HomeNewsBreaking Newsమణిపూర్‌ సంక్షోభంపై విచారణ కమిషన్‌

మణిపూర్‌ సంక్షోభంపై విచారణ కమిషన్‌

రాష్ట్రపతిని కలిసిన కాంగ్రెస్‌ బృందం డిమాండ్‌
ప్రజారక్షణ,శాంతిస్థాపనలో సుస్థిర చర్యలకు
తక్షణం జోక్యం చేసుకోండి
ముర్ముకు వినతిపత్రం
న్యూఢిల్లీ :
మణిపూర్‌లో నెలకొన్న హింస, సంక్షోభ పరిస్థితులను వివరించేందుకు కాంగ్రెస్‌పార్టీ ప్రతినిధి బృందం మంగళవారం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును కలిసింది. ఈ విషయంలో తక్షణం జోక్యం చేసుకోవాలని కాంగ్రెస్‌ ప్రతినిధుల బృందం రాష్ట్రపతికి విజ్ఞప్తి చేసింది. మణిపూర్‌లో హింసాత్మక వాతావరణం నెలకున్నదని, అక్కడి పరిస్థితులు అదుపు తప్పాయని పేర్కొంటూ ఒక వినతిపత్రం సమర్పించింది. పదవీ విరమణ చేసిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి సారథ్యంలో ఒక ఉన్నతస్థాయీ విచారణ కమిషన్‌ ఏర్పాటుచేసి ఈ మొత్తం ఘటనలపై
దర్యాప్తు జరిపించాలని కాంగ్రెస్‌పార్టీ అగ్రనేత బృందం రాష్ట్రపతిని డిమాండ్‌ చేసింది. కాంగ్రెస్‌పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నాయకత్వంలో ప్రతినిధిబృందం ఈ మేరకు రాష్ట్రపతిని కలిసి ఒక మెమొరాండం సమర్పించింది. 12 అంశాలతో కూడిన డిమాండ్లను కాంగ్రెస్‌పార్టీ వినతిపత్రంలో రాష్ట్రపతికి వివరించింది. బాధిత ప్రజలకు తక్షణ సహాయం లభించేలా చర్యలు తీసుకోవాలని, ఈశాన్య రాష్ట్రాలలో, మణిపూర్‌లో వెంటనే శాంతిస్థాపనకు, సాధారణ పరిస్థితుల పునరుద్ధరణకు యుద్ధప్రాతిపదికపై చర్యలు చేపట్టాల్సి ఉందని కోరింది. అసలు ఈ సమస్యలో ఆరంభంనుండి మణిపూర్‌లో చాలా తప్పిదాలు జరిగాయని, హింసను అదుపు చేయడంలో, నిర్వహణా చర్యలు చేపట్టడంతో అనేక లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని కాంగ్రెస్‌బృందం రాష్ట్రపతి దృష్టికి తీసుకువచ్చింది. మొదటినుండి బిజెపి పాలనలో జరిగిన తప్పిదాల కారణంగానే ఈనాడు ఈ పరిస్థితి తలెత్తిందని, వెంటనే వీటిని సరిదిద్దవలసిన అవసరం ఉందని పేర్కొంది. “మొదట్లోనే హింసను అరికట్టడంతో చాలా లోపాలు జరిగాయి, అందువల్లనే ప్రస్తుతం ఇంతటి సంఘర్షణ చెలరేగింది, అయితే ఇప్పుడు ఇది వేలెత్తి చూపించే సమయం కాదు, వెంటనే చర్యలు తీసుకోవాలి, మేం మా మెమొరాండంలో కొన్ని సూచనలు చేశాం, వాటిని తక్షణం అమలు చేయండి, చిత్తశుద్ధితో ఆ సూచనలు అమలుచేసేత శాంతి పునరుద్ధరణ జరుగుతుంది, కాంగ్రెస్‌పార్టీ దేశంలో ఒక బాధ్యతాయుతమైన రాజకీయపార్టీ, అందుకే మేం సలహాలు, సూచనలు చేశాం, శాంతి పునరుంకోసం ఎలాంటి సహాయ స అందిస్తాం, మణిపూర్‌లో సాధారణ పరిస్థితులు తిరిగి ఏర్పడవలసిన అవసరం ఉంది, తిరిగి ప్రజలమధ్య సామరస్యం మొలకెత్తాలి” అని కాంగ్రెస్‌పార్టీ తన మెమొరాండంలో రాష్ట్రపతికి విన్నవించినట్లు మల్లికార్జున ఖర్గే తెలియజేశారు.‘రాజ్యాంగంలో ఉన్న ప్రస్తుత నిబంధనలకు అనుగుణంగా వాటిని తూ చా తప్పకుండా అమలు చేసి మణిపూర్‌ ప్రజలకు రక్షణ ఇవ్వాలని ఖర్గే కోరారు. “ఒక ఉన్నతస్థాయీ విచారణా కమిషన్‌ ఏర్పాటు చేసి సమగ్ర దర్యాప్తు జరపాలని కోరాం, సుప్రీంకోర్టు రిటైర్డ్‌ న్యాయమూర్తి కమిషన్‌కు నాయకత్వం వహించి దర్యాప్తు జరపాలని కోరాం” అని ఖర్గే చెప్పారు. హింసను అదుపు చేయడానికి ప్రభుత్వం పటిష్టమైన సుస్థిరమైన చర్యలు తీసుకోవాలని కూడా రాష్ట్రపతికి విజ్ఞప్తి చేశామన్నారు. అన్ని ఉగ్రవాద గ్రూపులను అదుపు చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరామని చెప్పారు. సాయుధులైన పౌర గ్రూపులను తక్షణం అదుపు చేయాలని ఖర్గే డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణం సహాయ శిబిరాల నిర్వహణా బాధ్యతలు చేపట్టాలి, శిబిరాలలో ఉన్న బాధితులకు సరైన ఆహారం, వైద్య సదుపాయాలు సమకూర్చాలి, శిబిరాల్లో తలదాచుకున్న బాధిత ప్రజలకు తగినవిధంగా శానిటేషన్‌ సదుపాయాలు సమకూర్చాలని కోరామని ఖర్గే అన్నారు. రాష్ట్రపతిని కలిసిన కాంగ్రెస్‌ ప్రతినిధి బృందంలో ఖర్గేతోపాటు మాజీ ముఖ్యమంత్రి ఇబోబి సింగ్‌, కాంగ్రెస్‌ నాయకుడు ముకుల్‌వాస్నిక్‌, మాజీ ఉపముఖ్యమంత్రి గైఖాంగమ్‌, మణిపూర్‌ ప్రదేశ్‌ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు కైషామ్‌ మెఘాచంద్రసింగ్‌, ఎఐసిసిలో మణిపూర్‌ ఇన్‌చార్జ్‌ భక్త్‌ చరణ్‌ దాస్‌ ఉన్నారు.
బిజెపి దుష్ట తలంపు వల్లే ఇదంతా..
అనంతరం కాంగ్రెస్‌పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్‌ రమేశ్‌ పత్రికాగోష్టిలో మాట్లాడుతూ, ప్రజలను విభజించి రాజకీయ ప్రయోజనాలు పొందాలనే బిజెపి ఆలోచన కారణంగానే మణిపూర్‌లో ప్రస్తుత పరిస్థితి తలెత్తిందని విమర్శించారు. ఈ మొత్తం హింసాకాండకు బిజెపియే పూర్తి బాధ్యత వహించాలని ఆయన డిమాండ్‌ చేశారు. “ఈ విషయంలో గూఢచారి వ్యవస్థ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది, పరిపాలనాపరమైన వైఫల్యం కనిపిస్తోంది, మణిపూర్‌లో బిజెపి ప్రభుత్వ వైఫల్యం, రాజకీయ వైఫల్యం స్పష్టంగా గోచరిస్తున్నాయి, బిజెపి అనుసరించిన ఉద్దేశపూర్వక, స్వప్రయోజన చర్యలే దీనికి కారణం, కేంద్ర ప్రభుత్వం, మణిపూర్‌లో ప్రభుత్వం కూడా చిత్తశుద్ధి లేకుండా ప్రవర్తించాయి, సమస్య పరిష్కరించాలనే ఉద్దేశం వారికి లేదు గడచిన 22 ఏళ్ళలో ఈ విధంగా హింసాకాండ చెలరేగడం ఇది రెండోసారి, మణిపూర్‌ 2001 జూన్‌లో ఒకసారి ఇదేవిధంగా హింసతో అట్టుడికిపోయింది, ఆనాడు అటల్‌ బిహారీ వాజ్‌పాయ్‌ ప్రధానమంత్రిగా ఉన్నారు, ఈనాడు 2023లో నరేంద్రమోడీ ప్రధానమంత్రిగా ఉండగా ఈ విధంగా భయంకరమైన హింస చెలరేగింది, ఇదంతా బిజెపి అనుసరిస్తున్న రాజకీయాలూ, వారి సైద్ధాంతికపరమైన విధానాలే కారణం” అని జైరామ్‌ రమేశ్‌ ధ్వజమెత్తారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments