ఒడిశాలో 5వసారి ముఖ్యమంత్రిగా బిజెడి అధినేత
అరుణాచల్‌లో బిజెపి, సిక్కింలో ఎస్‌కెఎం ఆధిక్యత
భువనేశ్వర్ ః నవీన్ పట్నాయక్ మరోసారి ఒడిశాలో తిరుగులేని నాయకునిగా అవతరించారు. ఇంకోసారి ఆయన అధికారాన్ని నిలబెట్టుకున్నారు. ఒడిశాలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఏకకాలంలో జరిగిన విషయం తెల్సిందే. అసెంబ్లీ ఎన్నికల్లో నవీన్ పట్నాయక్ సారథ్యంలోని బిజూ జనతాదళ్ (బిజెడి) 102 స్థానాల్లో ఆధిక్యతలో వుంది.బిజెపి 28 చోట్ల ఆధిక్యతతో రెండోస్థానంలో నిలవగా, కాంగ్రెస్ పార్టీ 13 స్థానాలను గెల్చుకునే దిశగా పయనిస్తున్నది. తొలివార్తలు అందేసరికి బిజెడి పూర్తి మెజారిటీని సాధించింది. వరుసగా ఐదవ సారి నవీన్ పట్నాయక్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో బిజెడి 21 స్థానాల్లో ఆధిక్యతలో నిలవగా, బిజెపి ఆరు స్థానాల్లోనూ, కాంగ్రెస్ రెండు స్థానాల్లో ఆధిక్యతలో వుంది. ఐదోసారి తనను గెలిపించిన ఒడిశా ప్రజలకు నవీన్ పట్నాయక్ కృతజ్ఞతలు తెలియజేశారు. బిజెపి అగ్రనేతలు ఒడిశాలో పర్యటించి ఎంత ప్రచారం నిర్వహించినా, నవీన్ కోటను జయించలేకపోయారు.