పరిస్థితులు నిలకడగా మారుతున్నాయనడం ప్రభుత్వ వాదన సత్యదూరం
తమను ఆదుకోవడంలో పాలకులు విఫలమయ్యారని సిపిఐ ప్రతినిధి బృందంతో కన్నీటి పర్యంతమైన బాధితులు
కౌత్రుక్‌లో హింసాకాండ, కలహాల బాధితులను కలవకుండా అడ్డుకోవడం గర్హనీయం : సిపిఐ ఎంపి బినోయ్ విశ్వం
ఇంఫాల్ : మణిపూర్‌లో శాంతి, పరిస్థితులు నిలకడగా మారుతున్నాయని కేంద్ర ప్రభుత్వం పదే పదే చేస్తున్న వాదన సత్యదూరమైనదని భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) పేర్కొంది. ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు అనేక ప్రాంతాలలో నిజనిర్ధారణ బృందాలకు ప్రవేశాన్ని నిరాకరిస్తోందని సిపిఐ విమర్శించింది. రాజకీయ చొరవను, శాంతిని తిరిగి పొందేందుకు చర్చలను మణిపూర్ కోరుతోందని మణిపూర్‌లో పర్యటిస్తున్న సిపిఐ అగ్ర నేతల ప్రతినిధి బృందం స్పష్టం చేసింది. ప్రధాని అర్థరహిత వాక్చాతుర్యం మణిపూర్ సంక్షోభాన్ని మరింత దిగజార్చిందని, ప్రస్తుతం సంక్షోభం మొత్తం ఈశాన్య ప్రాంతాలకు విస్తరించిందని వారు తెలిపారు. మణిపూర్ పర్యటనలో ఉన్న సిపిఐ జాతీయ కార్యదర్శి, పార్లమెంటు సభ్యుడు బినోయ్ విశ్వం నేతృత్వంలోని సిపిఐ నాయకుల బృందాన్ని బుధవారం ఉదయం ఇంఫాల్ పశ్చిమ జిల్లాలోని కౌత్రుక్‌లో పర్యటించకుండా అధికారులు అడ్డుకున్నారు. సిపిఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా నేతృత్వంలోని జాతీయ కార్యదర్శులు బినోయ్ విశ్వం, డాక్టర్ కె.నారాయణ, రామ కృష్ణపాండా, సీనియర్ మహిళా నాయకురాలు అసోమి గొగోయ్‌తో కూడిన సిపిఐ ప్రతినిధి
బృందం కడంగ్‌బ్యాండ్‌లోని హింసాకాండ బాధితులతో చర్చలు జరిపింది. తమను ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని సిపిఐ ప్రతినిధి బృందం ముందు బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు. బాధితులలో ఎక్కువ మంది మహిళలు ప్రతినిధిబృందంతో తమ గోడును వెళ్లబోసుకున్నారు. కడంగ్‌బ్యాండ్‌లో ప్రజలను కలిసిన తర్వాత సిపిఐ ఎంపి బినోయ్‌విశ్వం నేతృత్వంలోని పార్టీ నాయకుల బృందం కౌత్రుక్‌కు వెళ్ళింది. ఇతర సిపిఐ ప్రతినిధి బృందం మణిపూర్‌లో సిపిఐ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకోవడానికి ఇంఫాల్ నగరానికి వెళ్లారు. కౌత్రుక్‌కు వెళ్లే మార్గంలో వందలాది మంది మహిళలు, పురుషులు, పిల్లలు సిపిఐ బృందం కోసం ఎదురు చూస్తుండగా అధికారులు జోక్యం చేసుకుని కౌత్రుక్‌లో బాధిత ప్రజలను కలవకుండా అడ్డుకున్నారు. హింసాకాండ, కలహాల బాధిత ప్రజలను కలుసుకునే, మాట్లాడే హక్కును కాలరాయడాన్ని సిపిఐ నేత బినోయ్ విశ్వం తీవ్రంగా నిరసించారు. అయితే, ఘర్షణలు తలెత్తకుండా, శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా తిరిగి రావాలని పార్టీ నాయకత్వం నిర్ణయించింది. ఈ సందర్భంగా బినోయ్ విశ్వం మాట్లాడుతూ ప్రధాని మోడీ బూటకపు ప్రసంగాలు చేయకుండా స్వయంగా మణిపూర్‌లో పర్యటించి అక్కడి వాస్తవ పరిస్థితులను పరిగణలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని మణిపూర్ తల్లులు, సోదరీమణుల బాధల గురించి పదేపదే మాట్లాడిన నేపధ్యంలో ముగిసిన వెంటనే మణిపూర్‌కు వెళతారని దేశం భావించిందని, అయితే ప్రధాని ఇప్పటికే దక్షిణాఫ్రికా, గ్రీస్‌కు విమానం ఎక్కారని బినోయ్ విశ్వం అన్నారు.
మణిపూర్‌లో ఇంకా కల్లోలమే
RELATED ARTICLES