వారం, పదిరోజుల్లో ప్రకటన వెలువడే అవకాశం
కోర్టు విచారణ తరువాతే బిఆర్‌ఎస్
అక్రమ లే అవుట్ల, ప్లాట్ల రిజిస్ట్రేషన్ నిలిపేసిన ప్రభుత్వం
ఆందోళనలో ప్లాట్ల యజమానులు
క్రమబద్ధీకరణతో ప్రభుత్వానికి సమకూరనున్న వేలకోట్ల ఆదాయం
ప్రజాపక్షం/హైదరాబాద్ : రాష్ట్రంలో మరోసారి లే అవుట్ రెగ్యులరైజేషన్ (ఎల్‌ఆర్‌ఎస్), బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీం (బిఆర్‌ఎస్)లను ప్రకటించాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. వారం పది రోజుల్లో ఎల్‌ఆర్‌ఎస్ పథకాన్ని ప్రభుత్వం ప్రకటించే అవకాశాలు ఉన్నాయని విశ్వసనీయ సమాచారం. బిఆర్‌ఎస్ పథకం కోర్టు విచారణలో ఉన్నందున ముందస్తుగా ఎల్‌ఆర్‌ఎస్ ప్రకటించి, కోర్టు విచారణ తరువాత సాధ్యాసాధ్యాలకు అనుగుణంగా బిఆర్‌ఎస్ ప్రకటించాలనే యోచనలో ఉన్నట్లు తెలిసింది. ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భావం తరువాత తెలంగాణలో రియల్ ఎస్టేట్ వ్యాపారం విపరీతంగా పెరిగిపోయింది. రాష్ట్ర ఆవిర్భావానికి తోడు కొత్త జిల్లాల ఏర్పాటు కూడా ఇందుకు దోహదపడిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో వేగంగా జరుగుతున్న పట్టణీకరణతో హైదరాబాద్ పరిసర జిల్లాలతో పాటు రాష్ట్రంలో అనేక జిల్లాల్లో రియల్ వ్యాపారం జోరుగా సాగింది. కరోనా లాక్‌డౌన్‌తో మార్చి 22వ తేదీ నుంచి రియల్ వ్యాపారానికి బ్రేక్ పడింది. అయితే అప్పటికే లక్షల సంఖ్యలో లే అవుట్లతో పెద్ద మొత్తంలో రియల్టర్లు వ్యాపారం చేశారు. అదే స్థాయిలో అక్రమ నిర్మాణాలు వెలిశాయి. అనధికార లే అవుట్లు, అక్రమ నిర్మాణాలకు రిజిస్ట్రేషన్‌లను ప్రభుత్వం ఇటీవల నిలిపేసిన విషయం తెల్సిందే. రిజిస్ట్రేషన్ శాఖ తాజా ఆదేశాలతో రాష్ట్రంలో వేలాది అనుమతి లేని లేఅవుట్లు, లక్షలాదిగా వెలిసిన అక్రమ నిర్మాణాల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. వాటిలో స్థలాలు కొనుగోలు చేసిన యజమానులు తీవ్రమైన ఆవేదనకు గురవుతున్నారు. ఈ క్రమంలో ఎల్‌ఆర్‌ఎస్, బిఆర్‌ఎస్‌ల ద్వారా వాటిని క్రమబద్ధీకరించడమే మార్గమని భావిస్తున్నట్లు సమాచారం. ఫలితంగా ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుంది. అదే సమయంలో క్రమబద్ధీకరణతో యజమానులకు కూడా ఊరట కలుగుతుందని ప్రభుత్వ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. అందుకే త్వరలోనే ఎల్‌ఆర్‌ఎస్‌ను మరోసారి ప్రకటించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుందని అధికార వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. తద్వారా వేల కోట్ల ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నట్లు సమాచారం.
కోర్టు విచారణ తరువాతే బిఆర్‌ఎస్…
ప్రభుత్వం ప్రకటించిన బిఆర్‌ఎస్ పథకం విషయం ప్రస్తుతం కోర్టు విచారణలో ఉంది. కోర్టు విచారణలో ఈ అంశం ఉండటంతో మరోసారి బిఆర్‌ఎస్ పథకాన్ని ప్రకటించేందుకు సాధ్యం కాదని అధికారులు అంటున్నారు. కోర్టు విచారణ పూర్తయి, అదేశాల ప్రకారం మరోసారి పథకాన్ని ప్రకటించేందుకు సాధ్యం అవుతుందని అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే న్యాయస్థానంలో త్వరగా విచారణ పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. గతంలో న్యాయస్థానం బిఆర్‌ఎస్‌కు సంబంధించిన ప్రక్రియను పూర్తి చేసి వివరాలు అందించాలని ప్రభుత్వాన్ని అదేశించింది. బిఆర్‌ఎస్ దరఖాస్తులు ఎన్ని క్రమబద్ధీకరించేందుకు వీలుంది, ఎన్ని తిరస్కరించినవి తదితర అంశాల వారీగా పూర్తి చేసి వివరాలు సమర్పించాలని ఆదేశించింది. ప్రస్తుతం బిఆర్‌ఎస్‌కు సంబంధించిన దరఖాస్తుల పరిశీలన, క్షేత్ర పరిశీలనలో అధికార యంత్రాంగం నిమగ్నమైంది. జిహెచ్‌ఎంసి, హెచ్‌ఎండిఎల టౌన్‌ప్లానింగ్ యంత్రాంగం గత కొన్ని రోజులుగా బిఆర్‌ఎస్ దరఖాస్తుల పరిశీలనలో తలమునకలైంది. బిఆర్‌ఎస్ దరఖాస్తులు పరిశీలన పూర్తి చేసి, కోర్టు సమర్పించేందుకు అధికారులు ప్రక్రియను ముమ్మరం చేశారు.
పట్టణీకరణతో పెరిగిన అక్రమ లే అవుట్లు…
పట్టణీకరణ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మునిసిపాలిటీలు విస్తరిస్తున్నాయి. ఈ క్రమంలో అనుమతి లేకుండానే లే అవుట్లు వెలుస్తున్నాయి. ఇక, భవన నిర్మాణాల్లో కూడా నిబంధనలను అతిక్రమిస్తున్నారు. వీటిని నిరోధించడంలో సంబంధిత వ్యవస్థలు విఫలమయ్యాయనే చెప్పవచ్చు. అయితే, అనుమతి లేని లేఅవుట్లు, నిర్మాణాలను రిజిస్ట్రేషన్ చేయవద్దని ప్రభుత్వం నిర్ణయించడంతో పూర్తిగా క్రయవిక్రయాలకు బ్రేక్ పడినట్లయింది. లే అవుట్లలలో ప్లాట్లు, అక్రమ నిర్మాణాల్లో వెలసిన అపార్ట్‌మెంట్‌లలో ఇళ్ల రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయి. దీనికి ప్రత్యామ్నాయం కేవలం ఎల్‌ఆర్‌ఎస్, బిఆర్‌ఎస్ ద్వారానే క్రమబద్ధీకరించుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఎల్‌ఆర్‌ఎస్, బిఆర్‌ఎస్‌లను ప్రభుత్వం ప్రకటించని పక్షంలో రిజిస్ట్రేషన్‌లు స్తంభించిపోతాయి. అంతేకాకుండా వాటిని కొనుగోలు చేసిన వారు తీవ్రంగా నష్టపోయే ప్రమాదముంది. రిజిస్ట్రేషన్ జరగాలంటే విధిగా అనుమతి రావాలి. అంటే వాటిని క్రమబద్ధీకరించాలి. ఇది జరగాలంటే మళ్లీ ఎల్‌ఆర్‌ఎస్, బిఆర్‌ఎస్‌లను ప్రకటించాల్సి ఉంటుంది. రాష్ట్రంలో వేల సంఖ్యలో లే అవుట్లు, లక్షల సంఖ్యలో అనుమతి లేకుండా జరిగిన నిర్మాణాలు ఉన్నట్లు అధికారులు అంచనాకు వచ్చారు. పలు మునిసిపాలిటీల పరిధిలో విలీనమైన గ్రామాలకు ఎల్‌ఆర్‌ఎస్, బిఆర్‌ఎస్‌కు ప్రభుత్వం గతంలో అనుమతించింది. వాటి పరిధిలో మొత్తం 199 విలీన గ్రామాలకు ఇది వర్తిస్తుంది. ఈ క్రమంలో రాష్ట్రంలోని అన్ని మునిసిపాలిటీలు, పట్టణాభివృద్ధి సంస్థలకూ మరోసారి ఎల్‌ఆర్‌ఎస్, బిఆర్‌ఎస్ పథకాలను అమల్లోకి తీసుకవచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది.
కూల్చడం కంటే క్రమబద్ధీకరణే మేలు…
అక్రమ నిర్మాణాలను తొలగించడం అత్యత క్లిష్టమైనదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. హైదరాబాద్ మహానగరంతో సహా రాష్ట్ర వ్యాప్తంగా లక్షల సంఖ్యలో అక్రమ నిర్మాణాలు ఉన్నాయి. వాటన్నింటిని కూల్చేస్తే ప్రజల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. కూల్చడం కంటే క్రమబద్ధీకరణే మేలు అనే ధోరణిలో ప్రభుత్వం యోచిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. నాలుగు సంవత్సరాల కిందట భారీ వర్షాలతో హైదరాబాద్ నగరాన్ని వరద నీరు ముంచెత్తింది. అక్రమ నిర్మాణాలు, చెరువులను ఆక్రమించడమే ఇందుకు కారణమని గుర్తించారు. ఇటువంటి నిర్మాణాలు దాదాపు 23వేల వరకు ఉన్నట్లు అధికారులు అప్పట్లో నివేదికలు సమర్పించారు. నాడు హడావుడిగా కూల్చివేతలు చేపట్టినా ముందుకు సాగలేదు. రాష్ట్రవ్యాప్తంగా లక్షల సంఖ్యలో ఉన్న నిర్మాణాలను కూల్చివేయడం అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ క్రమంలోనే క్రమబద్ధీకరణతో ప్రభుత్వానికి ఆదాయంతో పాటు యజమానులకు ఊరట లభిస్తుంది.
మరోసారి ఎల్‌ఆర్‌ఎస్?
RELATED ARTICLES