ఆస్ట్రేలియాలో బుమ్రా, సిరాజ్‌పై
జాత్యహంకార వ్యాఖ్యలు
క్రికెట్ మ్యాచ్ రిఫరీకి బిసిసిఐ ఫిర్యాదు
సిడ్నీ : ప్రత్యర్థి ఆటగాళ్లను మానసికంగా వేధించి, తద్వారా ఆధిపత్యాన్ని కనబరిచే ప్రయత్నం చేసే ఆస్ట్రేలియా క్రికెట్ అభిమానులు మరోసారి స్లెడ్జింగ్‌కు పాల్పడ్డారు. భారత ఆటగాళ్లు జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్‌పై ఓ ప్రేక్షకుడు జాత్యహంకార వ్యాఖ్యలు చేశాడు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) వెంటనే మ్యాచ్ రిఫరీ డేవిడ్ బూన్‌కు ఫిర్యాదు చేసింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) మార్గదర్శకాలకు, క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించిన సదరు వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కోరినట్టు బిసిసిఐ అధికారి ఒకరు పీటీఐతో మాట్లాడుతూ చెప్పాడు. ఆటగాళ్ల స్వేచ్ఛ, భద్రతకు ఇలాంటి సంఘటనలు విఘాతం కలిగిస్తాయని సదరు అధికారి వ్యాఖ్యానించాడు. ఇలావుంటే, బుమ్రా, సిరాజ్‌పై జాత్యహంకార వ్యాఖ్యలు చేసిన ప్రేక్షకుడు మద్యం మత్తులో ఉన్నట్టు తెలుస్తోంది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని మ్యాచ్ రిఫరీని బిసిసిఐ కోరింది. అతను ఎలాంటి చర్యలు తీసుకుంటాడన్నది చూడాలి. భారత క్రికెటర్లకు ఆస్ట్రేలియా అవమానాలు ఎదురుకావడం ఇదే మొదటిసారి కాదు. ఆసీస్ క్రికెటర్లు కూడా స్లెడ్జింగ్ వీరులుగా ముద్రపడిన వారే. సిడ్నీ టెస్టులో హర్భజన్ సింగ్‌పై అనవసర రాద్ధాంతం సృష్టించి, అప్పట్లో వివాదాన్ని ఐసిసి వరకూ తీసుకెళ్లిన క్రికెట్ ఆస్ట్రేలియా అధికారులు ఈ తాజా పరిణామాన్ని ఏ విధంగా స్వీకరిస్తారన్నది ఆసక్తి రేపుతోంది.
భారత్‌కు గాయాల బెడదు
ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడవ టెస్టు మ్యాచ్‌లో ఎదురీదుతున్న భారత క్రికెట్ జట్టును గాయాల బాధ కూడా వెంటాడుతున్నది. వికెట్‌కీపర్ బ్యాట్‌మన్ వృద్ధిమాన్ సాహా, ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా శనివారం గాయపడ్డారు. వీరిద్దరినీ స్కానింగ్ పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పాట్ కమిన్స్ వేసిన ఒక బంతి అత్యంత వేగంగా దూసుకొచ్చి పంత్ ఎడమ మోచేతికి బలంగా తగిలింది. అతని గాయం తీవ్రతను తెలుసుకోవడాని స్కానింగ్ చేయించినట్టు బిసిసిఐ ఒక ప్రకటనలో పేర్కొంది. గాయపడిన పంత్ స్థానాన్ని రిజర్వ్ వికెట్‌కీపర్ వృద్ధిమాన్ సాహా భర్తీ చేస్తాడని తెలిపింది. పంత్ 67 బంతుల్లో 36 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఈ సంఘటన చోటు చేసుకుంది. వెంటనే వైద్యులు తాత్కాలికంగా ఆన్‌ఫీల్డ్ చికిత్సను అందించారు. కానీ, ఏకాగ్రత కోల్పోయిన పంత్ తన ఫామ్‌ను కొనసాగించలేకపోయాడు. స్కోరుకు ఒక్క పరుగు కూడా జోడించకుండానే అతను జొస్ హాజెల్‌వుడ్ బౌలింగ్‌లో డేవిడ్ వార్నర్ క్యాచ్ అందుకోగా పెవిలియన్ చేరాడు.
రవీంద్ర జడేజా 26 పరుగుల వద్ద బ్యాటింగ్ చేస్తున్నప్పుడు, ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్ వేసిన బంతి అతని ఎడమచేతి బొటన వేలికి బలంగా తగిలింది. దీనితో విలవిల్లాడిన అతనికి ఫిజియోథెరపిస్టు తాత్కాలిక సేవలను అందించాడు. మొదటి ఇన్నింగ్స్ ముగిసే సమయానికి 28 పరుగులతో నాటౌట్‌గా ఉన్న జడేజాను భారత అధికారులు స్కానింగ్ కోసం ఆసుపత్రికి పంపారు. అతను ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్ చేయలేదు. మొత్తం మీద ఈ సిరీస్‌లో భారత క్రికెట్ జట్టును గాయాల బాధ తీవ్రంగా వేధిస్తున్నది. పేసర్ ఇశాంత్ శర్మ ఫిట్నెస్ సమస్యల కారణంగా సిరీస్ ఆరంభానికి ముందు వైదొలిగాడు. మహమ్మద్ షమీ చెతి నొప్పితో అల్లాడుతుండగా, ఉమేష్ యాదవ్ కండరాల నొప్పితో బాధపడుతున్నాడు. లోకేష్ రాహల్ చేతి మణికట్టు గాయం కారణంగా విశ్రాంతి తీసుకుంటున్నాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ పూర్తిగా ఈ సిరీస్‌కు దూరంకాగా, అతని స్థానంలో అజింక్య రహానే జట్టుకు సారథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే.
పట్టు బిగించిన ఆస్ట్రేలియా
భారత్‌తో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌పై ఆసీస్ పట్టు బిగించింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 103 పరుగులు చేసింది. అంతకు ముందు ఆసీస్ తన తొలి ఇన్నింగ్స్‌లో 338 పరుగులు చేయగా, అందుకు సమాధానంగా భారత్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్లకు 96 పరుగులు చేసింది. మూడో రోజు ఈ ఓవర్‌నైట్ స్కోరుతో ఆటను కొనసాగించి, 244 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా ఆసీస్‌కు 94 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన ఆస్ట్రేలియా మూడో రోజు ఆట ముగిసే సమయానికి మొత్తం 197 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఇంకా ఎనిమిది వికెట్లు చేతిలో ఉన్నాయి.
మనోళ్లపై జాతివివక్ష
RELATED ARTICLES