HomeNewsLatest Newsమణిపూర్‌లో రాష్ట్రపతి పాలన

మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన

కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్‌ విడుదల

న్యూఢిలీ : హింసాత్మక ఘటనలతో కల్లోలం కొనసాగుతున్న మణిపూర్‌ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి పాలన విధించింది. ముఖ్యమంత్రి పదవికి ఎన్‌.బీరేన్‌సింగ్‌ రాజీనామా చేసిన నాలుగు రోజులకు అంతా అనుకున్నట్టే రాష్ట్రపతి పాలన అమలులోకి వచ్చింది. అసెంబ్లీని రద్దు చేయకుండా సజీవంగా నిద్రావస్థలో ఉంచారు. కేంద్ర దేశీయ వ్యవహారాల మంత్రిత్వశాఖ గురువారంనాడు ఒక నోటిఫికేషన్‌ విడుదల చేస్తూ,“మణిపూర్‌ రాష్ట్రంలో ప్రభుత్వపాలన రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా సాగని పరిస్థితులు తలెత్తాయి అని రాష్ట్రపతి అభిప్రాయపడ్డారు” అని పేర్కొంది.“ఇకమీదట రాజ్యాంగంలోని 356వ అధికరణ కింద అధికారాలు, ఇతర బాధ్యతల నిర్వహణ నాకే సంక్రమిస్తుంది, భారత రాష్ట్రపతిగా ఇకమీదట మణిపూర్‌ రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ కార్యకలాపాల నిర్వహణను నేనే స్వాధీనం చేసుకుంటున్నట్లుగా ఇందుమూలంగా ప్రకటించడమైనది, వీటిని నిర్వహించేందుకు నా తరపున రాష్ట్ర గవర్నర్‌కు ఈ బాధ్యతలను దఖలుపరచడమైనది” అని నోటిఫికేషన్‌ పేర్కొంది. మణిపూర్‌ రాష్ట్రశాసనసభను రద్దుచేయకుండా నిద్రావస్థలోకి పంపించినట్లు నోటిఫికేషన్‌ పేర్కొంది. ఎన్‌.బైరెన్‌సింగ్‌ నామమాత్రంగా ఆపధర్మముఖ్యమంత్రిగా ఉంటారు.
2023 మే మూడవ తేదీన మణిపూర్‌లో మైతీ జాతులమధ్య హింసాత్మక ఘర్షణలు ప్రారంభమయ్యాయి. ఇక అప్పటినుండీ ఆ రాష్ట్రం గృహ దహనాలు, మహిళలపై అత్యాచారాలు, దారుణ సామూహిక హింసాకాండ కొనసాగుతున్నది. ఈ కారణంగా 60,000 మందికిపైగా ప్రజలు ఇళ్ళువదలి పారిపోయారు. 250 మంది మరణించగా వేలాదిమంది గాయపడ్డారు. 96 మృతదేహాలు ఇప్పటివరకూ ఎవరివో తెలియలేదు. 254 క్రైస్తవ మతాలయాలు, 132 హిందూ ఆలయాలు, మరో 386 మత ప్రదేశాలు ఈ అల్లర్లలో ధ్వంసమయ్యాయి. మణిపూర్‌ పోలీసుల సమాచారం ప్రకారం 5,172 గృహదహనాల కేసులు నమోదయ్యాయి. బిజెపి తరపున గెలిపి డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి ఎన్‌.బైరెన్‌సింగ్‌ ఈ హింసాకాండలో ఒకపక్షం వహించి ఘర్షణలకు ఆజ్యం పోశారని తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఆయన రాజీనామా చేయాలని మొదటినుండీ ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకుండి సార్వత్రిక ఎన్నికలు, ఇతర కీలక రాష్ట్రాలలో ఎన్నికల ప్రయోజనాల నిమిత్తం మణిపూర్‌లో పరిస్థితులను వీలైనంతవరకూ ప్రపంచం దృష్టికి రాకుండా ఆంక్షలు విధించి కట్టుదిట్టం చేసింది. మణిపూర్‌లో స్త్రీలపై జరిగిన దారుణ అమానుష కృత్యాలను చూసి భారత సర్వోన్నత న్యాయస్థానం కూడా ముక్కునవేలేసుకుంది. ఇప్పటివరకూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆ రా్రష్ట్రంలో పర్యటించకపోగా, ప్రతిపక్షాలు, మానవహక్కుల సంఘాలు, సామాజిక గ్రూపులు కూడా ఆ రాష్ట్రంలో పర్యటించకుండా ఆంక్షలు విధించి అమానుషంగా ప్రవర్తించారు.
మయన్మార్‌ అక్రమ వలస ప్రజల్ని తరిమి కొట్టేవరకూ పోరాటం ఆపద్ధర్మముఖ్యమంత్రి బైరెన్‌సింగ్‌
మణిపూర్‌ రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అక్రమ,చట్టవిరుద్ధ వలసలకు వ్యతిరేకంగా ప్రభావంతంగా ప్రతిస్పందించేందుకు పోరాటం చేస్తోందని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఎన్‌.