HomeNewsBreaking Newsమణిపూర్‌ అంశంపైఅట్టుడికిన పార్లమెంట్‌

మణిపూర్‌ అంశంపైఅట్టుడికిన పార్లమెంట్‌

ఈశాన్య రాష్ట్రం మండుతోందంటూ ప్రతిపక్షాల నినాదాలు
సభా కార్యకలాపాలు లేకుండానే తొలిరోజు సభలు వాయిదా

న్యూఢిల్లీ : పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన తొలిరోజే మణిపూర్‌ అంశం ఉభయసభలను కుదిపివేసింది. ప్రతిపక్ష సభ్యుల ఆందోళనలతో పార్లమెంట్‌ అట్టుడికింది. మణిపూర్‌లో నెలకొన్న పరిస్థితులపై చర్చించాల్సిందేనని సభ్యులు పట్టుబట్టారు. దీంతో సభలను రెండుసార్లు స్వల్ప వ్యవధిపాటు వాయిదా వేసినప్పటికీ పరిస్థితుల్లో ఏ మార్పు కనిపించకపోవడంతో ఉభయసభలను శుక్రవారం నాటికి వాయిదా వేశారు. కాగా, ఉదయం రాజ్యసభ ప్రారంభం కాగనే మణిపూర్‌ అంశంపై చర్చించాలని విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. దీంతోసభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. అనంతరం సభ తిరిగి ప్రారంభం కాగా రాజ్యసభ చైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖర్‌ సభ కార్యక్రమాలకు సంబంధించిన జాబితాను పెట్టించారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేయడం మొదలు పెట్టారు. సభ్యుల నినాదాల మధ్యే సినిమాటోగ్రఫీ (సవరణ) బిల్లును సభలో ప్రవేశపెట్టగా, ముజువాణి ఓటుతో బిల్లు ఆమోదం పొందింది. అనంతరం సభ శుక్రవారానికి వాయిదా పడింది. అంతకు ముందు రాజ్యసభలో ప్రతిపక్షనేత మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ ఉదయం నుంచి తాము మణిపూర్‌ అంశంపై చర్చించాలని డిమాండ్‌ చేస్తున్నామని, ముందుగానే నోటీసు ఇచ్చినప్పటికీ చర్చకు అనుమతించడం లేదని మండిపడ్డారు. మణిపూర్‌ మండుతున్నా, మహిళలకు అత్యాచారాలకు గురవుతున్నా, వారిని నగ్నంగా ఊరేగిస్తున్నా ప్రధాని మౌనంగా ముంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్‌ వెలుపల ఓ చిన్నపాటి ప్రకటన మాత్రమే చేశారన్నారు. కొంత మంది సభ్యులు ‘మణిపూర్‌’, ‘మణిపూర్‌’ అంటూ తీవ్ర నినాదాలు చేస్తుండంతో సభలో హుందాగా వ్యవహరించాలని ధన్‌ఖర్‌ సూచించారు. దీంతో సభను మరుసటి రోజుకు వాయిదా వేశారు. అంతకు ముందు మధ్యాహ్నం 12 గంటలకు సభ ప్రారంభమైన వెంటనే రూల్‌ 267 కింద స్వల్పకాలిక చర్చ కోసం సభ్యులు ఇచ్చిన 8 నోటీసులను ధన్‌ఖర్‌ ఆమోదించారు. సభా నాయకుడు పీయుష్‌ గోయల్‌ మాట్లాడుతూ ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదని, చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. మణిపూర్‌పై లుఘు చర్చకు సభ్యులిచ్చిన నోటీసులకు చైర్మన్‌ అనుమతిచ్చిన వెంటనే ఖర్గే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ముందుగా సభా కార్యకలాపాలను రద్దు చేయాలని, 267 కింద తామిచ్చిన నోటీసులపై చర్చించాలని పట్టుబడ్డారు. ప్రధాని ప్రకటన చేయాలని, అనంతరం చర్చించాలని చైర్మన్‌కు విజ్ఞప్తి చేశారు. డేరెక్‌ ఓబ్రెయిన్‌ (టిఎంసి) మాట్లాడుతూ రూల్‌ 267 కింద మణిపూర్‌ పరిస్థితులపై చర్చ చేపట్టాలన్నారు. ఈ అంశంపై సభలో ప్రధాని మౌనం వీడాలన్నారు. పాయింట్‌
ఆఫ్‌ ఆర్డర్‌ను లేవనెత్తుతూ రూల్‌ 267ను అమలు చేయాలని, ముందుగా తమ నోటీసులపై చేపట్టాలన్నారు.
లోక్‌సభలోనూ ఇదే పరిస్థితి
మరోవైపు లోక్‌సభలోనూ ఇదే పరిస్థితి కనిపించింది. మధ్యాహ్నం 2 గంటలకు సభ తిరిగి ప్రారంభం కాగానే.. ’మణిపుర్‌, -మణిపుర్‌, మణిపుర్‌- కాలిపోతోంది’ అంటూ ప్రతిపక్ష పార్టీలు నినాదాలు చేశాయి. స్పీకర్‌ ఎంత చెప్పినా సభ్యులు శాంతించకపోవడంతో సభను శుక్రవారాని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి మాట్లాడుతూ.. మణిపుర్‌ అంశంపై ఇరు సభల్లో చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందనే విషయం స్పష్టం చేసిందన్నారు. చర్చలు ప్రారంభమైన తర్వాత దీనిపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా పూర్తి వివరణ ఇస్తారని అన్నారు. ఈ చర్చకు సంబంధించిన సమయాన్ని స్పీకర్‌ నిర్ణయిస్తారని ప్రహ్లాద్‌ జోషి వెల్లడించారు. పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు గురువారం ప్రారంభం కాగా.. ఉదయం 11 గంటలకు ఉభయ సభలు సమావేశమయ్యాయి. ఇటీవల మృతిచెందిన సభ్యులకు సంతాపం ప్రకటించాయి. అనంతరం మధ్యాహ్నానికి వాయిదా వేశారు. మధ్యాహ్నం 12 గంటలకు తిరిగి మొదలవ్వగా.. మణిపూర్‌ అంశంపై చర్చించాలని విపక్షాలు పట్టుబట్టాయి. దీంతో మళ్లీ రెండు గంటలకు వాయిదా పడ్డాయి. తిరిగి ప్రారంభమైనప్పటికీ.. మణిపూర్‌ అంశంపై ప్రతిపక్ష పార్టీలు వెనక్కి తగ్గకపోవడంతో రెండు సభలూ శుక్రవారానికి వాయిదా పడ్డాయి.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments