బిజెపి హయాంలో బ్యాంకులు దివాలా
పతనావస్థలో దేశ ఆర్థిక వ్యవస్థ
సిపిఐ జాతీయ కార్యదర్శి అతుల్ కుమార్ అంజాన్
హైదరాబాద్ : దేశంలో మతతత్వ శక్తులను ఎదుర్కోవడంలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ ఘోర వైఫల్యం చెందిందని సిపిఐ జాతీయ కార్యదర్శి అతుల్ కుమార్ అంజాన్ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ సంక్షోభంలో ఉన్నందునే మతతత్వ శక్తులైన బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌లు ఆపరేషన్ లోటస్‌కు తెరలేపాయన్నారు. అందులో భాగమే మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలని వ్యాఖ్యానించారు. సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశం గురువారం మఖ్దూం భవన్‌లో జరిగింది. సత్యం అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సిపిఐ జాతీయ కార్యదర్శులు అతుల్‌కుమార్ అంజాన్, డాక్టర్ కె.నారాయణ, రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యులు సయ్యద్ అజీజ్ పాషా తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలోనూ మతతత్వ శక్తులు ఉన్నాయని విమర్శించారు. బిజెపి ప్రభుత్వ హయాంలో భారత ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దిగజారిందని, జాతీయ బ్యాంకులు దారుణమైన పరిస్థితుల్లో దిగజారుతుంటే ప్రైవేట్ బ్యాంకులు సంక్షోభంలో ఉన్నాయని, అందులో డబ్బులు దాచుకున్న సామాన్య ప్రజలు నష్టపోతున్నారని అతుల్‌కుమార్ అంజాన్ అన్నారు. కేంద్రప్రభుత్వ నిర్ణయాల వల్ల భారత ఆర్థిక వ్యవస్థ విచ్ఛిన్నమవుతోందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ శక్తులకు కేంద్రం అప్పగిస్తుంటే.. ఆ శక్తులు ప్రజలను దోచుకుంటున్నాయని ఆరోపించారు. ఇప్పటికే రైల్వేలో రెండు ప్రైవేటు రైళ్లను ప్రవేశపెట్టగా మరో 150 ప్రైవేట్ రైళ్లను నడిపేందుకు సన్నాహాలు జరుగుతున్నాయన్నారు. ఢిల్లీ- మధ్య రూ.435 స్లీపర్ క్లాస్, రూ. 700 ఉన్న ఎసి స్లీపర్ ఛార్జీలు ప్రైవేట్ రైళ్లలో రూ.1800 వసూలు చేస్తున్నారన్నారు. ఎయిర్‌లైన్స్‌లోనూ అదే పరిస్థితి ఉందని, ప్రైవేటు ఎయిర్‌లైన్స్‌లో నాలుగు రెట్లు ఛార్జీలు పెంచేశారని తెలిపారు. బిజెపి ప్రభుత్వం కొత్త తరహా అవినీతికి తెరలేపిందన్నారు. రైల్వేలో 35 స్టేషన్లను ప్రైవేటు కంపెనీలకు అప్పజెప్పారని, మరో 63 స్టేషన్లు అప్పగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం రిజర్వు బ్యాంకు నుంచి తీసుకున్న రూ. లక్షా 70 వేల కోట్లను తిరిగి ఎలా చెల్లిస్తారో బడ్జెట్‌లో పేర్కొనలేదన్నారు. పది నెలల కాలంలో ముగ్గురు ఆర్‌బిఐ గవర్నర్లు రాజీనామా చేశారన్నారు. లాభాల్లో ఉన్న బ్యాంకులను ఎస్‌బిఐలో విలీనం చేశారని, ఇప్పుడు ఎస్‌బిఐ నష్టాల్లో ఉందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థ ఎల్‌ఐసిని విచ్ఛిన్నం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. మతోన్మాద శక్తులను ఓడించేందుకు ప్రతిపక్ష కాంగ్రెస్ పోరాడాలన్నారు. లోకసభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ బిజెపి నాయకులుగా పనిచేస్తున్నారని దుయ్యబట్టారు. ఢిల్లీ అల్లర్లపై సమగ్ర విచారణ జరిపించాలని, పోలీసు ఉన్నతాధికారులను తప్పించాలని డిమాండ్ చేశారు. నారాయణ మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం దేశాన్ని కార్పొరేట్ శక్తులకు అమ్మేస్తోందని తీవ్రస్థాయిలో విమర్శించారు. బిజెపి అనుకూల సైన్యం రుణాలు తీసుకొని ఎగ్గొట్టడం వల్లే యెస్ బ్యాంకు దివాలా తీసిందన్నారు. ఢిల్లీ అల్లర్లు అమిత్ షా మాఫియా గ్యాంగ్ పనేనని నిరూపించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మధ్యప్రదేశ్ పరిణామాలు చూస్తుంటే బిజెపికి రెడ్‌లైట్ ఏరియాకు తేడా లేకుండా పోయిందన్నారు. కెసిఆర్ రేవంత్‌రెడ్డిపై కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. స్థానిక ఎన్నికల్లో నామినేషన్లు వేయకుండా ఎపి సిఎం జగన్ అడ్డుకుంటున్నాడని ఆరోపించారు. తండ్రి మరణానికి కారణమైన రిలయన్స్ ప్రతినిధికి రాజ్యసభ టిక్కెట్ ఇచ్చిన జగన్.. తండ్రికి ద్రోహం చేసిన ముద్దాయిలా మిగిలిపోతాడన్నారు.
ప్రత్యక్ష పోరాటాలకు సన్నాహాలు : చాడ
రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా సమస్యలపై పెద్ద ఎత్తున పోరాట కార్యక్రమాలు చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి చెప్పారు. రాష్ట్రంలో ఫామ్ హౌస్ రాజకీయాలు జరుగుతున్నాయని, ప్రశ్నించే వారిని ప్రభుత్వం టార్కెట్ చేసి అరెస్టులు చేస్తోందన్నారు. రేవంత్‌రెడ్డి అరెస్టు అందులో భాగమేనన్నారు. రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల్లో చెరువులు, కుంటలు, వక్ఫ్, దేవాదాయ భూములు ఆక్రమణలకు గురయ్యాయన్నారు. వ్యవసాయ, రైతు సమస్యలపై భూ ఆక్రమణలపై సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో చర్చించినట్లు తెలిపారు. వీటిపై ప్రత్యక్ష పోరాటాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ భూ అమ్మకాల యత్నాలను అడ్డ్దుకుంటామన్నారు. మద్యానికి వ్యతిరేకంగా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో చేపట్టే పోరాటాలకు, ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతి కోసం ఎఐవైఎఫ్ ఆధ్వర్యంలో చేపట్టే ప్రత్యక్ష ఆందోళనలకు సిపిఐ సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. సిఎఎ, ఎన్‌ఆర్‌సి, ఎన్‌పిఆర్‌లకు వ్యతిరేకంగా కేంద్ర ప్రజా వ్యతిరేక బడ్జెట్‌ను వ్యతిరేకిస్తూ ఆందోళనా కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ఈ విషయంపై వామపక్ష పార్టీల సమావేశంలో చర్చించి ఉద్యమ కార్యాచరణను నిర్ణయిస్తామన్నారు.
మతోన్మాదాన్ని ఎదుర్కోవడంలో కాంగ్రెస్ వైఫల్యం
RELATED ARTICLES