8,9 తేదీల్లో సమ్మెబాట పట్టనున్న ప్రభుత్వరంగ బ్యాంకుల ఉద్యోగులు
న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగులు మరోసారి సమ్మె బాటపట్టారు. ఉద్యోగవిధానాలపై కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ 10 ట్రేడ్ యూనియన్లు పిలుపునిచ్చిన దేశవ్యాప్త సమ్మెకు మద్దతుగా వచ్చే వారంలో రెండు రోజుల పాటు ఉద్యోగులు సమ్మె చేపట్టనున్నారు. ‘2019 జనవరి 8,9 తేదీల్లో దేశవ్యాప్త సమ్మెకు అఖిల భార త బ్యాంకు ఉద్యోగుల సంఘం (ఎఐబిఇఎ), భారత బ్యాంకు ఉద్యోగుల సమాఖ్య(బిఇఎఫ్‌ఐ) పిలుపునిచ్చాయి. ఈ సమాచారాన్ని సదరు యూనియన్లు భారత బ్యాంకుల సంఘానికి (ఐబిఎ)కు అందించాయి’ అని బిఎస్‌ఈ ఫైలింగ్ సందర్భంగా ఐడిబిఐ బ్యాంక్ పేర్కొంది. బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా ఇదే విషయాన్ని వెల్లడించింది.గతేడాది డిసెంబరులోనూ బ్యాంకు ఉద్యోగులు సమ్మె చేసిన విషయం తెలిసిందే. వేతన సవరణ, పెన్షన్‌తో పాటు ఇతర సమస్యల పరిష్కారానికై అఖిల భారత బ్యాంక్ అధికారుల సంఘం (ఎఐబిఒసి) ఇచ్చిన పిలుపు మేరకు డిసెంబరు 21న బ్యాంకుల అధికారులు విధులను బహిష్కరించి సమ్మెలో పాల్గొన్నారు. ఆ తర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడాలో విజయా బ్యాంక్, దేనా బ్యాంక్‌ల విలీనానికి వ్యతిరేకంగా బ్యాంకు ఉద్యోగులు, అధికారులు, సిబ్బంది డిసెంబరు 26న సమ్మె చేపట్టారు.