రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్పర్సన్ చంద్రయ్య
ప్రజాపక్షం/ ఖమ్మం మరియమ్మ మృతి కేసును రాష్ట్ర మానవ హక్కుల పరిరక్షణ కమిషన్ సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టిందని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్పర్సన్ జస్టిస్ జి. చం ద్రయ్య స్పష్టం చేశారు. బుధవారం మానవ హక్కుల కమిషన్ చైర్పర్సన్ బృందం జిల్లా కలెక్టర్ ఆర్వి కర్ణన్, పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్‌తో కలిసి నగరంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరియమ్మ కుమారుడు ఉదయ్‌కిరణ్‌ను పరామర్శించి, ఉదయ్‌కిరణ్‌కు అందిస్తున్న వైద్య సేవల గురించి సంబంధిత వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు. మరియమ్మ మృతి ఘటన దురదృష్టకరమని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా మానవ హక్కుల పరిరక్షణ కమిషన్ తగు చర్యలు తీసుకుందని, కోల్పోయిన ప్రాణాలను తిరిగి తేలేమని ఆపదలో ఉన్న వారికి మనో ధైర్యం కల్పించేందుకు కమిషన్ బృందం ఉదయ్‌కిరణ్‌కు ధైర్యం చెప్పడానికి వచ్చినట్లు జస్టిస్ జి.చంద్రయ్య తెలిపారు. ఉదయ్‌కిరణ్‌కు మెరుగైన వైద్య సేవలను అందించాలని, సమస్య ఏదైనా ఉంటే జిల్లా అధికార యంత్రాంగానికి, కమిషన్‌కు తెలియజేయాలని వైద్యాధికారులకు సూచించారు. ఉదయ్‌కిరణ్ పూర్తిగా కోలుకున్న పిదప కేసు విచారణను వేగవంతం చేసి కమిషన్ తగు చర్యలు తీసుకుంటుందని ఆయన తెలిపారు. తొలుత ఖమ్మం నగరానికి చేరుకున్న జస్టిస్ జి.చంద్రయ్య, కమిషన్ సభ్యులు ఎన్. ఆనందరావు, మహ్మద్ ఇర్పార్ అహ్మద్‌ను, ఆర్అండ్బి అతిథి గృహంలో జిల్లా కలెక్టర్ ఆర్వి కర్ణన్, పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్లు పుష్ప గుచ్ఛం అందించి స్వాగతం పలికారు. అనంతరం కమిషన్ చైర్పర్సన్ జస్టిస్ జి. చంద్రయ్య పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కమిషన్ సభ్యులు ఎన్. ఆనందరావు, మహ్మద్ ఇర్పాన్ అహ్మద్, అదనపు కలెక్టర్ ఎన్. మధుసూదన్‌రావు, రెవిన్యూ డివిజనల్ అధికారి రవీంద్రనాథ్ పాల్గొన్నారు.
మరియమ్మ మృతిపై విచారణ
RELATED ARTICLES