ఆందోళనల్లో భాగస్వాములవుదాం
మేధావుల తీర్మానం
ప్రజాపక్షం / హైదరాబాద్ : దేశంలో నెలకొన్న మతోన్మాద విద్వేషపూరిత విధానాలకు వ్యతిరేకంగా ప్రజలంతా ఐక్యంగా ఉద్యమించాలని రాజ్యాంగ హక్కుల పరిరక్షణ వేదిక (ఆర్‌హెచ్‌పివి) రాష్ట్ర సదస్సు నిర్ణయించింది. సిఎఎ, ఎన్‌పిఆర్, ఎన్‌సిఆర్‌లకు వ్యతిరేకంగా దేశభక్తి కలిగిన ప్రజాస్వామిక, లౌకిక శక్తులు, మేధావులు, రచయితలు, విద్యార్థులు దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తున్నారని, ఆ ఆందోళనల్లో మనం భాగస్వాములు కావాలని, ఐక్య ఉద్యమాలు కొనసాగించాలని సదస్సు తీర్మానించింది. గత 70 రోజులుగా జరుగుతున్న సిఎఎ, ఎన్‌ఆర్‌సి, ఎన్‌పిఆర్ వ్యతిరేక ఆందోళనల్లో పోలీసులు 70 మందికి పైగా అతి క్రూరంగా కాల్చివేశారని వారి కుటుంబాలకు సదస్సు ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలిపింది. ప్రభుత్వం ప్రజలను మత ప్రాతిపదికన విభజించడం ద్వారా పౌరుల జీవితాలను అభద్రతలోకి, భయంలోకి నెట్టివేస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది. ఉద్యమ కార్యాచరణలో భాగంగా భవిష్యత్తులో జిల్లాస్థాయి సదస్సులు జరపాలని, వేదిక నిర్మాణ ఏర్పాట్లు చేసుకోవాలని నిర్ణయించింది. జనవరి 23న సుభాష్ చంద్రబోస్ వర్థంతి సందర్భంగా కార్యక్రమాలు చేపట్టాలని, జనవరి 26న భారత రాజ్యాంగ పరిరక్షణ దినం పాటించాలని, జనవరి 30న గాంధీ వర్ధంతి సందర్భంగా కార్యక్రమాలు చేపట్టాలని, సంక్రాంతి సందర్భంగా నో ఎన్‌ఆర్‌సి, నో సిఎఎ, నో ఎన్‌పిఆర్ రాసి గాలి పటాలు ఎగరవేయాలని తీర్మానించారు. రాజ్యాంగ హక్కుల పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రాష్ట్ర సదస్సు జరిగింది. సిపిఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డి.జి.నరసింహారావు అధ్యక్షతన జరిగిన ఈ సదస్సును మాడభూషి శ్రీధర్ ప్రారంభించారు. ఈ సదస్సులో శాంతా సిన్హా, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి, సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, నేతలు గోవర్దన్ (సిపిఐ ఎంఎల్) ఎన్‌డి, మాజీ ఎపి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కాకి మాధవరావు, డాక్టర్ కెఆర్ వేణుగోపాల్, ఆమెర్ ఖాన్ (సియాసత్ ఉర్దూ దినపత్రిక), రాజేష్ (సిపిఐ ఎంఎల్ లిబరేషన్), ఫర్హతుల్లా ఖాన్ (ఎంబిటి), ప్రసాద్ (సిపిఐ ఎంఎల్), ఎ.జానకీ రాములు (ఆర్‌ఎస్‌పి), పోటు రంగారావు (సిపిఐ ఎంఎల్ ) ఎన్‌డి, విమలక్క (అరుణోదయ సంస్థ), సాయిబాబు (సిఐటియు), ఝాన్సి (ప్రగతిశీల మహిళా సంఘం), మొహమ్మద్ అన్సారి, అభిషేక్ నందన్ (సెంట్రల్ యూనివర్సిటీ) తదితరులు ప్రసంగించారు. ఈ సందర్భంగా మాడభూషి శ్రీధర్ మాట్లాడుతూ భారత రాజ్యాంగంపై ప్రమాణం చేసిన నేతలు ఆ రాజ్యాంగాన్ని ఆచరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో రాజ్యాంగం ఉందా అనే అనుమానం కలుగుతోందన్నారు. రాజ్యాంగ పుస్తకాన్ని బీరువాలో పెడితే రక్షించినట్లు కాదని, దానిని అమలు చేయడమే రక్షించినట్లు అని, రాజ్యాంగాన్ని ప్రజలే రక్షించాలన్నారు. యూనివర్శిటీలను మూసివేయాలంటున్నారని చదువులేకుండా చేస్తే ప్రశ్నించేవారుండరని భావిస్తున్నారని అన్నారు. సిఎఎ, ఎన్‌పిఆర్, ఎన్‌ఆర్‌సికి అనుసంధానం ఉందన్నారు. ఎన్‌ఆర్‌సి వల్ల అసోంలో ఏం జరిగిందో అందరికీ తెలిసిందేనని, ప్రతి ఒక్కరూ భారత పౌరులుగా నిరుపించుకోవాల్సి ఉంటుందన్నారు. మన ఉనికిని, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యా న్ని ప్రశ్నిస్తుంటే మనం దేశ పౌరులమో కామో అనే సందేహం కల్గుతుందన్నారు. డాక్టర్ శాంతా సిన్హా మాట్లాడుతూ రాజ్యాంగ విరుద్ధంగా తెచ్చిన సిఎఎ, ఎన్‌పిఆర్, ఎన్‌ఆర్‌సిను ధిక్కరిద్దామని దీనికి వ్యతిరేకంగా పోరాడుదామన్నారు. భారత పౌరులం కామని నిరూపించుకోవాల్సిన అవసరం లేదన్నారు. దేశంలో ఉన్న వారు దేశ పౌరులేనని, అయితే జాతీయత ఉందనే విషయంలో స్పష్టత ఉండాలన్నారు. హిందూత్వం జాతీయత కాదని, సమానత్వం, ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం, లౌకిక వాదం, సోషలిస్టు, స్వేచ్ఛ ఉండే రాజ్యాంగం ఉండాలనే సైద్ధాంతికతే జాతీయత అని పేర్కొన్నారు. వీటి కోసం పోరాడుతున్న సేదలు, దళితులు, ఆదివాసీలు, సెక్యులర్ శక్తులను దేశ ద్రోహులుగా చిత్రీకరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం అందరం కలిసి పోరాడుదామని, దేశాన్ని, మనలను మనం రక్షించుకుందామని పిలుపునిచ్చారు.