కళాకారులు, రచయితలు రంగంలోకి దిగాలి
“నేను నడిచిన బాట” పుస్తక పరిచయ కార్యక్రమంలో సురవరం సుధాకర్‌రెడ్డి
ప్రజాపక్షం/హైదరాబాద్ భారతదేశంలో రాజ్యమేలుతున్న మతోన్మాదం, మూఢ విశ్వాసాలను పక్కన పెట్టేందుకు మళ్లీ ప్రజా పోరాటాలు అవసరమని, ఇందుకు వెన్నుదన్నుగా నిలిచేందుకు కళాకారులు, రచయితలు రంగంలోనికి దిగాల్సిన అవసరముందని సిపిఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి అన్నారు. ప్రజాస్వామ్య ముసుగులో ఫ్యాసిజం దేశంలో విధ్వంసాన్ని సృష్టిస్తోందని, దేశంలో పౌర,మానవ హక్కులు కాలరాసే పరిస్థితులు నెలకొన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో మళ్లీ ప్రజా సంఘాలు, కవులు, కళాకారులు తమ పాత్రను నిర్వహించాలని, నియంతృత్వానికి,ఫ్యాసిజానికి వ్యతిరేకంగా ప్రజ ల్లో చైతన్యం పెంపొందించాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రజా నాట్య మండలి, కమ్యూనిస్టు పార్టీ నాయకులు నల్లూరి వెంకటేశ్వర్లు రాసిన “నేను నడిచిన బాట” పుస్తక పరిచయ కార్యక్రమం హైదరాబాద్‌లోని మఖ్దూంభవన్‌లో ఆదివారం జరిగింది. ఈ పుస్తకాన్ని తెలుగు విశ్వవిద్యాలయ మాజీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎస్.వి.సత్యనారాయణ పరిచయం చేశారు. ఈ కార్యక్రమానికి సినీ హిరో, దర్శక నిర్మాత మాదాల రవి సభాధ్యక్షత వహించగా… సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎంపి సయ్యద్ అజీజ్ పాషా, రాష్ట్ర ఇన్‌చార్జ్ కార్యదర్శి పల్లా వెంకట్ రెడ్డి, సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, ఎమ్మెల్సీ, ప్రముఖ ప్రజా వాగ్గేయకారుడు గోరటి వెంకన్న, ఇఫ్టా జాతీయ ఉపాధ్యక్షుడు కందిమళ్ల ప్రతాప్‌రెడ్డి, ఎఐటియసి జాతీయ కార్యదర్శి డాక్టర్ బి.వి విజయలక్ష్మి, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పశ్యపద్మ, ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షుడు, “ప్రజాపక్షం” సంపాదకులు కె.శ్రీనివాస్‌రెడ్డి, ఎఐకెఎస్ జాతీయ అధ్యక్షుడు రావుల వెంకయ్య, సిపిఐ ఎపి రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, ఎమ్మెల్సీ పి.జె.చంద్రశేఖర్ రావు, ప్రముఖ సినీ నిర్మాత పోకూరి బాబూరావు, సినీ దర్శకలు భీమినేని శ్రీనివాస రావు, ప్రముఖ సినీ సంగీత దర్శకులు వందేమాతరం శ్రీనివాస్, సినీ దర్శకులు మదినేని రమేష్, బాబ్జీ, ఇఫ్టా సీనియర్ నాయకులు రాజేశ్వర్ రావు, తెలంగాణ ప్రజా నాట్య మండలి ప్రధాన కార్యదర్శి పల్లె నర్సింహ, నాయకులు లక్ష్మీనారాయణ, ఉప్పలయ్య తదితరులు హాజరయ్యారు. సురవరం సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ సమాజంలో జరిగిన అనేక మార్పులు, పార్టీ, యువజన, ప్రజా నాట్యమండలికి సంబంధించిన అనేక విలువలైన సమాచారాన్ని ‘నేను నడిచిన బాట’ లో పొందుపరిచారని కొనియాడారు. నల్లూరి వెంకటేశ్వర్ల ‘ఆత్మచరిత్ర’ చేదు అనుభవాలను, కొన్ని ఇబ్బందులను మిన హాయించి, మంచి విషయాలను