HomeNewsBreaking Newsమద్యం షాపులు... జనం బారులు

మద్యం షాపులు… జనం బారులు

సడలింపులతో లాక్‌డౌన్‌ మూడవదశ ప్రారంభం
న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యం లో దేశంలో విధించిన మూడవ దశ లాక్‌డౌన్‌ అనేక సడలింపులతో సోమవారం ప్రారంభమైంది. మద్యం షాపులు సహా నిత్యావసరాలు కాని దుకాణాలు కూడా తెరుచుకోవ-డంతో రోడ్లపై వాహనదారులు బారులు తీరారు. అయితే ప్రభుత్వాలు పదే పదే భౌతిక దూరం పాటించాలని మొత్తుకుంటున్నప్పటికీ ప్రజలు మాత్రమే ఆ నిబంధనను గాలికి వదిలేశారు. ఒక సరళరేఖ మాదిరిగా దుకాణాల ముందు పెద్ద ఎత్తు క్యూ కట్టారు. మూడవ విడత లాక్‌డౌన్‌ కరళీకృతం చేయడంతో ఢిల్లీలోని అనేక ప్రాంతాల్లో మద్యం దుకాణాల ముందు మద్యంప్రియులు గుమిగూడారు. వారిని నియంత్రించడం పోలీసు సిబ్బందికి ఒక సవాల్‌గా మారింది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు లాఠీలు ప్రయోగించాల్సి వచ్చింది. ప్రైవేటు వాహనాలు రాకపోకలు సాగిచేందుకు అన్ని జోన్లలోనూ షరతులతో కూడిన అనుమతులను కేంద్ర హోంశాఖ ఇవ్వడంతో అనేక నగరాల్లో ట్రాఫిక్‌ కిటకిటలాడింది. లాక్‌డౌన్‌ కారణంగా 40 రోజులపాటు ఉన్న నిశ్సబ్దమంతా మాయమైంది. కిక్కిరిసిన వాహనాలతో రోడ్లన్ని హోరెత్తిపోయాయి. కంటైన్మెంట్‌ జోన్లలో మాత్రం ఆంక్షలు కొనసాగుతున్నాయి. రెడ్‌జోన్లలో కూడా ప్రైవేటు వాహన రాకపోకలకు అనుమతులిచ్చారు. అత్యవసర పరిస్థితుల్లో ఇంతకు ముందు కార్లలో ఒక డ్రైవర్‌తో పాటు మరొక వ్యక్తిని అనుమతించగా, ప్రస్తుతం డ్రైవర్‌తో పాటు ఇద్దరు వ్యక్తులు ప్రయాణం చేసేలా సడలింపులిచ్చారు. ద్విచక్ర వాహనాలపై మాత్రం వెనుకాల కూర్చునేందుకు మరొక వ్యక్తికి అవకాశం కల్పించలేదు.
మూడవ విడత లాక్‌డౌన్‌లో కొన్ని ప్రధానాంశాలు
* 40 రోజుల తరువాత దేశ రాజధాని ఢిల్లీలో మద్యం దుకాణాలు తెరుచుకోవడ-ంతో దుకాణాల ముందు మద్యం ప్రియులు కిక్కిరిసిపోయారు. భౌతిక దూరం నిబంధనను తుంగలో తొక్కారు. దీంతో షాపులు తెరిచిన కొన్ని గంటల్లోనే మళ్లీ మూతపడ్డాయి. ఢిల్లీలో మార్చిన 23న లాక్‌డౌన్‌ ప్రకటించిన దాదాపు నెలన్నర తరువాత నగరంలో దాదాపు 150 లిక్కర్‌ విక్రయ దుకాణాలు తెరుచుకున్నాయి. ఈ నేపథ్యంలో అనేక ప్రాంతాల్లో దుకాణాల ముందు బారులు తీరడంతో సమస్యలు తలెత్తాయి. భౌతిక దూరం నిబంధనను కచ్చితంగా పాటించాలని మార్గదర్శకాల్లో హోంమంత్రిత్వశాఖ స్పష్టం చేసినప్పటికీ, అలాంటి నిబంధనను పాటించినట్లు ఎక్కడా కనిపించలేదు. మరోసారి దుకాణాలు తెరవడానికి ముందు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని యజమానులను ఆదేశించామని ప్రభుత్వ సీనియర్‌ అధికారి ఒకరు చెప్పారు. పశ్చిమ ఢిల్లీలో దుకాణాల ముందు ప్రజలు పొడవైన లైన్లలో నిల్చుకున్నారని, అయితే భౌతిక దూరం పాటించేలా ప్రజలు నిలబడేందుకు ఎలాంటి గిరులు ఏర్పాటు చేయకపోవడంతో అత్యధిక దుకాణాలు మూసివేయాల్సి వచ్చిందని ఆ అధికారి పేర్కొన్నారు. మరోసారి షాపులు తెరవడానికి ముందు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని యజమానులను ఆదేశించామన్నారు. కాశ్మీర్‌ గేటలో ఓ ఔట్‌లెట్‌ వద్ద ప్రజలు భౌతిక దూరం నిబంధనను ఉల్లంఘించడంతో పోలీసులు వారిపై స్వలంగా లాఠీచార్జి చేశారన్నారు. కాగా, హోంమంత్రిత్వశాఖ సవరించిన మార్గదర్శకాల మేరకు కార్మికులు అందుబాటులో ఉన్న చోట నిర్మాణ కార్యకలాపాలు పునరుద్ధరించబడ్డాయి.
* పశ్చిమ బెంగాల్‌లో రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌,ఆరెంజ్‌ జోన్లలో సడలింపులపై ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నందున రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాలు ఎడారినే తలపిస్తున్నాయి. నిత్యావసర వస్తువుల విక్రయ షాపులు మినహాయించి అనేక దుకాణాలు మూతపడే ఉన్నాయి. రాష్ట్రంలో అనేక ప్రదేశాల్లో ఉదయం వేళల్లో వాహనాలు రోడ్డెక్కలేదు. 20మంది ప్రయాణికులతో మాత్రమే వాహనాలను నడపడం ఆర్థికంగా లాభదాయకం కాదని పేర్కొంటూ బస్‌ ఆపరేటర్లు సేవలను ప్రారంభించడానికి కూడా నిరాకరించారు.
* ఛత్తీస్‌గఢ్‌లో కంటైన్మెంట్‌ జోన్లు మినహాయించి ఔట్‌లెట్లు తెరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో మద్యం దుకాణాల వద్ద పెద్ద ఎత్తున ప్రజలు లైన్లు కట్టారు. రాజనందగన్‌లోని ఓ మద్యం దుకాణం వద్ద ప్రజలు భౌతిక దూరం నిబంధనను ఉల్లంఘించి భారీస్థాయిలో గుమిగూడారు. రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ మద్యం దుకాణాలు ఉదయం 8 నుంచి రాత్రి 7 గంటల వరకు తెరిచేందుకు అనుమతులిచ్చిం ది. దాకాణాల వద్ద జనసమూహాన్ని తగ్గించుకునేందుకు కొన్ని ప్రాంతాల్లో మద్యాన్ని హోం డెలివరీ చేసేందుకు కూడా పనులు ప్రారంభించినట్లు ఎక్సైజ్‌ అధికారులను ఉటంకిస్తూ పిటిఐ వార్తా సంస్థ పేర్కొంది. అయితే అనేక జిల్లాల్లో స్థానిక అధికార యంత్రాంగం ఉదయం 8 నుంచి సాయంత్రం 4 వరకే మద్యం దుకాణాలు తెరిచేందుకు అనుమతులిచ్చారు.
* కేరళలో సింగిల్‌, మల్టీబ్రాండ్‌ మాల్స్‌ మినహా రాష్ట్ర ప్రభుత్వం కేరళ దుకాణాలు, వ్యాపార సంస్థల చట్టం కింద నమోదు చేసుకున్న దుకాణాలు తెరిచేందుకు అనుమతినివ్వడంతో తిరువనంతపురంలో నిత్యావసర వస్తువుల విక్రయ దుకాణాలు, నిత్యావకర కాని వస్తువుల దుకాణాలు తెరుచుకున్నాయి.
* అసోంలో ఆంక్షల నుంచి రాష్ట్ర ప్రభుత్వం సడలింపులు ప్రకటించడ-తో రాజధాని గువహటిలో ప్రజల, వాహన రాకపోకలు అమాంతం పెరిగిపోయాయి. సోమవారం నుంచి రాష్ట్రంలో రాత్రి 6 నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూని విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం 33 జిల్లాలకు గాను నాలుగు జిల్లాలు ఆరెంజ్‌ జోన్లలో ఉండగా, మిగిలినవన్ని కూడా గ్రీన్‌జోన్‌లోనే ఉన్నాయి.
* ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో క్షౌరశాలలు తెరుచుకున్నాయి. లాక్‌డౌన్‌ను ఈ నెల 17 వరకు పొడిగిస్తూ ఆంక్షలనుంచి కొన్ని సడలింపులు చేస్తూ కేంద్ర హోం శాఖ మార్గదర్శకాలు విడుదల చేసిన మేరకు రాష్ట్ర ప్రభు త్వం దుకాణాలు తెరుచుకునేందుకు అనుమతులిచ్చింది.
* తమిళనాడు రాజధాని చెన్నైలో మొబైల్‌ ఫోన్‌, ఎలక్ట్రిక్‌, స్టేషనరీ షాపులు తెరుచుకున్నాయి.
* కర్నాటక రాజధాని బెంగళూరులోని పీన్య పారిశ్రామిక ప్రాంతంలో గార్మెంట్‌ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికులు విధుల్లో చేరారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన సవరించిన మార్గదర్శకాల మేరకు కంపెనీని తెరిచారు. బెంగళూరులో పెద్ద పెద్ద వాహనాలు కూడా రోడ్లపైకి వచ్చాయి. దీంతో కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. కర్నాటకలో అతి చిన్నపట్టణమైన కొలార్‌లో కొంత మంది మద్యం దుకాణాల ముందు టపాసులు కాల్చిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి.
* మహారాష్ట్రలో రాష్ట్ర ప్రభుత్వం లిక్కర్‌ దుకాణాలు తెరిచేందుకు అనుమతించినప్పటికీ స్టోర్లు తెరిచేందుకు పుణెలో జిల్లా అధికార యంత్రాంగం నుంచి అధికారిక ఉత్తర్వులు రాకపోవడంతో నిరాశ చెందిన వందలాది మంది మద్యం ప్రియులు వెనుదిరిగి వెళ్లారు. అనేక ప్రాంతాల్లో మద్యం దుకాణాలు తెరుచుకోలేదు. తమకు ఇంకా అధికారిక ఉత్తర్వులు అందలేదని షాపు యజమానులు మద్యంప్రియలకు వెల్లడిస్తున్నారు.
* హిమాచల్‌లో ప్రదేశ్‌లోని సిమ్లాలో 40 రోజుల తరువాత దుకాణాలు తెరుచుకోవడంతో షాపుల ముందు ప్రజలు ఎద్ద ఎత్తున క్యూకట్టారు. మూడొంతులు సిబ్బందితో ప్రభుత్వ కార్యాలయాలు తెరుచుకున్నాయి. ప్రజా రవాణా మాత్రం మూతపడే ఉంది. శౌరశాలలు, స్పా లు, బార్లు మినహా ఐదు గంటల కర్ఫ్యూ సడలింపు కాలంలో అనేక రకాల దుకాణాలు తెరుచుకునేందుకు హిమాచల్‌ ప్రభుత్వం అనుమతిలిచ్చింది.

DO YOU LIKE THIS ARTICLE?
Prajapaksham
Prajapaksham
Praja Paksham Telugu News (తెలుగు వార్తలు) offers the Latest Telugu News, Breaking News in Telugu (ముఖ్యాంశాలు) from Andhra Pradesh and Telangana. National News, International News Headlines in Telugu Daily. prajapaksham.in is flagship online website of PrajaPaksham Newspaper
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments