సిపిఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి
హిందీ బెల్ట్‌లోనే ప్రధానంగా మతచిచ్చు
కన్నూర్ : హిందుత్వ మతోన్మాద అజెండాపై అన్ని స్థాయిల్లో పోరాటం చేయడమే ప్రధానలక్ష్యమని సిపిఐ(ఎం) ప్రకటించింది. కేరళలోని కన్నూర్‌లో ఈనెల 6వ తేదీ నుండి 10వ తేదీ వరకూ సిపిఐ(ఎం) 23వ జాతీయ పార్టీ కాంగ్రెస్ జరిగింది. వర్తమాన రాజకీయ, సంస్థాగత కార్యకలాపాలను మహాసభ క్షుణ్ణంగా చర్చించి చేసిన రాజకీయ తీర్మానాల సారాంశాన్ని సిపిఐ(ఎం) జాతీయ ప్రధానకార్యదర్శి సీతారాం ఏచూరి సోమవారంనాడు కన్నూర్‌లో మీడియాకు వివరించారు. మతపరమైన విభజన తీసుకువచ్చేందుకు హిందుత్వ ఎజెండా చేసే ప్రతి ప్రయత్నాన్నీ అన్ని స్థాయిల్లో ప్రతిఘటించాలని పార్టీ జాతీయ మహాసభ తీర్మానం చేసినట్లు తెలియజేశారు. హిందుత్వ ఎజెండాలోని మతపరమైన విభజనను ప్రత్యేకించి హిందీ భాష మాట్లాడే రాష్ట్రాలలో ఎక్కువగా ఉన్న ఈ ప్రమాదాన్ని ప్రధాన సవాలుగా స్వీకరించి మార్కిస్టుపార్టీ ప్రతిఘటిస్తుందని ఆయన చెప్పారు. దీంతోపాటు ఈశాన్య రాష్ట్రాల్లో, ఈశాన్య ప్రాంతంలో శరవేగంగా,ప్రమాదకరస్థాయిలో పెరుగుతున్న మతోన్మాదం,మతవాద పాచికను ప్రస్తుతం అసోంలో కూడా బిజెపి ఉపయోగిస్తోందని ఆయన అన్నారు. ఇలాటి ప్రమాదకరమైన చర్యలవల్ల భవిష్యత్‌లో దేశంలో తీవ్ర పరిణామాలు, పర్యవసానాలు ఏర్పడతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే మార్కిస్టు పార్టీ జాతీయ మహాసభలో హిందుత్వ మతోన్మాద ఎజెండాపై పోరాటం చేయడమే ప్రధాన లక్ష్యంగా తీర్మానం చేశామని అన్నారు. రాజకీయంగా, సైద్ధాంతికంగా, సామాజికంగా, సాంస్కృతికంగా, సంస్థాగతంగా మతోన్మాద హిందుత్వ ఎజెండాను అన్ని స్థాయిల్లోనూ ప్రతిఘటిస్తామని సీతారాం ఏచూరి చెప్పారు. ‘హిందీభాష మాట్లాడే రాష్ట్రాలలో మతోన్మాద వ్యతిరేక ప్రచారానికి సిపిఐ(ఎం) ప్రత్యేక ప్రణాళికా కార్యక్రమాన్ని ఏదైనా రూపొందించిందా?’ అని విలేకరులు ప్రశ్నించగా, ఆయా హిందీ రాష్ట్రాలకు సంబంధించిన పార్టీ రాష్ట్ర శాఖల కార్యదర్శులతో త్వరలో ఒక సమావేశం నిర్వహించి మహాసభ తీర్మానాలకు అనుగుణంగా తగిన కార్యక్రమాన్ని రూపొందిస్తామని చెప్పారు. పార్టీ సంస్థాగత నివేదికకు అనుగుణంగానే పోరాట కార్యక్రమాలను రూపొందిస్తామని చెప్పారు. హిందుత్వ ఎజెండాను నేరుగా ప్రతిఘటిస్తాం, ‘పొగరుబోతు