HomeNewsBreaking Newsమరో ఢిల్లీగా హైదరాబాద్‌?

మరో ఢిల్లీగా హైదరాబాద్‌?

పెద్ద ఎత్తున వ్యక్తమవుతున్న సందేహాలు
నెహ్రూ జూపార్క్‌ పరిసరాల్లో ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ రీడింగ్‌ 272గా నమోదు
ప్రజాపక్షం /హైదరాబాద్‌
హైదరాబాద్‌లో వాయు కాలుష్యం రోజు రోజుకు పెరుగుతోంది. దీంతో రాష్ట్ర రాజధాని మరో ఢిల్లీగా మారుతోందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. చలికాలం వస్తే దేశ రాజధాని ఢిల్లీలో పక్కనున్న మనిషే కనిపించనంత కాలుష్యం ఉంటుంది. హైదరాబాద్‌లో నెలకొన్న వాతావరణ పరిస్థితులు, వాయు కాలుష్యాన్ని పరిశీలిస్తే ఢిల్లీలాగా మారే రోజు దూరంలో లేనట్లుగానే కనిపిస్తుంది. ఢిల్లీలో ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ (ఎక్యూ) సగటున 250 దాకా ఉంటుంది. ఎక్యూఐ 201 నుంచి 300 దాకా ఉంటే గాలి నాణ్యత అస్సలు బాగోలేదని అర్థం. తాజాగా హైదరాబాద్‌లోని నెహ్రూ జూపార్క్‌ పరిసరాల్లో ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ రీడింగ్‌ 272గా నమోదైంది. ఇదిలాగే కొనసాగితే జూపార్క్‌ ప్రాంతంలో ఉన్న వారికి ఊపిరి పీల్చడంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. ఇదే ప్రాంతంలో 2019లో ఎయిర్‌ క్వాలిటీ రీడింగ్‌ 150గా నమోదైంది. అప్పటితో పోలిస్తే.. గాలి కాలుష్యం బాగా పెరిగింది. ఈ ఎయిర్‌ క్వాలిటీ డేటా మొత్తం.. తెలంగాణ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డ్‌ సేకరిస్తోంది. మిగత ప్రాంతాల్లోనూ.. వాయు కాలుష్యం బాగా పెరిగిపోయింది. ముఖ్యం గా.. రెండు ఇండస్ట్రియల్‌ ఏరియాలైన పాశమైలారం, ఇక్రిశాట్‌ పరిధిలో ఎయిర్‌ పొల్యూషన్‌ దారుణంగా ఉంది. పాశమైలారంలో 278, ఇక్రిశాట్‌ దగ్గర 244గా ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ రీడింగ్‌ నమోదైంది. కొవిడ్‌ కంటే ముందున్న పరిస్థితులతో పోలిస్తే.. 55 శాతం ఎక్కువ కాలుష్యం నమోదైందని అధికారులు చెబుతున్నారు. అయితే.. సనత్‌నగర్‌లో మాత్రం ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ 150గా కొనసాగుతూ.. ఫరవాలేదనిపించే స్థాయిలోనే ఉంది. నగరంలోని మిగతా ప్రాంతాలతో పోలిస్తే.. సనత్‌నగర్‌లో పిఎం 2.5 ధూళి కణాల కౌంట్‌ ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. దీని వల్ల.. శ్వాసకోశ సంబంధమైన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని చెబుతున్నారు. 2019లో బొల్లారంలో 111గా ఉన్న ఎక్యూఐ రీడింగ్‌.. ఈసారి 185గా నమోదైంది. ఇక హైదరాబాద్‌లోని అన్ని ప్రధాన ప్రాంతాల్లో ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ రోజురోజుకు పడిపోతోంది. సిటీలో.. రెండు, మూడు ప్రాంతాలు మినహా.. మిగతా అన్ని ఏరియాల్లో ఎక్యూఐ 50 పాయింట్ల పైనే చూపిస్తోంది. జెఎన్‌టియు, కూకట్‌పల్లి, జీడిమెట్లు, ఎంజిబిఎస్‌, చార్మినార్‌, బాలానగర్‌, ఉప్పల్‌ ప్రాంతాల్లో ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ 100 దాటేసింది. ఇప్పటికైతే.. ఇదేమంత ప్రమాదకరం కానప్పటికీ.. పొల్యూషన్‌ పెరిగే అవకాశాలైతే ఉన్నాయని చెబుతున్నారు. శామీర్‌పేట్‌, ఇసిఐఎల్‌, నాచారం, మలక్‌పేట్‌, కోకాపేట్‌, కొంపల్లితో పాటు హైదరాబాద్‌ ఐఐటి ఉన్న ప్రాంతాల్లో.. తక్కువ ఎయిర్‌ పొల్యూషన్‌ నెలకొంది. అయితే.. రాబోయే రోజుల్లో చలి పెరిగితే.. గాలిలో దుమ్ము కణాల కౌంట్‌ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అప్పుడు గాలి నాణ్యత మరింత పడిపోయే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నగరంలో వేల సంఖ్యలో చెట్లు, సిటీ చుట్టూ పచ్చదనం ఉన్నా.. వాహనాల రాకపోకలు, పరిశ్రమల కారణంగా గాలి నాణ్యత పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. చలి కూడా పెరుగుతుండటంతో.. దుమ్ము, ధూళి, వాహనాల పొగ పూర్తిగా గాలిలో కలవడం లేదు. వాతావరణంలో.. పొగలా పేరుకుపోతోంది. దీంతో.. గాలిలో కాలుష్యం పెరిగి ఎయిర్‌ క్వాలిటీ తగ్గిపోతోంది. ఇదిలాగే కొనసాగితే భవిష్యత్తులో ఢిల్లీ మాదిరిగా హైదరాబాద్‌ కూడా గ్యాస్‌ ఛాంబర్‌లా మారిపోయే అవకాశం ఉంది. అందువల్ల ఇప్పటి నుంచే కాలుష్య నియంత్రణకు చర్యలు చేపట్టకపోతే ఢిల్లీలో స్కూళ్లకు సెలవులు ప్రకటించినట్లు, వాహనాల విషయంలో ఆడ్‌-ఈవెన్‌ విధానం వంటివి ప్రకటించాల్సిన పరిస్థితులు ఎదురవుతాయని చెబుతున్నారు.హైదరాబాద్‌ సిటీలో గాలి కాలుష్యం ప్రమాదకర స్థాయికి పెరగడంతో పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డ్‌ అధికారులు, సైంటిస్టులు ఈ సమస్యపై అవగాహన పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు. త్వరలోనే పారిశ్రామిక ప్రాంతాల్లో ఉన్న పరిశ్రమల యాజమాన్యాలతో వర్క్‌షాప్‌లు నిర్వహించనున్నారు. పరిశ్రమలు మాత్రమే కాదు.. వాహనాల వల్ల కూడా కాలుష్యం పెరుగుతోంది. అంతేకాదు.. భవన నిర్మాణాలతో పాటు రోడ్ల నుంచి వచ్చే దుమ్ము, బయోమాస్‌ వాడకం వంటి అనేక అంశాలు గాలి నాణ్యతను దెబ్బతీస్తున్నాయి. దీనిపై ఇప్పటికే పిసిబి రీసెర్చ్‌ చేసి.. డ్రాఫ్ట్‌ రిపోర్ట్‌ని కూడా సిద్ధం చేసింది. త్వరలోనే.. ఫైనల్‌ రిపోర్ట్‌ బయటకు రానుంది. వాస్తవానికి.. కొవిడ్‌ సమయంలో.. అంటే 2020, 2021లో లాక్‌డౌన్ల కారణంగా కాలుష్యం ఎక్కువగా నమోదయ్యే ప్రాంతాల్లో చాలా తక్కువ పొల్యూషన్‌ నమోదైంది. ఆ ప్రాంతాల్లో 20 నుంచి వంద శాతం కాలుష్యం తగ్గిపోయింది. కానీ.. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. మళ్లీ.. ఒకప్పటి రోజులు వచ్చేశాయ్‌. వాయుకాలుష్యం అనేది.. పర్యావరణ పరిరక్షణలో ఒక అధ్యాయం. అందువల్ల.. ప్రతి దేశంలో.. పర్యావరణ పరిరక్షణ అథారిటీ ఉంది. మన దగ్గర 1986లో పర్యావరణ పరిరక్షణ చట్టాన్ని తిరిగి అమలులోకి తెచ్చినప్పటికీ.. కాలుష్యాన్ని నియంత్రించే చర్యలు పెద్దగా అమలు కావడం లేదు. దీంతో తెలంగాణ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డే.. వాయు కాలుష్య కారకాలను తప్పనిసరిగా గుర్తించాల్సిన అవసరముందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. దాంతో పాటు నగరంలో.. కాలుష్య నివారణ, నియంత్రణ చట్టం- 1981 పూర్తిస్థాయిలో అమలయ్యేలా చూడాల్సిన అవసరముందని చెబుతున్నారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments