రోమ్ : ప్రపంచ వ్యాప్తంగా ఆకలికేకలు పెరుగుతున్నాయి. కరోనా వైరస్ ప్రబలిన నేపథ్యంలో ఆకలితో అలమటిస్తున్న ప్రజల సంఖ్య మరింత పెరుగుతోందని ఐక్యరాజ్యసమితి (ఐరాస) ఆందోళన వ్యక్తం చేసింది. గతేడాది కోటి మంది కొత్తగా ఆకలితో అలమటించినట్లు గణాంకాలు చెపుతుండగా, ఈ ఏడాది కొవిడ్ 19 వ్యాధి పుణ్యమా అని పొట్టనిండని జనం సంఖ్య మరో 13 కోట్లకు పెరిగే ప్రమాదం వుందని ఐరాస హెచ్చరించింది. ఐరాసకు చెందిన ఐదు సంస్థ లు ఈ మేరకు సోమవారంనాడు ఒక సంయుక్త నివేదికను విడుదల చేశాయి. ప్రపంచంలో ఆహార భద్రత, పోషకాహారం అనే టైటిల్‌తో విడుదలైన వార్షిక నివేదికలో ఈ గణాంకాలు వెల్లడయ్యాయి. ప్రాథమిక అంచనా ప్రకారం ఇప్పుడున్న నిరుపేదలు కాకుండా అదనంగా 8.3 కోట్ల మంది తిండిలేక బాధపడతారని ముందుగా భావించారని, అయితే తాజాగా సవరించిన అంచనాల ప్రకారం 2020లో ఆకలితో అలమటించే వారి సంఖ్య అదనంగా మరో 13.2 కోట్ల మంది పెరిగే అవకాశం వుందని నివేదిక వెల్లడించింది. కరోనాతోపాటు తూర్పు ఆఫ్రికాలో అనూహ్యమైన రీతిలో ఎడారి మిడతల దాడి కూడా మరో కారణంగా నివేదిక పేర్కొంది. 2014 గణాంకాల ప్రకారం అప్పటికి 69 కోట్ల మంది అన్నంలేక దుర్భిక్ష పరిస్థితులో వున్నారని, అప్పటి నుంచి 6 కోట్ల మంది చొప్పున ఆహారం లేక విలవిల్లాడిపోయే ప్రజలు పెరుగుతూ వచ్చారని, 2018 నుంచి ఆ సంఖ్య కోటి చొప్పున పెరుగుతూ వచ్చిందని నివేదిక తెలిపింది.
మరో 13 కోట్ల మంది ఆకలికేకలు
RELATED ARTICLES