మంత్రిగా మహమూద్ అలీ ప్రమాణం చేసే అవకాశం
టిఆర్‌ఎస్‌ఎల్‌పి నేతగా కెసిఆర్ ఏకగ్రీవ ఎన్నిక
ప్రజాపక్షం/ హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు రెండవసారి ప్రమాణం స్వీకారం చేయనున్నారు. రాజ్‌భవన్‌లో గురువారం మధ్యాహ్నం 1.25 గంటలకు ఆయనతో గవర్నర్ ఇ.ఎస్.ఎల్.నరసింహన్ ప్రమాణం చేయించనున్నారు. ఆయనతో పాటు మహమూద్ అలీ మంత్రిగా ప్రమాణం స్వీకారం చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. రెండవసారి టిఆర్‌ఎస్‌ఎల్‌పి నేతగా కెసిఆర్ బుధవారం ఎన్నికైన తరువాత ఆ విషయాన్ని టిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు గవర్నర్‌కు సమర్పించారు. అలాగే ముఖ్యమంత్రి పదవికి చేసిన రాజీనామా పత్రాన్ని కూడా అందజేశారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పదవికి కెసిఆర్ రాజీనామాను గవర్నర్ నరసింహన్ ఆమోదించారు. వెంటనే ముఖ్యమంత్రిగా పదవీ స్వీకారం చేయాలని కెసిఆర్‌ను గవర్నర్ ఆహ్వానించారు. ఇదిలా ఉండ గా, టిఆర్‌ఎస్ శాసనసభాపక్ష నేతగా కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఎకగ్రీవంగా ఎన్నికయ్యారు. తెలంగాణ భవన్‌లో బుధవారం కొత్తగా ఎన్నికైన టిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు సమావే శమయ్యారు. ఈ సమావేశంలో పార్టీ శాసనసభాపక్ష నేతగా కెసిఆర్ పేరును ఆలేరు ఎంఎల్‌ఎ గొంగిడి సునీత ప్రతిపాదించగా,ధర్మపురి ఎంఎల్‌ఎ కొప్పు ల ఈశ్వర్ బలపర్చారు. కెసిఆర్‌ను ఏకగ్రీవంగా శాసనసభ పక్ష నేతగా ఎంఎల్‌ఎలు ఎన్నుకున్నారు. అనంతరం ఆయన తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి, రాజీనామా పత్రాన్ని గవర్నర్ ఇ.ఎస్.ఎల్. నరసింహన్‌కు పంపించారు.
పంచాయతీ ఎన్నికలకు సిద్ధం కండి
అంతకుముందు జరిగిన సమావేశంలో కెసిఆర్ ఎంఎల్‌ఎలను ఉద్దేశించి మాట్లాడుతూ రాబోయే పంచాయతీ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. తమ నియోజకవర్గాల్లో నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని, ప్రజల విశ్వాసాన్ని మరింత పెంచుకోవాలని కెసిఆర్ సూచించినట్లు తెలిసింది. చిన్న పొరపాట్ల వల్లనే 14 సీట్ల వరకు పొగొట్టుకున్నామన్నారు.