గిత్తను కొమ్ములు పట్టుకుని మరీ వంగదీస్తాం’ అని ఆయన అన్నారు. దేశంలో ప్రధాన సమస్యలను బిజెపి పక్కదోవ పట్టిస్తోందని, ప్రజల పోరాటాలకు విలువ ఇవ్వడం లేదని, మతోన్మాదం, మతపరమైన విభజనలను ముందుకు తెచ్చి వాటిని మరుగుపరుస్తోందని సీతారాం ఏచూరి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాసమస్యలేవీ జాతీయ ప్రధాన స్రవంతిలో చర్చకు రావడం లేదన్నారు. జాతీయ ప్రధాన స్రవంతిలో మతోన్మాద చర్యలకే భారీ ప్రచారం వస్తోందని, ప్రజల సమస్యలను మరుగుపరుస్తున్నారని, ఇలాంటి చర్యలను బద్దలుకొడతామని అన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున ఆయన విమర్శల దాడిచేస్తూ, ‘ప్రధానమంత్రి ఈరోజున హిజాబ్ వస్త్రధారణ లేకపోతే హలాల్ లేదా అజాన్ వంటి విషయాల గురించి మాట్లాడటానికే తన సమయాన్ని ముందుగా నిర్దే శించుకున్నారు, ఈ సమస్యలే ఆయనకు చాలా ముఖ్యంగా కనిపిస్తున్నాయితప్ప దేశంలో రోజురోజుకూ పెరిగిపోతున్న నిరుద్యోగం ఆయన కళ్ళకు కనిపించడంలేదు, రోజురోజుకూ దేశంలో పెరుగుతున్న యువకులు,రైతుల ఆత్మహత్యల సంఖ్య ఆయనకు ముఖ్యంగా కనిపించడంలేదు,దేశంలో పెరుగుతున్న దారిద్య్రంగానీ, రోజువారీ ప్రాతిపదికపై పెరుగుతున్న పెట్రోలు,డీజిలు,నిత్యావసర వస్తుల ధరల పెరుగుదల ఆయన కళ్ళకు కనిపించడంలేదు, అవన్నీ ఆయనకు ముఖ్యమైన విషయాలుగా కనిపించడంలేదు’ అని సీతారాం ఏచూరి విమర్శించారు. ‘అందువల్ల ఈ పరిస్థితుల్ని తారుమారు చేసి, ప్రజల సమస్యలను ప్రధాన స్రవంతిలోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది, మతోన్మాద,మత విభజనవాదాంశాలను అప్రాధాన్యాంశాలుగా వెనక్కు నెట్టాల్సిన అవసరం ఉంది, అదే మా ప్రధానమైన సవాలు’ అని ఆయన అన్నారు. కేరళ ముఖ్యమంత్రి కలలను సాకారం చేసుకోవాలనుకుంటున్న మేజర్ సిల్వర్ లైన్ కారిడార్ ప్రాజెక్టు నిర్మాణానికి సిపిఐ(ఎం) నాయకత్వం వ్యతిరేకంగా ఉందన్న మీడియా వార్తలను సీతారాం ఏచూరి తోసిపుచ్చారు. రాష్ట్రాభివృద్ధికి ఈ సెమీ హై స్పీడ్ రైల్వే నెట్‌వర్క్ అత్యవసరమని అన్నారు. ఇఎంఎస్ నంబూద్రిపాద్ ముఖ్యమంత్రిగా ఉన్నకాలంనుండి కేరళ రాష్ట్రాన్ని ఆదర్శంగా అభివృద్ధిచేసే ప్రక్రియ కొనసాగుతోందన్నారు. ముంబయి బుల్లెట్ ట్రైన్‌తో ఈ హైస్పీడ్ రైల్ ప్రాజెక్టును పోల్చవద్దని ఆయన అన్నారు.
మతోన్మాదమే ప్రధాన సవాలు
RELATED ARTICLES