మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలో విషాద ఘటన
నరేష్ మృతదేహంతో కార్మికులు, అఖిలపక్ష నేతల ర్యాలీ
ఆగ్రహించిన ప్రతిపక్షాలు.. చర్చలు జరిపిన జిల్లా ఎస్‌పి
మృతుడి కుటుంబానికి రూ.12లక్షలు.. ఒకరికి ఉద్యోగమిస్తామని అధికారుల హామీ
మహబూబాబాద్ : ఆర్‌టిసి సమ్మెపై హైకోర్టు తీర్పు ఎలా వస్తుందోననే ఆందోళనతో మనస్తాపానికి గురైన మహబూబాబాద్ బస్ డిపో డ్రైవర్ ఆవుల నరే ష్(45) బుధవారం తెల్లవారుజామున పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషయం గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించాడు. మృ తుడికి భార్య పూలమ్మ, కుమారులు శ్రీకాంత్, సాయి కిరణ్ ఉన్నారు. మృతుడు నరేష్ మరిపెడ మండలం ఎల్లంపేట గ్రామస్తుడు. ఇదిలా ఉంటే నరేష్ భార్య పూలమ్మ గత ఐదేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఆమె మందులకు నెలకు సుమారుగా రూ. 5 వేలు ఖర్చవుతున్నాయి. మరోవైపు పిల్లల ఫీజులతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్నట్టు తోటి ఉద్యోగులు, స్థానికులు తెలిపారు. నరేష్ ఆత్మహత్య ఉదంతం తెలుసుకున్న కార్మికులు, అఖిలపక్ష పార్టీల నేతలు, మరిపెడ మండలం ఎల్లంపేట గ్రామస్తులు తదితరులు ఆసుపత్రికి తరలివచ్చారు. డ్రైవర్ నరేష్ మృతదేహంతో కార్మికులు, అఖిలపక్ష నేతలు ర్యాలీ నిర్వహించారు. డిపో వరకు కొనసాగింది. డిపోలోకి వెళ్లేందుకు యత్నించారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో డిపో ఎదుట నరేష్ మృతదేహంతో ధర్నాకు దిగారు. ప్రభుత్వ నిరంకుశత్వం వల్లే నరేష్ మరణించాడని, అతని కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవాలని, రూ.20లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. కొద్దిసేపు ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. జిల్లా ఎస్‌పి కోటిరెడ్డి రాజకీయ పక్షాలతో చర్చలు జరిపారు. చర్చలలో సిపిఐ జిల్లా కార్యదర్శి విజయసారధి, సిపిఎంకు చెందిన సాదుల శ్రీనివాస్, కార్మిక సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. మృతుని కుటుంబానికి రూ.12లక్షలు ఎక్స్‌గ్రేషియో, మూడెకరాల భూమి, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చేందుకు అధికారులు అంగీకరించారు. దీంతో అఖిలపక్ష నేతలు తమ ఆందోళనను విరమించారు.
మరో ఆర్‌టిసి డ్రైవర్ ఆత్మాహుతి
RELATED ARTICLES