త్యాగాలకు సిద్ధమవుతాం
సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్‌రెడ్డి హెచ్చరిక
“మనువాదం దళితులు అనే అంశంపై సదస్సు
ప్రజాపక్షం/హైదరాబాద్–
మనువాద సిద్ధాంతాన్ని అమలు చేయాలని ప్రయత్నిస్తే, కమ్యూనిస్టులు ఎంతకైనా తెగిస్తారని, మతోన్మాదాన్ని బొంద పెట్టేందుకు అవసరమైన త్యాగాలకు సిద్ధమవుతామని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్‌రెడ్డి హెచ్చరించారు. కులగణన చేపట్టి, జనాభా ప్రతిపాదకన దళితులకు రిజర్వేషన్లను పెంచాలని, బడ్జెట్‌లో అందుకు వీలుగా నిధులను కేటాయించాలని డిమాండ్ చేశారు. ఎఐడిఆర్‌ఎం జాతీయ సమితి సమావేశాల నేపథ్యంలో దళిత హక్కుల పోరాట సమితి(డిహెచ్‌పిఎస్) ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో “మనువాదం అనే అంశంపైన సదస్సు జరిగింది. ఈ సదస్సుకు డిహెచ్‌పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు బందెల నర్సయ్య అధ్యక్షత వహించారు. చాడ వెంకట్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరవ్వగా ఎఐడిఆర్‌ఎం అధ్యక్షుడు ఎ.రామ్మూర్తి, ప్రధాన కార్యదర్శి బి.ఎస్. నిర్మల్ కుమార్, డిహెచ్‌పిఎస్ రాష్ట్ర ఇన్‌చార్జ్ ఎం. బాలనర్సింహ్మ, గౌరవ అధ్యక్షుడు కె.ఏసురత్నం, వర్కింగ్ ప్రెసిడెంట్ లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి మారుపాక అనిల్ కుమార్, రత్నకుమారి, తెలంగాణ ప్రజా నాట్య మండలి ప్రధాన కార్యదర్శి పల్లె నర్సింహ్మ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా చాడ వెంకట్‌రెడ్డి ప్రసంగిస్తూ జనాభా ప్రతిపాదికన రిజర్వేషన్లు, సౌకర్యాలు, నిధుల కేటాయింపులపై జాతీయ స్థాయిలో ఉద్యమించాలని సూచించారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం హిందూత్వ ఏజెండాతో సంఘ్ పరివార్ ఆలోచనను, ఆకాంక్షలను అమలు చేస్తోందని విమర్శించారు. ‘బిజెపి హఠావో, దేశ్‌కు బచావో’ అనే నినాదంతో ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. బడుగు, బలహీనవర్గాల పక్షాన బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌లు ఎప్పడైనా మాట్లాడారా? అని నిలదీశారు. వారు ఎప్పటికీ కోటీశ్వరులకు కొమ్ముకాస్తారని, కార్పొరేట్లకు అనుకూలంగా ఉంటారని విమర్శించారు. బిసి అని చెప్పుకునే ప్రధాని మోడీ అనేక హామీలను విస్మరించారన్నారు. స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయినప్పటికీ రాజ్యాంగ హక్కుల అమలుపైన చర్చించాల్సిన పరిస్థితులు ఎందుకొచ్చాయని, దీనికి బాధ్యులేవరని ప్రశ్నించారు. భారతదేశం తరహా మతం, కులాల నిచ్చేన ప్రపంచంలో ఎక్కడా లేదన్నారు. 18 నుండి 20 శాతం వరకు దళితుల జనాభా పెరిగిందన్నారు. దళిత బిడ్డగా డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ చదువకునే రోజుల్లోనే అనేక అవమానాలకు, మానసిక వేదనకు గురయ్యారని, దేశ ఆర్థిక స్థితిగుతులను పరిశీలించి ఒక చక్కని రాజ్యాంగాన్ని రూపొందించారన్నారు. ఇప్పటికైనా దళితులకు న్యాయం జరగాలన్నారు. ప్రజల కోసం పనిచేయాల్సిన ప్రభుత్వం, పేదల బతుకులను బజారున పడేస్తోందని, గరీభీ అటావో, అచ్చేదీన్ ఆయేగా అనే నినాదాలు ఎన్ని వచ్చినప్పటికీ వాటి అమలు ప్రశ్నార్ధకంగా మారిందన్నారు. పాలకులు మారుతున్నప్పటికీ పేదరికం పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పాలకులు నిస్సిగ్గుగా వ్యవహారిస్తున్నారని, చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్రోల్, డీజిల్ ధరలు , నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగినా వాటిని పట్టించుకునే పరిస్థితుల్లో లేరని విమర్శించారు. మోడీ ప్రభుత్వం రైతులను బజారుపాలు చేసిందని, సామాజిక న్యాయం పక్కనపెట్టి, రామునిపేరుతో రాజకీయం చేస్తున్నారని, దళితులపైన దాడులు పెరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎర్రజెండాల ఆధ్వర్యంలో గుడిసెలు వేసుకునే కార్యక్రమంలో అనేక మంది ప్రజలు పోటీపడుతున్నారంటేనే పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థమవుతోందన్నారు. పోరాడితేనే హక్కులు వస్తాయని ఆయన పునరుద్ఘాటించారు. రామ్మూర్తి మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం దళితులకు హక్కులను కల్పించిందన్నారు. అంటరానితనం లేదని స్పష్టం చేసిందన్నారు. మనుధర్మం నాలుగు వర్గాలుగా విభజించారని, ఇందులో దళితులను అంటరానివారిగా చూశారన్నారు. బాలనరసింహా మాట్లాడుతూ జనాభా ప్రాతిపదికన దళితులకు అన్ని సౌకర్యాలను కల్పించాలని, సహజవనరులను కూడా పంపిణీ చేయాలని, ఆ దిశగా పార్లమెంట్‌లో చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. దళితులను పాలేరుల కంటే హీనంగా చూస్తున్నారన్నారు. నిర్మల్‌కుమార్ మాట్లాడుతూ మను ధర్మంలో దళిత, గిరిజనులు లేరని, రాజ్యాంగం ప్రకారమే వారికి పూర్తి హక్కులు కల్పించారన్నారు. రిజర్వేషన్లు, రాజ్యాంగంపైన దాడులు జరుగుతున్నాయన్నారు.
మనువాదాన్ని అమలు చేయాలని చూస్తే ఎంతకైనా తెగిస్తాం
RELATED ARTICLES