HomeNewsBreaking Newsమరో రెండు రోజుల్లో గొటబయ రాజీనామా?

మరో రెండు రోజుల్లో గొటబయ రాజీనామా?

ఆల్‌పార్టీ సర్కారు ఏర్పాటు దిశగా అడుగులు
లోతుగా చర్చలు జరగాలి: శ్రీలంక కమ్యూనిస్టు పార్టీ
కొలంబో:
ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్న శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్సే బుధవారం తన పదవికి రాజీనామా చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రజలు ఒక్కసారిగా తన అధికార నివాసంపై విరుచుకుపడడంతో గొటబయ అక్కడి నుంచి పరారైన విషయం విదితమే. ఆయన ఎక్కడ ఉన్నారనేది ఇంకా తెలియరావడం లేదు. అయితే, పార్లమెంటు స్పీకర్‌ మహీంద యపా అబెవర్దనే శనివారం అర్థరాత్రి దాటిన తర్వాత చేసిన ప్రకటనను అనుసరించి, గొటబయ బుధవారం తన పదవికి రాజీనామా చేస్తా రు. ప్రధాని రణీల్‌ విక్రమసింగె ఇప్పటికే రాజీనామా సమర్పించడంతో శ్రీలంకలో ఆల్‌పార్టీ సర్కారు ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నా యి. అయితే, అన్ని పార్టీలతో కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అంశంపై లోతుగా చర్చ జరగాలని శ్రీలంక కమ్యూనిస్టు పార్టీ వ్యాఖ్యానించింది. ఇలావుంటే, శనివారం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించాల్సిందిగా గొటబయ తనకు తెలిపినట్టు అబెవర్దనే తన ప్రకటనలో పేర్కొన్నారు. లంక చట్టాలను అనుసరించి దేశాధ్యక్షుడు, ప్రధాని ఏకకాలంలో అందుబాటులో లేకపోతే, వారి బాధ్యతలను స్వీకర్‌ చేపట్టాలి. అధ్యక్షుడు గొటబయ, ప్రధాని విక్రమసింగెను అధికారికంగా రాజీనామాలు సమర్పించాల్సిందిగా స్పీకర్‌ సూచించారు. వారి రాజీనామా పత్రాలు చేతికి అందితేనే, పార్లమెంటు సభ్యులు కొత్త అద్యక్షుడిని ఎన్నుకోవడానికి మార్గం సులభమవుతుంది. శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం తారస్థాయికి చేరడంతో, ప్రజలు తిరుగుబాటు బావుటా ఎగురవేయడంతో, ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ప్రస్తుతం అధ్యక్షుడు, ప్రధాని క్రియాశీలకంగా లేకపోవడంతో రాజకీయ అనిశ్చితి నెలకొంది. గొటబయ చేసిన పొరపాట్ల కారణంగానే దేశం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయి. శ్రీలంక ఈ ఏడాది చెల్లించాల్సిన రుణాల మొత్తం 7 బిలియన్‌ డాలర్లు. 2026 నాటికి 25 బిలియన్‌ డాలర్లు చెల్లించాలి. శ్రీలంక వివిధ దేశాల నుంచి 51 బిలియన్‌ డాలర్ల రుణాన్ని తీసుకుంది. రుణాలపై వడ్డీ కూడా చెల్లించలేని పరిస్థితుల్లో, ధరలను విపరీతంగా పెంచేసింది. దీనితో ద్రవ్యోల్బణం ఎన్నడూ కనీవినీ ఎరుగుని రీతిలో ప్రమాదకర స్థాయికి చేరుకుంది. మరోవైపు చెల్లింపులు సక్రమంగా జరపని కారణంగా దిగుమతులు తగ్గిపోయాయి. డీజిల్‌, పెట్రోల్‌ నిల్వలు హరించుకుపోయాయి. నిత్యావసరాలకూ తీవ్ర కొరత ఏర్పడింది. ప్రజల్లో అంతులేని అసంతృప్తి నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో వివిధ రాజకీయ పార్టీలు చర్చల్లో మునిగితేలుతున్నాయి. ప్రధాన ప్రతిపక్షమైన సమాగి జన బలవెగయ (ఎస్‌జెపి), కాంగ్రెస్‌, తమిళ్‌ ప్రోగ్రెసివ్‌ అలియన్స్‌, ఆల్‌ సిలోన్‌ మక్కల్‌ కాంగ్రెస్‌, శ్రీలంక కమ్యూనిస్టు పార్టీ ఆదివారం సమావేశమై వివిధ కోణాల్లో పరిస్థితిని సమీక్షించాయి. లంక కమ్యూనిస్టు పార్టీ ఉపాధ్యక్షుడు వీరసుమన వీరసింగె ఆదివారం పిటిఐతో మాట్లాడుతూ అన్ని పార్టీలతో కూడిన ప్రభుత్వ ఏర్పాటుకు సుదీర్ఘ చర్చలు జరుగుతాయని తెలిపారు. ఏదో ఒక పరిష్కారం లభిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అన్ని రాజకీయ పార్టీల ఏకాభిప్రాయంతోనే నిర్ణయాలు ఉంటాయని పేర్కొన్నారు.
నాలుకు కీలక నిర్ణయాలు?
కొలంబోలో అత్యవసరంగా సమావేశమైన ప్రతిపక్ష పార్టీలు నాలుగు కీలక నిర్ణయాలు తీసుకున్నాయని సమాచారం. అధికారికంగా ఇంకా ఎవరూ ధ్రువీకరించని సమాచారం మేరకు దేశాధ్యక్షుడు గొటబయ రాజపక్సే, ప్రధాని రణీల్‌ విక్రమసింగె తక్షణమే రాజీనామా చేయాలని, పార్లమెంటు స్పీకర్‌ మహీంద యపా అబెవర్దనే తాత్కాలిక అధ్యక్షుడిగా వ్యవహరించాలని, వారం రోజుల్లోగా పార్లమెంటు సమావేశమై కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలని, అదే వారంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ పూర్తికావాలని ప్రతిపక్ష పార్టీలు తీర్మానించాయి. శనివారం పార్లమెంటు సమావేశం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత రెండుమూడు రోజుల్లో శ్రీలంకలో కొత్త ప్రభుత్వం ఏర్పడవచ్చు.
ప్రధాని ఇంటికి నిప్పు కేసులో ముగ్గురి అరెస్టు?
శ్రీలంక ప్రధాని రణీల్‌ విక్రమసింగె నివాసంపై శనివారం దాడి చేసి, నిప్పంటించిన ఘటనకు సంబంధించి ముగ్గురిని అరెస్టు చేసినట్టు సమాచారం. స్థానిక మీడియా కథనాలను అనుసరించి ప్రధాని ప్రైవేటు నివాసంలోకి చొరబడి, ఆస్తులను ధ్వంసం చేసి, ఆ తర్వాత నిప్పుపెట్టిన ఘటనలో ముగ్గురు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో మౌంట్‌ లావినియాకు చెందిన 19 ఏళ్ల యువకుడితోపాటు, గాలే ప్రాంతవాసులైన 24, 28 సంవత్సరాల వయసుగల ఇద్దరు యువకులు ప్రస్తుతం పోలీసుల నిర్బంధంలో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని పోలీస్‌ అధికార ప్రతినిది ఎస్‌ఎస్‌పి నిహాల్‌ తల్దువాను ఉటంకిస్తూ మీడియా వర్గాలు పేర్కొన్నాయి.ఏ

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments