వామపక్ష నేతల పిలుపు
ప్రజాపక్షం/హైదరాబాద్ ప్రభుత్వ ఆధీనంలో ఉన్న విద్యుత్ సంస్థలను కార్పొరేట్ సంస్థలకు అప్పగించేందుకు తీసుకొస్తున్న కేంద్ర విద్యుత్ సవరణ నూతన బిల్లుకు వ్యతిరేకంగా మరో విద్యుత్ ఉద్యమానికి సన్న ద్ధం కావాలని వామపక్ష నేతలు పిలుపునిచ్చారు. ఈ బిల్లు ఆమోదం పొందితే ప్రజలపై విద్యుత్ భారం పడుతుందని, సబ్సిడీలు పోతాయని ఆం దోళన వ్యక్తం చేశారు. ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడే పాలకులకు ఓటమి తప్పదని వారు హెచ్చరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ ఉద్యమ సందర్భంలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరులు బాలస్వామి, విష్ణువర్ధన్‌రెడ్డి, రామకృష్ణలకు హైదరాబాద్ బషీర్‌బాగ్‌లోని విద్యుత్ అమరవీరుల స్తూపం వద్ద వామపక్ష నేతలు శనివారం పూల మాల వేసి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో వామపక్ష నేతలు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి, ఎఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.ఎస్.బోస్, హైదరాబాద్ జిల్లా కార్యదర్శి ఇ.టి.నర్సింహ, రాష్ట్ర గిరిజన సమాఖ్య ప్రధానకార్యదర్శి అంజయ్య నాయక్, బిసి హక్కుల సాధన సమితి ప్రధాన కార్యదర్శి పాండురంగచారి, తెలంగాణ రైతు కార్మిక సంఘం నేత కాంతయ్య, సిపిఐ(ఎం) రాష్ట్ర నాయకులు జూలకంటి రంగారెడ్డి, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యలు డి.జి.నర్సింహారావు, హైదరాబాద్ జిల్లా కార్యదర్శి ఎం.శ్రీనివాస్, సిపిఐ(ఎం.ఎల్)న్యూడెమోక్రసి రాష్ట్ర కార్యదర్శి సాదినేని వెంకటేశ్వర్లు, కె. గోవర్ధన్, ఎస్‌యుసిఐ(యు) రాష్ట్ర కార్యదర్శి మురహరి,సిపిఐ(ఎం.ఎల్)న్యూడెమోక్రసి నాయకులు ఎస్.ఎల్.పద్మ, ఎంసిపిఐ (యు) రాష్ట్ర కార్యదర్శి తాండ్రకుమార్, నాయకులు ఉపేందర్ రెడ్డి, సిపిఐ(ఎం.ఎల్)లిబరేషన్ రాష్ట్ర కార్యదర్శి రాజేష్ తదితరులు హాజరయ్యారు. విద్యుత్ చార్జీల పెంపునకు నిరసనగా చలో అసెంబ్లీ చేపడితే నాటి చంద్రబాబు ప్రభుత్వం గుర్రాలతో తొక్కించిందని, లాఠీలను, తూటాలను ప్రయోగించిందని, ఇందులో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారని వారు గుర్తు చేశారు.
కెసిఆర్ ఊగిసలాడి .. ఒంటరి అవ్వకు : చాడ వెంకట్ రెడ్డి
బిజెపితో ఢిల్లీలో దోస్తీ, రాష్ట్రంలో కుస్తీ చేయకుండా కేంద్ర విద్యుత్ సవరణ బిల్లుపై సిఎం కెసిఆర్ ఊగిసలాడకుండా తేల్చుకోవాలని చాడ వెంకట్ రెడ్డి సూచించారు. ఈ బిల్లుకు వ్యతిరేకంగా జరిగే ఉద్యమంలో కలిసి రావాలని, లేదంటే బిజెపి మినహా రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలతో కలిసి ఉద్యమిస్తామని, అప్పుడు టిఆర్‌ఎస్ ఒంటరి అవుతుందని తెలిపారు. నూతన విద్యుత్ సవరణ చట్టం ద్వారా ట్రాన్స్‌కో, జెన్‌కో సంస్థలను కార్పొరేట్ సంస్థలకు అప్పగించేందుకు మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. రాష్ట్రాల హక్కులను హస్తగతం చేసుకుంటూ పూర్తిగా దిగజారి దుర్మార్గంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ ఉద్యమ అమరుల త్యాగాలు వృథా కాలేదని, వామపక్షాల త్యాగాలు వెలకట్టలేనివని అన్నారు. విద్యుత్ చార్జీలు పెంచకుండా నాటి చంద్రబాబు ప్రభుత్వంపైన చేసిన పోరాటం ఫలితంగానే ఇప్పటి వరకు విద్యుత్ చార్జీలను పెంచేందుకు ఏ ప్రభుత్వం ధైర్యం చేయలేదని గుర్తు చేశారు. కాల్పుల ఘటన తర్వాత చంద్రబాబు ప్రభుత్వం అధికారం కోల్పోయిందని, ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తిరిగి అధికారంలోనికి రాలేకపోయిందన్నారు. జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం దేశాన్ని లూటీ చేస్తోందని విమర్శించారు. పస్తుత ప్రభుత్వాలు కూడా ప్రపంచ బ్యాంక్ విధానాలను అవలంబిస్తున్నాయన్నారు. ప్రజలపై పన్నుల భారం వేస్తూ మోడీ దుర్మార్గ పాలన చేస్తున్నారని, నాటి చంద్రబాబు ప్రభుత్వం విద్యుత్ ఉద్యమంలోపాల్గొన్న వారిపైన విచక్షణ రహితంగా లాఠీచార్జ్, తుపాకులను ప్రయోగించారని గుర్తు చేశారు. సాదినేని వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రజా వ్యతిరేక పాలకులకు చివరకు ప్రజా ఓటమి తప్పదని హెచ్చరించారు. మురహరి, ఎస్.ఎల్.పద్మ మాట్లాడుతూ ప్రజావ్యతిరేక విధానాలపై మరో ఉద్యమానికి సన్నద్ధం కావాలన్నారు.
మరో విద్యుత్ ఉద్యమానికి సన్నద్ధం కావాలి
RELATED ARTICLES