ఆయన వెంటే సత్యేందర్ జైన్ కూడా..
ఇద్దరి రాజీనామాలూ ఆమోదించిన సిఎం కేజ్రీవాల్
న్యూఢిల్లీ : ఢిల్లీ ‘లిక్కర్ గేట్’ అవినీతి కేసులో ఇద్దరు మంత్రులు మంత్రివర్గం నుండి వైదొలగారు. సిబిఐ కస్టడీలో ఉన్న ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా మంగళవారం తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆప్ ప్రభుత్వంలో మొత్తం 33 శాఖలు ఉండగా, అత్యంత కీలకమైన 18 శాఖలను ఇప్పటివరకూ సిసోడియానే నిర్వహిస్తూ వచ్చారు. ఆయన వెంటే ఢిల్లీ రాష్ట్ర హోంశాఖామంత్రి సత్యేంద్ర కుమార్ జైన్ కూడా తన పదవికి రాజీనామా సమర్పించారు. ఈ మంత్రులు ఇద్దరూ 2021 ఎక్సైజు విధానం రూపొందించడంలో జరిగిన అవినీతిలో పాత్రధారులుగా ఉన్నారని సిబిఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసింది. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వారిద్దరి రాజీనామాలను ఆమోదించారు. సత్యేంద్ర జైన్ హోంశాఖతోపాటు ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, పరిశ్రమలు, విద్యుత్, జలశాఖ, పట్టణాభివృద్ధి, నీటి పారుదల, వరదల నియంత్రణ శాఖలు సహా ఆయనే నిర్వహించారు. సత్యేంద్ర జైన్ హవాలా కేసులో తొమ్మిది నెలలుగా తీహార్ జైలులో ఉంటున్నారు. అయితే ఆయన జైలుకు వెళ్ళాక ఆయనశాఖల బాధ్యలన్నింటినీ సిసొడియాకు బదలాయించారు. దీంతో ఇప్పటివరకూ సత్యేంద్రజైన్ పోర్టుఫోలియో లేని మంత్రిగా క్యాబినెట్‌లో కొనసాగుతూ జైలులో కాలక్షేపం చేస్తున్నారు. అదేవిధంగా మనీశ్ సిసోడియా విద్యాశాఖ నిర్వహించారు. ఈ శాఖలో అసాధారణమైన మార్పులు తీసుకువచ్చారు. విద్యార్థులు, తల్లితండ్రులు మెచ్చుకోదగిన రీతిలో విద్యాశాఖను సంస్కరించారు. ఆప్ ప్రభుత్వ ఎజెండాను అమలు చేయడంలో ఈ మంత్రులు ఇద్దరూ ప్రభుత్వంలో కీలకపాత్ర వహిస్తున్న దశలో వారిపైఈ లిక్కర్‌గేట్ అవినీతి ఆరోపణలు వచ్చాయి. మనీశ్ సిసోడియా విద్యాశాఖతోపాటు ఆర్థికశాఖ, ప్రణాళికలు, భూమి, భవనాలు, విజిలెన్స్, సేవలు, పర్యాటకరంగం, కళలు, సంస్కృతి, భాష, కార్మిక, ఉపాధి కల్పనాశాఖ, ప్రజా పనుల శాఖతోపాటు సత్యేంద్రజైన్ శాఖలను కూడా నిర్వహించారు. ఇప్పుడు సిసోడియాను అరెస్టుచేశాక ఆయన శాఖలను ఢిల్లీ రాష్ట్ర రెవెన్యూమంత్రి కైలాశ్ గెహ్లాట్, సాంఘిక సంక్షేమశాఖామంత్రి రాజ్‌కుమార్ ఆనంద్‌లకు కేటాయించారు. మనీశ్ సిసోడియాను ఈనెల 26న రెండో విడత విచారణ సందర్భంగా దర్యాప్తు కార్యాలయానికి పిలిచిన సిబిఐ ఏడు గంటలపాటు ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించింది. ఆయన దర్యాప్తునకు సహకరించడంలేదని పేర్కొంటూ సాయంత్రం అరెస్టు చేసింది. మరునాడు సోమవారం ప్రత్యేక కోర్టులో హాజరుపరిచింది. ఐదురోజులపాటు కస్టడీకి తీసుకుంది. మార్చి 4 వరకూ సిసోడియా సిబిఐ కస్టడీలో ఉంటారు. కాగా సత్యేంద్రజైన్‌ను హవాలా కేసులో గత ఏడాది మే నెలలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) అరెస్టు చేసింది. కాగా, 2022 ఆగస్టు నెలలో మనీశ్ సిసోడియా పేరు కూడా లిక్కర్ గేట్ కేసులో బయటకు రావడంతో ఆయనకు కూడా ఈ సెగ తగిలింది. ఇక అప్పటినుండి సిబిఐ ఆయనపై గురిపెట్టింది. 2022 ఆగస్టు 19న సిబిఐ అధికారులు మనీశ్ సిసోడియా నివాసంలో సోదాలు చేశారు. మొత్తం 31 ప్రాంతాలలో ఈ సోదాలు జరిపారు. ఆ తరువాత 11 రోజులకే ఆగస్టు 30వ తేదీన సిసోడియా బ్యాంకు లాకర్లను 14 గంటలసేపు తనిఖీలు చేసింది. ఈ రెండు దాడుల సందర్భంగానూ సిసోడియా నుండి ఎలాంటి సాక్ష్యాలూ, నగదు, ఆస్తి పత్రాలుగానీ సిబిఐకి పెద్దగా లభించలేదు. 2021 ఎక్సైజు విధానం రూపొందించడంలో అవినీతి జరిగిందని శంకించిన ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా ఈ విషయంలో విచారణ జరపాలని సిబిఐని కోరారు. దాంతో సిబిఐ రంగంలోకి దిగింది. ఆ వెంటే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కూడా రంగంలోకి దిగింది. హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ సహా పలు ప్రాంతాలలో మద్యం వ్యాపారులను, ఢిల్లీ ప్రభుత్వంలో ఉన్న ఎక్సైజుశాఖ ఉన్నతాధికారులతోపాటు ఆప్ పార్టీలో ఉన్న 15 మందిపై కూడా కేసులు నమోదు చేశారు. ఇప్పటికే రెండేసి చార్జిషీటులు నమోదు చేశారు.
ప్రముఖ జర్నలిస్టు సిసోడియా
రాజకీయాలలోకి రాకమునుపు మనీశ్ సిసోడియా ప్రముఖ జర్నలిస్టు. అవినీతి లేని ప్రభుత్వ వ్యవస్థ, మానవతావాదంతో కూడిన విద్యా వ్యవస్థ, పరిశుద్ధమైన రాజకీయ వ్యవస్థ ఉండాలని ఆశించి రాజకీయ కర్యకర్తగా పనిచేశారు. జర్నలిజంలో డిప్లమో చేశారు. ప్రముఖ కార్యకర్తగా ఆయన పేరు పొందారు. అంతకుముందు చాలాకాలంపాటు జీ న్యూస్‌లో, ఆలిండియా రేడియోలో పనిచేశారు. సమాచార హక్క ఉద్యమంలో పాల్గొనడంకోసం ఆయన జర్నలిజం వదిలేశారు. తర్వాత జన్ లోక్‌పాల్ ఆందోళన్ వ్యవస్థాపకులలలో కీలకపాత్ర వహించారు. అవినీతి వ్యతిరేక ఉద్యమంలో అన్నాహజారేతో కలిసి ఆయన జైలుకు వెళ్ళారు. దేశవ్యాప్తంగా అవినీతి రహిత రాజకీయాలు ఉండాలని ఆయన గాఢంగా వాంఛించారు. కేంద్ర మంత్రుల అవినీతికి వ్యతిరేకంగా ఆయన ఢిల్లీలో పది రోజులు నిరాహార దీక్ష చేశారు. స్వచ్చమైన, నిజాయతీతో కూడిన సమాజం ఆవిర్భవించాలంటే విద్యాబోధనలో, విద్యా వ్యవస్థలో విప్లవం రావాలని ఆయన ఆశించారు. చివరకు ఆయన అవినీతి కేసులో అరెస్టయ్యారు!!
బెయిలు తిరస్కరించిన సుప్రీంకోర్టు
లిక్కర్‌గేట్ కేసులో తనను అరెస్టు చేయడాన్ని మనీశ్ సిసోడియా తీవ్రంగా వ్యతిరేకించారు. తనపై సాక్ష్యాలు లేకుండా అక్రమంగా కేసులు పెట్టారిరని పేర్కొంటూ సిబిఐకి వ్యతిరేకంగా మంగళవారంనాడు ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయిచారు. కానీ సుప్రీంకోర్టు ఆయనకు బెయిలు ఇచ్చేందుకు నిరాకరించంతో ఆయన ఉపముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. మార్చి 4 వరకు ఆయన సిబిఐ కస్టడీలో ఉంటారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్,జస్టిస్ పి.ఎస్.నరసింహలతో కూడిన ధర్మాసనం ఎదుట ప్రముఖ న్యాయవాది అభిషేక్ సింఘ్వి ఆయన తరపున కేసు వాదించారు. సిబిఐ తరపున తుషార్ మెహతా హాజరయ్యారు. ఈ అరెస్టు ఘటన కేవలం ఢిల్లీలో జరిగిందని, అంతమాత్రం చేత ఆయన నేరుగా ఏవిధంగా సుప్రీంకోర్టుకు వస్తారని ధర్మాసనం ప్రశ్నించింది. ముందుగా ఆయన ఢిల్లీ హైకోర్టులో, ట్రయల్ కోర్టులో పరిష్కారాలు అన్వేషించాలని వ్యాఖ్యానించింది.