బిసి ఓటర్ల గణనపై మారని తీరు
అన్ని కేటగిరీల వారీగా జాబితాలు పంపాలని కలెక్టర్లకు ఆదేశాలు
కొత్త ఫార్మాట్ రూపొందించిన పంచాయతీరాజ్ శాఖ
పంచాయతీ ఎన్నికల నిర్వహణలో నెలకొననున్న జాప్యం?
ప్రజాపక్షం / హైదరాబాద్ : పంచాయతీ ఎన్నికల నిర్వహణలో అత్యంత కీలకంగా మారిన బిసి ఓటర్ల గణన ఇప్పటికీ కొలిక్కి రావడం లేదు. సోమవారం నాటికి ఐదు జిల్లాల నుంచి బిసి ఓటర్ల జాబితా వచ్చినప్పటికీ లెక్కల్లో తీవ్రమైన గందరగోళం నెలకొనడంతో వాటిని తిరిగి పంపించి సక్రమంగా తయారు చేయాలని పంచాయతీరాజ్ కమిషనరేట్ అధికారులు జిల్లా కలెక్టర్లను కోరారు. మంగళవారం నాటికి పంపాలని కోరినప్పటికీ అవి రాకపోగా.. మిగిలిన జిల్లాల నుంచి జాబితాలు ఇప్పటికీ కమిషనరేట్‌కు అందలేదు. పంపించిన వాటిలో పాత బిసి ఓటర్ల సంఖ్య కంటే కొంత ఎక్కువగా ఉండాల్సింది పోయి పలు చోట్ల తగ్గడం గమనార్హం. అయితే గతంలో బిసి ఓటర్ల గణన వరకే ఒక ఫార్మాట్ (బిసి మహిళలు, బిసి పురుషులు, మొత్తం ఓటర్లు) సిద్ధం చేసి పంపించగా, ఇప్పుడు అది సరిపోదనని మొత్తం కేటగిరీల వారీగా ( బిసి ఎ, బి, సి, డి, ఎస్సి, ఎస్టి, జనరల్‌తో పాటు ఈ కేటగిరీలలో మహిళలు, పురుషులు విడివిడిగా) తయారు చేసి పంపించాలని మరో కొత్త ఫార్మాట్‌ను జిల్లా కలెక్టర్లకు పంపించారు. దీంతో బిసి ఓటర్ల గణన మళ్లీ మొదటికి వచ్చినట్లుయింది. మరోవైపు ఎన్నికలు నిర్వహించాల్సిన సమయం ఆసన్నమవుతుండడం, ఇంకా ఓటర్ల జాబితావద్దే మీనమేషాలు లెక్కిస్తుండడంతో ఎన్నికల నిర్వహణలో మరింత జాప్యం అనివార్యమేనని పంచాయతీరాజ్ అధికారుల నోటనే వినిపిస్తోంది. ఓటర్ల లెక్క ఒక భాగమేనని, ఎన్నికల నిర్వహణ కోసం అవసరమైన మరెన్నో ఏర్పాట్లు చేయాల్సి ఉందని నిర్ణీత గడువులోగా పూర్తి చేయడం అసాధ్యమనే భావనే అధికారుల్లో కనిపిస్తోంది. బిసిల విషయానికి వస్తే… బిసి గణన శాస్త్రీయంగా నిర్వహించిన తర్వాతే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ పనిని బిసి కమిషన్‌కు అప్పగించినప్పటికీ ప్రక్రియను కమిషన్ మొదలే పెట్టలేదు. అయితే జనవరి 10లోపు పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు తీర్పునివ్వడంతో అసెంబ్లీ ఓటర్ల జాబితా మేరకు బిసి ఓటర్ల లెక్క తేల్చాలని సర్కారు భావించింది. దీంతో పాటు పంచాయతీ ఎన్నికల కోసం గతంలో రూపొందించిన ఓటర్ల జాబితాను కూడా అసెంబ్లీ ఓటర్ల జాబితాను పరిశీలించి అవసరమైన చేరికలు చేసి కొత్త ఓటర్ల జాబితా రూపొందించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం పంచాయతీరాజ్ అధికారులను ఆదేశించింది. బిసి ఓటర్ల జాబితాతో పాటు సవరించి రూపొందించిన కొత్త ఓటర్ల జాబితాను ఈ నెల 15వ తేదీనే ప్రచురించాలని ఎన్నికల సంఘం ఆదేశించినప్పటికీ ఈ పనిలో ఇసుమంతైనా పురోగతి లేకుండా పోయింది. ముందుగా బిసి ఓటర్ల జాబితాను సిద్ధం చేస్తే పంచాయతీల రిజర్వేషన్ల ప్రక్రియను మొదలుపెట్టవచ్చని పంచాయతీరాజ్ కమిషనరేట్ అధికారులు జిల్లా కలెక్టర్లను, జిల్లా పంచాయతీ అధికారులను కోరారు. ఎస్సి, ఎస్‌టిల రిజర్వేషన్లలో ఎలాంటి మార్పు లేదు కాబట్టి వారికి కేటాయించిన పంచాయతీ రిజర్వేషన్ల విషయంలో ఎలాంటి ఆదుర్దా లేదు. అయితే బిసిలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించి పంచాయతీలను కేటాయించారు. ఇప్పుడు వారికి 10.19 శాతం తగ్గించి తిరిగి రిజర్వేషన్లు కేటాయించాల్సి ఉంది. ఈ తతంగం అంత ఆషామాషీ కాదని, రాష్ట్ర వ్యాప్తంగా బిసిలకు కేటాయించాల్సిన పంచాయతీల సంఖ్యను సులభంగానే నిర్ణయించవచ్చని, కానీ జిల్లాల వారీగా, అనంతరం మండలాల వారీగా రిజర్వేషన్లను నిర్ధారించడానికి చాలా సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. పంచాయతీ స్థాయిలో మళ్లీ వార్డులకు రిజర్వేషన్లు కేటాయించాల్సి ఉంటుంది. గ్రామ స్థాయిలో కాబట్టి అక్కడి స్థానికుల పర్యవేక్షణ క్షున్నంగా ఉంటుందని, ఏమాత్రం లెక్క తప్పినా అభ్యంతరాలు, కోర్టులో పిటిషన్లు దాఖలు కావడాలు వంటివి తప్పవని అధికారులు అంటున్నారు. అదే జరిగితే పంచాయతీ ఎన్నికల నిర్వహణలో మరోసారి ప్రతిష్టంబన నెలకొనడం ఖాయం. అందుకే తప్పులు దొర్లకుండా అన్ని ఏర్పాట్లుచేయడానికి ఇప్పుడు అధికారుల ముందున్న సమయం సరిపోదనే భావన వారిలో వ్యక్తమవుతోంది.