మాత్రమే రాశారని, ఇతరులను నొప్పించడం నల్లూరి వ్యక్తిత్వం కాదని అన్నారు. నల్లూరి జీవిత చరిత్రలోని అనేక అంశాలను యువతరం చదివి తెలుసుకోవాలని, తద్వారా ఆ స్ఫూర్తిని పొందుతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతి జర్నలిస్టు కూడా తమ జీవిత చర్రితను రాయాలని, తద్వారా ఆ చరిత్రలో వారి వారి అనుభవాలు నేటి యువతరానికి స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు. ప్రజానాట్య మండలి, యువజన విభాగానికి నల్లూరి వెంకటేశ్వర్లు, కందిమళ్ల ప్రతాపరెడ్డి రెండు కళ్ల లాంటి వారని కొనియాడారు. వారు యువతరానికి స్ఫూర్తిగా మిగిలారని, ప్రజానాట్య మండలిని పునరుద్ధరించేందుకు శాయశక్తులా కృషి చేశారని గుర్తు చేశారు. ప్రజానాట్య మండలి దేశంలో అనేక మంది అద్భుతమైన కళాకారులు, అలాగే తెలంగాణసాయుధ పోరాట కాలంలో కూడా కళాకారులను తయారు చేసిందన్నారు. సమాజంలో కవులు, కళాకారుల ప్రభావం చూపిందన్నారు. ఎన్నికల్లో గెలుపు, ఓటమి అనేది పక్కన పెడితే ముందుగా సమాజాన్ని మార్చాలన్న పట్టుదల, ప్రజల్లో చైతన్యం కల్పించడంలో ప్రజానాట్య మండలి పెద్ద పాత్రను పోషించిందన్నారు. సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిస్తుందని, కవిత్వం, పత్రికల పాత్ర ఎంతో ఉంటుందన్నారు. సమాజంలోని ఫ్యూడలిజానికి, వలస వాదనానికి, నాటి నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ప్రజానాట్య మండలి తన నాటకాలు, బుర్రకథల ద్వారా ప్రజలను రంగంలోకి దించేందుకు అద్భుతమైన పాత్రను పోషించిందని, ఇందుకు అన్ని వర్గాల ప్రజలనూ ఆకట్టుకున్నదని తెలిపారు. నాటి ‘మా భూమి’ నాటకానికి పెద్ద స్పందన లభించిందన్నారు. నాడు నాజర్ బుర్రకథను వీక్షించేందుకు ఎన్‌టిఆర్ ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామానికి వెళ్లారని, బుర్ర కథలు గొప్ప కళాకారులను కూడా ప్రభావితం చేశాయని అన్నారు. దోపిడీ, దారిద్య్రం, అణచివేత ఉన్నంత కాలం వామపక్ష ఉద్యమాలు ఉంటాయని, పునర్జీవిస్తాయన్నారు. ప్రపంచ వ్యాపితంగా 1990 సంవత్సరాల తర్వాత సోషలిస్టు దేశాలు కనుమరగయ్యాయని, సోషలిజానికి భవిష్యత్ లేదని వాదించారని, కానీ ఇటీవల యూరపియన్ దేశాలు,లాటిన్ అమెరికా, కొత్త కొత్త దేశాల్లో మళ్లీ వామపక్షలు ఎన్నికల ద్వారా అధికారంలోనికి వస్తున్నాయని, అమెరికా లాంటి దేశానికి సవాలు విసురుతున్నాయని సురవరం సుధాకర్ రెడ్డి తెలిపారు. మాదాల రవి మాట్లాడుతూ నల్లూరి వెంకటేశ్వర్లు ఒక వ్యక్తి కాదని, ఒక ఉద్యమం అని అన్నారు. ప్రజానాట్య మండలి, కమ్యూనిస్టు నాయకునిగా ఆయన అనేక సేవలను అందించారన్నారు. నల్లూరిలో ప్రజలను చైతన్యవంతం చేయాలనే తపన ఉంటుందని అన్నారు. ప్రొఫెసర్ ఎస్వీ సత్యనారాయణ మాట్లాడుతూ “నేను నడిచిన బాట”ఒక కమ్యూనిస్టు ఆత్మ కథ అని, నిబద్దత కలిగిన విప్లవాకారుని స్వీయ చర్రిత అని కొనియాడారు
మతోన్మాదం, మూఢ విశ్వాసాలను పారదోలేందుకు ప్రజా పోరాటాలు అవసరం
RELATED ARTICLES