లోనూ ఇరు జట్లు సమాన స్కోరు చేయగా, బౌండరీ కౌంట్ ఆధారంగా ఇంగ్లాండ్ తొలిసారి విశ్వవిజేతగా అవతరించింది. ఈ నేపథ్యంలో ఆదివారం కూడా అచ్చం అలాగే ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్లు తలపడ్డాయి. మ్యాచ్ టైగా మారి సూపర్ ఓవర్‌కు దారితీసింది. ఇప్పుడు కూడా ఇంగ్లీష్ జట్టే గెలుపొందింది. కాకపోతే అప్పుడు బౌండరీ కౌంట్ ఆధారంగా గెలిస్తే.. ఇప్పుడు స్పష్టమైన ఆధిక్యంతో విజయం సాధించింది. ఈడెన్‌పార్క్ వేదికగా ఆదివారం జరిగిన ఐదో టీ20 మ్యాచ్ వర్షం కారణంగా చెరో 11 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. మార్టిన్‌గప్తిల్(50; 20 బంతుల్లో 3×4, 5×6), కొలిన్ మన్రో (46; 21 బంతుల్లో 2×4, 4×6) చెలరేగడంతో న్యూజిలాండ్ భారీ స్కోర్ సాధించింది. లక్ష్య ఛేదనలో బెయిర్‌స్టో (47; 18 బంతుల్లో 2×4, 5×6) మరోసారి మెరవడంతో ఇంగ్లాండ్ ఏడు వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. దీంతో ఇరు జట్లూ మళ్లీ సూపర్ ఓవర్‌లో తలపడ్డాయి. బెయిర్‌స్టో, మోర్గాన్ చెలరేగగా.. ఈ ఓవర్‌లో ఇంగ్లాండ్ 17 పరుగులు చేసింది. ఆపై న్యూజిలాండ్ 8 పరుగులే చేసి ఓటమి పాలైంది. దీంతో ఐదు టీ20ల సిరీస్‌ను ఇంగ్లాండ్ 3–2తో కైవసం చేసుకుంది.
మళ్లీ సూపర్ ఓవరే గెలిపించింది
RELATED ARTICLES