భువనగిరి-సిద్దిపేట మధ్య రూ.20 వేల కోట్ల అంచనా వ్యయంతో నిర్మాణం
భూసేకరణకు రూ. 7 వేల కోట్లు
ప్రజాపక్షం/హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహా నగరం చుట్టూ మరో ఔటర్ రింగ్ రోడ్డు రానుంది. యాదాద్రి భువనగిరి నుండి సిద్దిపేట వరకు ఈ నూతన బాహ్య వలయ రహదారిని నిర్మించనున్నారు. రోజు రోజుకు హైదరాబాద్ మహానగరంలో జనాభా పెరుగుతుండడం, జిల్లాల నుండి రాజధానికి తరలివచ్చే వారి సంఖ్య విస్తరిస్తుండడంతో ఆ ప్రభా వం హైదరాబాద్‌పై పడుతోంది. జనాభా మాత్రమే కాకుండా రవాణా పరంగా వాహనాల తాకిడి హైదరాబాద్‌కు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో రాజధాని చుట్టూ భువనగిరి నుండి సిద్దిపేటను తాకుతూ తొలి దశలో 340 కి.మీ విస్తీర్ణంలో 50 ఫీట్ల వెడల్పుతో ఈ ఔటర్ రింగ్ రోడ్డు రానుంది. ఈ రహదారిని నిర్మించేందుకు సుమారు రూ. 20 వేల కోట్లు వ్యయం కానుందని భావిస్తున్నారు. ఒక్క భూసేకరణకే రూ. 7 వేల కోట్లు అవుతుందని అంచనా వేసినట్లు రోడ్లు భవనాల శాఖ ముఖ్యకార్యదర్శి సునీల్ శర్మ బుధవారం ప్రజాపక్షంతో అన్నారు. ఈ 7 వేల కోట్లలో 50 శాతం రాష్ట్ర వాటా కాగా, మిగతా 50 శాతం కేంద్రమే భరించనున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఈ ఔటర్ రింగ్ రోడ్డు ప్రతిపాదనను కేంద్రానికి నిర్మాణ వ్యయ అంచనా (కస్ట్రక్షన్ ఎస్టిమేషన్ )తో పంపించామని, మరింత సవివరంగా తెలియజేయాలని కేంద్రం తెలిపిందని వెల్లడించారు. ఆ వివరాలను కూడా త్వరలోనే ప్రభుత్వ అనుమతితో పంపిస్తామని సునీల్ శర్మ తెలిపారు. రవాణాశాఖకు ఏటా సుమారు మూడు వేల కోట్ల ఆదాయం సమకూరుతోందన్నారు. నూతన వాహనాల వినియోగం కూడా ఇటీవలి కాలంగా గణనీయంగా పెరగుతోందన్నారు. ద్విచక్ర వాహనాలు, కార్లు, ఇతర ఫోర్ వీలర్ల లైసెన్సులు, అలాగే ఫ్యాన్సీ నెంబర్ల వేలం తదితరాల ద్వారానే రవాణాశాఖకు గత ఏడాది రూ. 300 కోట్ల ఆదాయం వచ్చిందని సునీల్ శర్మ తెలిపారు.