బైరెన్‌సింగ్‌ పేర్కొన్నారు. మణిపూర్‌లో రాష్ట్రపతిపాలన విధించిన తర్వాత గురువారంనాడు సాయంత్రం ఆయన ఎక్స్‌ వేదికగా ఒక పోస్టింగ్‌ చేస్తూ, అక్రమ వలసలపై 2023 మే 3వ తేదీ నుండీ సమర్థవంతంగా ప్రతిస్పందించేందుకు యంత్రాంగం పోరాటం చేస్తోందని, రాష్ట్రంలో హింస ప్రారంభమైన తర్వాత ఇప్పటివరకూ 250 మంది మరణించారని, వేలాదిమంది నిర్వాసితులుగా మారారని పేర్కొన్నారు. ఈ సరిహద్దు రాష్ట్రంలో చట్టవిరుద్ధమైన వలసలు అదేపనిగా పెరిగిపోతూ ఉన్నాయనీ, ఈ బెడద మణిపూర్‌ సామాజిక వ్యవస్థకు తీవ్రమైన ప్రమాదంగా మారిందని పేర్కొన్నారు. ఈనెల తొమ్మిదోతేదీన ఎన్‌.బైరెన్‌సింగ్‌ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు జరిగేవరకూ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని రాష్ట్ర గవర్నర్‌ ఆయనను కోరారు. ఎక్స్‌ వేదికగా ఆయన మణిపూర్‌లో పలుజాతులకు చెందిన ప్రజలను స్నేహితులుగా పేర్కొంటూ ఈ పోస్టింగ్‌ పెట్టారు. “మన నేల, మన ఉనికి ప్రమాదంలో పడింది. కొద్దిమంది జనాభాతొఓ, పరిమితమైన వనరులతో ఉన్న మణిపూర్‌లో మనం ఇలాంటి పరిస్థితులను తట్టుకుని నిలబడలేని పరిస్థితులకు చేరుకున్నాం. అక్రమ వలసప్రజలను తనిఖీ చేసేందుకు, వారిజాడ కనిపెట్టేందుకు 2023 మే 3 వ తేదీ నుండి నేను విరామం లేకుండా శ్రమిస్తున్నాను. కానీ మే మూడో తేదీన జరిగిన విషాదకరమైన ఘటనలు తర్వాత మన ప్రభుత్వ యంత్రాంగం సమర్థవంతంగా ప్రతిస్పందించేందుకు పోరాటం చేస్తున్నది, మయన్మార్‌తో ఉన్న ఎలాంటి కాపలావ్యవస్థా లేని 398 కిలోమీటర్ల మణిపూర్‌ సరిహద్దుప్రాంతంలో చాలా యదేచ్ఛగా రాకపోకలు సాగుతున్నాయి, మయన్మార్‌ కారణంగా మణిపూర్‌ రాష్ట్ర భౌగోళిక స్వరూపస్వభావాలు మారిపోయాయి, ఇది కేవలం వదంతి కాదు, ఇదంగా మనకళ్ళముందే జరిగింది, 2017 మార్చినెలలో మన ప్రభుత్వం మణిపూర్‌లో అధికారం చేపట్టినప్పటినుండీ ఈ సవాలు మరింత ఉద్ధృతరూపం దాల్చింది. 2023 మే 3వ తేదీ ఘటనల తర్వాత దారుణంగా మారింది. మయన్మార్‌ సరిహద్దులమధ్య 16 కి.మీ ప్రాంతంలో నివాసిత ప్రాంత ప్రజలు యధేచ్ఛగా రాకపోకలు సాగించే కార్యకలాపాలకు త్వరలో తెరపడతాయని గత ఏడాది జనవరిలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. భారత్‌ మధ్య 1,643 కి.మీ మేరకు విస్తరించి ఉన్న సరిహద్దుల్లో మిజోరాం, మణిపూర్‌, నాగాలాండ్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రాలకు యదేచ్ఛగా రాకపోకలు సాగుతున్నాయి,. కానీ ఈ నియంత్రణలను 2018లో భారత తూర్పువిధానం కింద అమలు చేశారు. మణిపూర్‌ చాలా చిన్నరాష్ట్రం, తక్కువమంది జనాభా ఉంటారు, గొప్ప ప్రకృతి వనరులు కూడా లేవు, మనరాష్ట్రం నుండి పార్లమెంటులో ముగ్గురు ఎంపీలు మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తున్నారు, ఇప్పటివరకూ మనం ఎంతో గర్వంగా ఉంటూ పుంజుకుంటున్నాం, మడమతిప్పనిస్ఫూర్తిని ప్రదర్శిస్తున్నాం, కానీ అక్రమ వలసలు అదేపనిగా రాష్ట్రంలోకి కొనసాగుతున్నాయి, పెరిగిపోతున్నాయి, ఇప్పటివరకు వారిలో కొంతమందిని మాత్రమే గుర్తించగలిగాం, కానీ ఇప్పటివరకూ బయటకు తెలియకుండా గుట్టుగా ఉండిపోయిన అక్రమ వలస ప్రజల సంగతి ఏమిటి?” అని బైరెన్‌సింగ్‌ ఎక్స్‌ వేదికగా ప్రశ్నించారు. ఈ విషయాలను చాలా తీవ్రంగా పరిగణించాలని బైరెన్‌సింగ్‌ అధికారులను కోరారు. మణిపూర్‌లో ఉన్న అక్రమ వలస ప్రజలను కనిపెట్టి వారిని వెనక్కు పంపేయాలని కోరారు. “నేను రాజీపడకుండా, మడమతిప్పకుండా నా పోరాటాన్ని చిత్తశుద్ధిలో ప్రతిమార్గంలోనూ ఒక ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా పోరాటం కొనసాగిస్తాను” అని బైరెన్‌సింగ్‌ పేర్కొన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?
Prajapaksham
Prajapaksham
Praja Paksham Telugu News (తెలుగు వార్తలు) offers the Latest Telugu News, Breaking News in Telugu (ముఖ్యాంశాలు) from Andhra Pradesh and Telangana. National News, International News Headlines in Telugu Daily. prajapaksham.in is flagship online website of PrajaPaksham Newspaper
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments