HomeNewsBreaking Newsమణిపూర్‌పై చిత్తశుద్ధేదీ?

మణిపూర్‌పై చిత్తశుద్ధేదీ?

నామమాత్రంగా అఖిలపక్ష సమావేశం
సిపిఐని ఆహ్వానించకపోవడంపై పార్టీ ప్రధాన కార్యదర్శి ఆగ్రహం
పారదర్శకత కొరవడిందని వ్యాఖ్య
న్యూఢిల్లీ :
మణిపూర్‌లో హింసాత్మక చర్యలను అరికట్టి శాంతిని పునరుద్ధరించడంలో కేంద్రం, మణిపూర్‌ రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి కొరవడిందని ప్రతిపక్షాల నాయకులు విమర్శించారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా శనివారం మధ్యాహ్నం ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఏదో మొక్కిబడికి అన్నట్టుగానే ఈ సమావేశంలో తన అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు మాట్లాడటానికి ఏ మాత్రం సమయం ఇవ్వకుండా సమావేశం ముగించారని నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణం ఎన్‌.బైరెన్‌ సింగ్‌ను ముఖ్యమంత్రి పదవి నుండి తొలగించాలని కాంగ్రెస్‌పార్టీ డిమాండ్‌ చేసింది. మణిపూర్‌లో వెంటనే రాష్ట్రపతి పాలన విధించాలని సమాజ్‌వాదీపార్టీ సహా మరికొన్ని పార్టీలు డిమాండ్‌ చేశాయి.
సిపిఐని ఎందుకు ఆహ్వానించలేదో అమిత్‌ షా సంజాయిషీ ఇవ్వాలి
ఢిల్లీలో శనివారం మణిపూర్‌ సమస్యపై జరిగిన అఖిలపక్ష సమావేశానికి భారత కమ్యూనిస్టుపార్టీ (సిపిఐ)ని ఆహ్వానించకపోవడంపై పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సిపిఐని అఖిలపక్ష సమావేశానికి ఎందుకు ఆహ్వానించలేదో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా సంజాయిషీ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. మణిపూర్‌ను చుట్టుముట్టిన సమస్యపై కేంద్ర ప్రభుత్వానికి ఏ మాత్రం అవగాహన లేదని, ఈ సమస్యపై పాదర్శకత, బాహాటత్వ విధానం అసలే లేదని విమర్శించారు. “మణిపూర్‌లో అధికారంలో ఉన్న డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ వైఫల్యాల గుట్టు రట్టు చేస్తుందనే ఉద్దేశంతోనే హోంమంత్రి సిపిఐని ఆహ్వానించకుండా మినహాయించారా?” అని డి.రాజా నిలదీశారు. “మణిపూర్‌ రాష్ట్రం మంటల్లో తగలబడిపపోతోంది, హోంమంత్రి అమిత్‌ షా చోద్యం చూస్తున్నారు, ప్రధానమంత్రి నరేంద్రమోడీ విదేశాలలో ప్యటనలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్నారు, శాంతి భద్రతలవైఫల్యాలపై వారిద్దరూ మణిపూర్‌ ప్రజలకు సంజాయిషీ ఇవ్వాలి” అని రాజా డిమాండ్‌ చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి మొద్దుబారిన మొండి ప్రభుత్వంలా తయారైందని విమర్శించారు. మణిపూర్‌ రాష్ట్రంలో గుర్తింపు పొందిన పార్టీగా సిపిఐకి ఆహ్వానం పంపించలేదని అన్నారు. ప్రభుత్వానికి సమస్యలపట్ల ఏ మాత్రం స్పందన లలేదన్న విషయాన్ని ఈ వైఖరి రుజువు చేస్తోందని అన్నారు. తమ పార్టీని ఆహ్వానించకపోవడం కేంద్ర హోం మంత్రి మొండి వైఖరికి చిహ్నమని విమర్శించారు. బిజెపి, కాంగ్రెస్‌ సహా వివిధ పార్టీ నాయకులు ఈ సమావేశానికి హాజరయ్యారు. మణిపూర్‌లో ఇప్పటివరకూ జరిగిన హింసాకాండలో 120 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. సుమారు 3,000 మందికి పైగా జాతి ఘర్షణల్లో గాయపడ్డారు. కేంద్రం వైఖరిపై డి.రాజా ఒక ట్వీట్‌ చేస్తూ, “అఖిలపక్ష సమాశానికి సిపిఐని ఆహ్వానించకుండా తమ పార్టీని తొలగించడం మంటల్లో తగలబడిపోతున్న మణిపూర్‌ రాష్ట్రంలోని తాజా సమస్యలపట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న మొండి వైఖరికి అద్దం పడుతోంది, మణిపూర్‌లో సిపిఐ గుర్తింపు పొందిన రాజకీయపార్టీ, రాష్ట్రంలో శాంతి, సామరస్యాల సాధనకు సిపిఐ ఎంతగానో పాటుపడుతోంది” అని పేర్కొన్నారు. మణిపూర్‌ రాష్ట్రంలో శాంతి సాధన చర్యలను సిపిఐ చాలా ఉధృతంగా కొనసాగిస్తోందని, శాంతి, సామరస్యాలు రాష్ట్రంలో నెలకొల్పాలని కోరుతూ ఢిల్లీలో ప్రదర్శన కూడా తమ పార్టీ నిర్వహించిందని ఆయన పేర్కొన్నారు. ఇటీవల ఢిల్లీకి మణిపూర్‌ రాష్ట్రానికి చెందిన అఖిలపక్షాన్ని కూడా పిలిపించి అక్కడ నెలకున్న వాస్తవ పరిస్థితులను తమ పార్టీ అంచనావేసి విశ్లేషించిందని రాజా తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
కశ్మీరులా మార్చేందుకు ప్రభుత్వ ప్రయత్నం ః టిఎంసి
మణిపూర్‌ రాష్ట్రాన్ని కశ్మీరులా మార్చేందుకు కేంద్రం ప్రయత్నం చేస్తోందని తృణమూల్‌ కాంగ్రెస్‌పార్టీ విమర్శించింది. మణిపూర్‌ రాష్ట్రానికి అఖిలపక్ష నాయకులను పర్యటనకు తీసుకువెళ్ళాలని, అక్కడి తాజా పరిస్థితిని ప్రతిపక్షాలతో కలిసి ప్రభుత్వం అంచనావేయాలని రాజ్యసభలో టిఎంసి ఎంపి డెరిక్‌ ఓ బ్రెయిన్‌ డిమాండ్‌ చేశారు. మణిపూర్‌ ప్రజల అవసరాలను కేంద్ర ప్రభుత్వం విస్మరిస్తోందన్నారు. అంబులెన్స్‌లో ఆసుపత్రికి వెళుతుండగా ఏడేళ్ళ బాలుడు, తల్లి, అత్త ముగ్గురినీ అల్లరిమూకలు సజీవదహనం చేశాయని, అక్కడ రాక్షస రాజ్యం జరుగుతుంటే కేంద్రం శాంతి భద్రతలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు తీసుకువచ్చేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆదేశాల మేరకు ప్రభుత్వం చేయగలిగిందంతా చేస్తోందని అఖిలపక్ష నాయకులకు హోంమంత్రి చెప్పారని బిజెపి మణిపూర్‌ ఇన్‌చార్జి సాంబిత్‌ పాత్రా పత్రికాగోష్టిలో చెప్పారు. మణిపూర్‌లో హింస ప్రారంభమైన తరువాత తాను ప్రధానమంత్రితో మాట్లాడని రోజు ఒక్కటికూడా లేదని, ఆయన ఆదేశాలు ఇవ్వని రోజు ఒక్కటి కూడా లేదని హోంమంత్రి అఖిలపక్ష సమావేశంలో చెప్పారని అన్నారు. మే 3వ తేదీ నుండి మణిపూర్‌లో ప్రతిపక్షాల సహకారాన్ని కోరకపోవడం చూస్తే ఇదంతా బలవంతంగా జరిగిన మొక్కుబడి సమావేశంగా ఉందని పార్టీలు విమర్శించాయి. మణిపూర్‌లో తీవ్ర విధ్వంసం, హింస జరిగిన, ప్రజలు తీవ్రంగా నష్టపోయిన ప్రాంతాలలో అఖిలపక్ష నాయకులతో ప్రతినిధి బృందం పర్యటన అవసరమని, ఈ ఏర్పాటు చేయాలని ఈ సమావేశంలో పాల్గొన్న అన్ని పార్టీల నాయకులు హోంమంత్రిని కోరారు. అయితే దీనిపై అమిత్‌ షా ఎలాంటి హామీ ఇవ్వలేదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్‌ మాజీ ముఖ్యమంత్రి ఓక్రమ్‌ ఇబోబి సింగ్‌, బిజెపి జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా, టిఎంసి ఎంపి డెరెక్‌ ఓ బ్రెయిన్‌, మేఘాలయ ముఖ్యమంతిత్రి కాన్రాడ్‌ సింగ్‌ (ఎన్‌పిపపి), ఎం.తంబిదొరై (ఎఐఎడిఎంకె), తిరుచ్చి శివ (డిఎంకె), పినాకి మిశ్రా (బిజెడి), సంజయ్‌ సింగ్‌ (ఆమ్‌ఆద్మీపార్టీ), మనోజ్‌ ఝా (ఆర్‌జెడి), ప్రియాంకా చతుర్వేది (శివసేన) ఈ సమావేశానికి హాజరయ్యారు. మణిపూర్‌ ముఖ్యమంత్రి బైరెన్‌ సింగ్‌నుతక్షణం పదవి నుండి తప్పించాలని ఇబొబి సింగ్‌ డిమాండ్‌ చేశారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments