కులగణనలో పాల్గొనని వారికి మరో అవకాశం
- 16 నుంచి 28వ తేదీ వరకు సర్వే
- బిసిలకు 42 శాతం రిజర్వేషన్లపై మార్చిలో అసెంబ్లీలో బిల్లు
- కేంద్రానికి పంపి పార్లమెంటులో ఆమోదానికి కృషి
- డిప్యూటీ సిఎం భట్టి వెల్లడి
ప్రజాపక్షం/హైదరాబాద్
రాష్ట్రంలో కులగణన సర్వేలో పాల్గొనని వారి కోసం మరోసారి కుల గణన సర్వే నిర్వహిస్తామని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. ఈనెల 16 నుంచి 28వ తేదీ వరకు ఈ సర్వే నిర్వహిస్తామని ఆయన తెలిపారు. బిసిలకు 42 శాతం రిజర్వేషన్‌లు కల్పించే విషయంలో మార్చిలో కేబినెట్‌లో తీర్మానం చేసి, సంబంధిత బిల్లుకు శాసనసభలో ఆమోదంతో చట్టబద్ధం చేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. సచివాలయంలో బుధవారం బిసి సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ కులగణన బిల్లును కేంద్ర ప్రభుత్వానికి పంపి, ఒత్తిడి తెచ్చి పార్లమెంట్‌లో ఆమోదానికి కృషి చేస్తామని చెప్పారు. ఓబిసిలకు రిజర్వేషన్‌ల కోసం వివిధ పార్టీల నాయకుల అభిప్రాయాలను తీసుకొని, రిజర్వేషన్‌లపై కలిసి వచ్చే పార్టీలను కలుపుకొని పోతామని తెలిపారు. ఇక కొందరు ఉద్దేశపూర్వకంగా ఈ సర్వేలో వివరాలు వెల్లడించ లేదన్నారు. తెలంగాణలో 3.1 శాతం మంది సర్వేలో పాల్గొన లేదన్నారు. గతంలో నిర్వహించిన సర్వేలో పాల్గొనని వారి కోసమే ఈ సారి నిర్వహిస్తున్నామన్నారు. ఫిబ్రవరి 16 నుంచి 28 వరకు సమగ్ర ఇంటింటి సర్వేలో వివరాల నమోదుకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తుందన్నారు. టోల్ ఫ్రీ నెంబర్‌కు ఫోన్ చేసి వివరాలు నమోదు చేసుకోవాలని కోరితే అధికారులు ఫోన్ చేసిన వారి ఇంటికి వెళ్లి అన్ని వివరాలు నమోదు చేసుకుంటారని తెలిపారు. మండల కార్యాలయాల్లో ప్రజా పాలన అధికారులు ఈ 10 రోజులు అందుబాటులో ఉంటారన్నారు. అక్కడ వివరాలు నమోదు చేసుకోవచ్చు అన్నారు. ఆన్ లైన్ ద్వారా కూడా కుటుంబ వివరాలు నమోదుకు అవకాశం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. బిసిల దశాబ్దాల కల నెరవేర్చేందుకు ప్రజా ప్రభుత్వంతో రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు, మేధావులు కలిసి రావాలని భట్టి విక్రమార్క విజ్ఞప్తి చేశారు.
పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తాం..
రాష్ట్రంలో ఓబిసిలకు విద్యా, రాజకీయ, ఆర్థిక రంగాల్లో 42 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు ప్రజా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని భట్టి విక్రమార్క అన్నారు. పార్లమెంట్‌లో బిల్లు ఆమోదం కోసం కలిసి వచ్చే రాజకీయ పార్టీలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఢిల్లీకి ప్రతినిధి బృందం వెళుతుందని చెప్పారు. పార్లమెంట్‌లో బిసి రిజర్వేషన్ బిల్లు ఆమోదం కోసం దేశంలోని అన్ని రాజకీయ పార్టీలను కూడా కాలుపుకపోతామన్నారు. రాష్ట్రంలో మూడు శాతం కుటుంబాలు సర్వేలో పాల్గొనలేదు వారికి మరోసారి అవకాశం ఇస్తున్నట్టు తెలిపారు. కెసిఆర్, కెటిఆర్, పల్లా రాజేశ్వర్ రెడ్డి వంటి వారు ఉద్దేశపూర్వకంగా సమాచారం ఇవ్వలేదన్నారు. మరి కొందరు అందుబాటులో లేకుండా పోయారని, వారందరి కోసం మరోసారి అవకాశం ఇస్తున్నట్టు ఆయన చెప్పారు.
రాజకీయ ప్రయోజనాలు పక్కన పెట్టాం..
రాష్ట్రంలో కుల గణన విజయవంతం అయితే దేశమంతటా చేయాల్సి వస్తుందని అనుకునేవారు రీ సర్వే కోసం డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా లక్ష మందికి పైగా సిబ్బందితో పూర్తిగా శాస్త్రీయంగా సమగ్ర ఇంటింటి సర్వే రాష్ట్రంలో జరిగిందన్నారు. రాష్ట్రంలో ఏ ఏ వర్గాల జనాభా ఎంతో శాసనసభలో లెక్కలతో సహా సిఎం రేవంత్ రెడ్డి వివరించారని, చర్చ కూడా జరిగిందన్నారు. ఓబిసిలకు రిజర్వేషన్ కల్పించే బిల్లు ఆమోదం కోసం, మద్దతు కూడబెట్టడానికి రాజకీయ ప్రయోజనాలు పక్కన పెట్టి, రాజకీయ పార్టీలు, సోషల్ యాక్టివిస్టులు, మేధావులు, ప్రజలు అంతా కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర జనాభాలో ఓబిసిలు 56 శాతంగా ఉన్నట్టు ఉపముఖ్యమంత్రి అన్నారు.
దశాబ్దాల ఓబిసిల కలలను నిజం చేసేందుకు కృషి ..
స్థానిక ఎన్నికల్లో బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు తీసుకురావడం తమ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. దశాబ్దాల ఓబిసిల కలలను నిజం చేసేందుకు కృషిచేస్తామన్నారు. రిజర్వేషన్లపై రాజకీయపరంగా కుట్రలు చేస్తే తిప్పికొడతామని స్పష్టం చేశారు. రాజకీయ లబ్ధి పక్కన పెట్టి మద్దతు పలకాలని కోరుతున్నామన్నారు. కులగణన సర్వేలో పాల్గొనని వారు అవకాశం సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రాష్ట్ర జనాభా లెక్కల్లో వచ్చేలా చూసుకోవాలన్నారు. రాష్ట్రంలో కులగణన సర్వే శాస్త్రీయంగా జరిగిందని పునరుద్ఘాటించారు. ఈ సమావేశంలో బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి, ప్రణాళిక శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా పాల్గొన్నారు.
ఆర్థిక భారమైన 56 శాతం జనాభా కోసం భరిస్తాం..
పంచాయతీ ఎన్నికలు అలస్యం కావడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక భారం పడుతుందని, అయినా జనాభాలో 56 శాతం ఉన్న బిసిలకు న్యాయం చేయడం కోసం ప్రభుత్వం ఆర్థిక భారాన్ని భరించేందుకు సిద్ధంగా ఉందని ఒక ప్రశ్నకు సమాధానంగా భట్టి విక్రమార్క తెలిపారు. పంచాయతీ ఎన్నికల్లో ఓబిసిలకు రాజకీయ రిజర్వేషన్‌లు కల్పిస్తామన్నారు.