ప్రజాపక్షం/ హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో జరిగిన తొలి శాసనసభ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి ఘన విజయం సాధించింది. దాదాపు నాలుగింట మూడొంతుల మెజారిటీ సాధించి వరుసగా రెండో మారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. టిఆర్‌ఎస్ పార్టీ 88 స్థానాలలో విజయదుంధుబి మోగించింది. కాంగ్రెస్, టిడిపి, సిపిఐ, టిజెఎస్ పార్టీలు ఏర్పాటు చేసిన ప్రజా ఫ్రంట్‌కు ఆశించిన ఫలితాలు దక్కలేదు. కూటమి 21 స్థానాల్లో గెలుపొందగా, అందులో కాంగ్రెస్ 19, టిడిపి 2 చోట్ల విజయం సాధించింది. ఇక ఎంఐఎం తన బలాన్ని నిలబెట్టుకుంటూ మరోసారి 7 స్థానాల్లో గెలుపొందింది. బిజెపికి ఈ ఎన్నికలు నిరాశనే మిగిల్చాయి. గతంలో ఐదు స్థానాల్లో గెలిచిన ఆ పార్టీ ఈసారి ఒక్క స్థానం నుండే గెలుపొందింది. ఇండిపెండెంట్, తొలిసారిగా ఫార్వర్డ్‌బ్లాక్ ఒక్కో స్థానం నుండి గెలుపొందారు. గత శాసనసభలో ప్రాతినిధ్యం ఉన్న సిపిఐ, సిపిఐ(ఎం), బిఎస్‌పి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌లు ఈసారి సభలోకి అడుగిడలేకపోయాయి. టిఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గజ్వేల్ నియోజకవర్గం నుండి 58,290 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. సిద్ధిపేట నుండి మంత్రి తన్నీరు హరీశ్‌రావు లక్ష కు పైగా భారీ మెజారిటీతో వరుసగా ఆరవ సారి గెలిచారు. ఆయనకు 1,18,699 ఓట్ల ఆధిక్యత లభించింది. సిరిసిల్లా నుండి కల్వకుంట్ల తారక రామారావు 89,009 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. టిపిసిసి అధ్యక్షులు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హుజూర్‌నగర్ నియోజకవర్గం నుండి 74,66 ఓట్ల మెజారిటీ, మధిర నుండి టిపిసిసి ప్రచార కమిటీ చైర్మన్ మల్లు భట్టి విక్రమార్క 3,567 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అలాగే కాంగ్రెస్ తరుపున మాజీ మంత్రులు దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు మంథని నుండి, సబితా ఇంద్రారెడ్డి మహేశ్వరం నుండి గెలుపొందారు. ఎంఐఎం శాసనసభాపక్ష నాయకులు అక్బరుద్దీన్ ఓవైసీ చాంద్రాయణగుట్ట నుండి గెలుపొందారు. టిడిపి నుండి సండ్ర వెంకటవీరయ్య సత్తుపల్లి నుండి, బిజెపి నుండి రాజాసింగ్ గోషా మహల్ స్థానాలను నిలబెట్టుకున్నారు.రామగుండం నుండి ఫార్వర్డ్‌బ్లాక్ తరపున కోరుకంటి చందర్, వైరా నుండి ఇండిపెండెంట్‌గా పోటీచేసిన కాంగ్రెస్ రెబెల్ రాములు నాయక్ గెలుపొందారు.
నలుగురు మంత్రులు, స్పీకర్, ప్రతిపక్ష నేతల ఓటమి
ఈ ఎన్నికల్లో అన్ని పార్టీల్లో ప్రముఖులు ఓటమిపాలవ్వడం గమనార్హం. కెసిఆర్ మంత్రివర్గంలోని నలుగురు సీనియర్ మంత్రులు ఓటమి పాలయ్యారు. పాలేరు నుండి తుమ్మల నాగేశ్వరరావు, తాండూరు నుండి పి. మహేందర్‌రెడ్డి, ములుగు నుండి ఆజ్మీరా చందూలాల్, కొల్లాపూర్ నుండి జూపల్లి కృష్ణారావులు ఓడిపోయారు. అలాగే అటు కాంగ్రెస్ పార్టీల కూడా అనేక మంది ప్రముఖులు ఓటమి పాలయ్యారు. వారిలో గత శాసనసభ ప్రతిపక్ష నాయకులు కుందూరు జానారెడ్డి, శాసనమండలి ప్రతిపక్ష నేత మహ్మద్ షబ్బీర్ అలీ ఉన్నారు.ఇక భూపాలపల్లి నుండి శాసనసభ స్పీకర్ సిరికొండ మధుసూధనాచారి కూడా ఓడిపోయారు.
అన్ని పార్టీల ప్రముఖులు ఓటమి
ఇక ఎన్నికల్లో అన్ని పార్టీలకు చెందిన ప్రముఖులు ఓటమి పాలయ్యారు. అందులో టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్‌లు ఎ.రేవంత్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, మాజీ సిఎల్‌పి ఉపనేతలు జీవన్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహా, మాజీ మంత్రులు డాక్టర్ జె.గీతారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, డి.కె.అరుణ, నాగం జనార్ధన్‌రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, కొండా సురేఖ, తదితరులు ఉన్నారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కె.లక్ష్మణ్, బిజెఎల్‌పి నేత జి.కిషన్‌రెడ్డి ఓడిపోయిన ప్రముఖుల జాబితాలో ఉన్నారు. కూకట్‌పల్లి నుండి టిడిపి తరుపున పోటీ చేసిన నందమూరి హరికృష్ణ తనయ సుహాసిని కూడా ఓటమి పాలయ్యారు.
ఖమ్మం మినహా అంతటా టిఆర్‌ఎస్ హవా
పాత పది ఉమ్మడి జిల్లాలో ఖమ్మం మినహా అన్ని జిల్లా ల్లో టిఆర్‌ఎస్ హవా కొనసాగింది. కాంగ్రెస్ పార్టీ సగం జిల్లాలలో అంటే మహబూబ్‌నగర్, కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్‌లో ఒక్క స్థానం చొప్పున గెలుపొందగా, హైదరాబాద్‌లో గత ఎన్నికల మాదిరిగానే ఖాతా తెరవలేకపోయింది. కెసిఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న మెదక్ జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో తొమ్మిది స్థానాలను టిఆర్‌ఎస్, ఒక చోట కాంగ్రెస్ గెలుపొందింది. ఈ జిల్లాలో సంగారెడ్డి నుండి కాంగ్రెస్ తరపున జగ్గారెడ్డి గెలుపొందారు. కాంగ్రెస్ ప్రముఖులు ఉన్న నల్లగొండ జిల్లాలో మొత్తం 12 స్థానాలకు గాను టిఆర్‌ఎస్ – 9 స్థానాల్లో, కాంగ్రెస్ 3 స్థానాల్లో గెలుపొందింది. గత ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ 5 స్థానాల్లో గెలిచింది. మహబూబ్‌నగర్‌లో గత ఎన్నికల్లో ఐదు స్థానాల్లో గెలుపొందిన కాంగ్రెస్ ఈ సారి ఒక్కస్థానానికే పరిమితం కాగా, మిగతా 13 చోట్ల టిఆర్‌ఎస్ విజయం సాధించింది. రంగారెడ్డి జిల్లాలో గత ఎన్నికల్లో ఒక్క స్థానంలో గెలిచిన కాంగ్రెస్ ఈ సారి జిల్లా నుండి మూడు స్థానాల్లో గెలుపొందింది. ఖమ్మం జిల్లాలో మాత్రం కాంగ్రెస్, టిడిపి, సిపిఐ, టిజెఎస్‌లతో ఏర్పడిన ప్రజాఫ్రంట్ దాదాపు క్లీన్ స్వీప్ చేసింది. ఆ జిల్లాలో ఖమ్మంలో టిఆర్‌ఎస్ తరపున పువ్వాడ అజయ్ మినహా అన్ని స్థానాల నుండి ఫ్రంట్ అభ్యర్థులే గెలుపొందారు. వైరాలో సైతం కాంగ్రెస్ రెబెల్ ఇండిపెండెంట్‌గా విజయం సాధించారు. జిల్లాలోని మొత్తం 10 స్థానాల్లో కూటమి 8 చోట్ల గెలుపొందింది.
టిఆర్‌ఎస్ – 88
కాంగ్రెస్ – 19
ఎంఐఎం – 07
టిడిపి – 02
బిజెపి – 01
ఫార్వర్డ్‌బ్లాక్ – 01
ఇండిపెండెంట్ -01
మొత్తం – 119