యువతను చిత్తు చేస్తున్న గంజాయి
దండకారణ్య సరిహద్దుల్లో వేల ఎకరాల్లో సాగు
తరలిపోతున్నది ఎక్కువ… పట్టుబడుతుంది కొంతే….
ప్రజాపక్షం/ ఖమ్మం బ్యూరో గంజాయి మత్తులో యువత జోగుతోంది. కళాశాలలు, యూనివర్సిటీ విద్యార్థులు 10 నుంచి 15 ఏళ్ల బాలురు, వివిధ వృత్తులలో ఉన్న విద్యావంతులు, కార్మికులు, దారి తప్పిన యువకులు గంజాయి మత్తుకు బానిసలవుతున్నారు. సొంగల ద్వారా పీల్చడంతో పాటు సిగరెట్లు, నమిలేందుకు గంజాయి ఆకును సరఫరా చేస్తున్నారు. ఒక గ్రాము మొదలు రెండు కిలో గ్రాముల వరకు వివిధ బరువుల్లో ప్యాకెట్లను తయారు చేసి విక్రయిస్తున్నారు. ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలో వేల ఎకరాల్లో గం జాయి సాగు అవుతున్నట్లు సమాచారం. పక్వానికి వచ్చిన తర్వాత ఎండబెట్టి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మీదుగా దేశంలోని ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబయి, హైదరాబాద్, బెంగళూరు, కొలకత్తాకు సరఫరా చేస్తున్నారు. గతంలో సాధువులు కొందరితో పాటు వయసు మళ్లిన వారు గంజాయిని పీల్చేవారు. ఇప్పుడు గంజాయి వాడకం యువతలో పెరిగిపోయింది. గతేడాది ఖమ్మం జిల్లాలో గంజాయి మత్తుకు బానిసైన 16 ఏళ్ల బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లాడలో రోజు వారి కూలీ చేసుకునే యువకుడు గంజాయి మత్తులోనే ఉరి వేసుకుని మరణించాడు. గంజాయి తాగి కొందరు జీవితాలను ఛిద్రం చేసుకుంటుంటే మరికొందరు డబ్బుల కోసం గంజాయి రవాణా చేపట్టి జైళ్ల పాలవుతున్నారు. తెలంగాణ ఛత్తీస్‌గఢ్ సరిహద్దు నుంచి ప్రతి రోజు పెద్ద మొత్తంలో గంజాయి బయటకు వస్తుంది. అతి ఖరీదైన వాహనాల్లో గంజాయిని తరలిస్తున్నారు. పెద్ద సంఖ్యలో వాహనాలు పట్టుబడుతున్నట్లు అనిపిస్తున్నా పోలీసుల కంటపడకుండా తప్పించుకుపోతున్న వాహనాల సంఖ్య ఎక్కువగా ఉందన్న ఆరోపణలు వినవస్తున్నాయి. గంజాయి సాగు, రవాణా, విక్రయాలు విపరీతమైన లాభాలు తెచ్చిపెడుతుంది. గంజాయి రవాణాలో మహారాష్ట్ర ఒడిశా,మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వాహనాలు, వ్యక్తులే ఎక్కువగా పట్టుబడుతున్నారు. గంజాయి రవాణాకు సంబంధించి రూ.20 లక్షల నుంచి రూ.25 లక్షల ఖరీదైన వాహనాలు పట్టుబడుతున్నాయంటే వ్యాపారం ఏ రకం లాభాలు తెచ్చిపెడుతుందో అవగతమవుతుంది. అడవుల్లో వేల ఎకరాల్లో సాగు అవుతున్న గంజాయిని నియంత్రించకుండా ఎన్ని చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినా ఫలితం ఉండదన్న విషయం అధికార యంత్రాంగం తెలుసుకోవాలి. పట్టణాలు, నగరాల్లో గంజాయి వినియోగిస్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా యువత లక్ష్యంగా గంజాయి విక్రయాలు జరుగుతున్నాయి. గంజాయితో చేసిన సిగరేట్లు కూడా విక్రయిస్తున్నారు. పాన్, గుట్కాల కంటే ఇప్పుడు గంజాయి ప్రమాదకరంగా మారింది. అధికార యంత్రాంగం గంజాయిని నియంత్రించక పోతే ఇదో మహమ్మారిలా యువతను పట్టిపీడించే అవకాశం ఉంది. ఇప్పటికైనా గంజాయి మత్తు నుంచి యువతకు విముక్తి కల్పించాలని కోరుతున్నారు.
‘మత్తు’కు విముక్తి ఎప్పుడో?
RELATED ARTICLES