వాక్‌స్వాతంత్య్రం హక్కుసహా ప్రాథమిక హక్కుల్లో సామాన్య ప్రజలకు, వారికీ ఎలాంటి తేడా ఉండదు
ఒక మంత్రి ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా చేసిన ప్రకటనను ప్రభుత్వానికి ఆపాదించలేం
4:1 మెజారిటీతో సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం కీలక తీర్పు
న్యూఢిల్లీ : కొత్త సంవత్సరంలో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం మంగళవారంనాడు మరో కీలకమైన తీర్పు వెలువరించింది. చట్టసభల్లో సభ్యులుగా ఉండే ఎంపీలు, ఎంఎల్‌ఎల భావప్రకటనా స్వేచ్ఛకు ఎలాంటి ఆంక్షలూ న్యాయవ్యవస్థ విధించలేదని, దీనిపై సర్వోన్నత చట్టసభే (పార్లమెంటు) తగిన నియంత్రణలను అమలులోకి తేవాలని జస్టిస్ ఎస్.ఎ.నజీర్ సారథ్యంలోని రాజ్యాంగ ధర్మాసనం తీర్పు ప్రకటించింది. వాక్‌స్వాతంత్య్రం హక్కుసహా ప్రాథమిక హక్కుల్లో సామాన్య ప్రజలకూ వారికీ ఎలాంటి తేడా ఉండదని పేర్కొంది. ఉత్తర ప్రదేశ్ బులంద్ షహర్‌జిల్లాలో 2016లో జరిగిన ఒక సామూహిక అత్యాచారం కేసు సందర్భంగా ప్రాథమిక హక్కులపై విచారణ జరిపిన ఐదుగురు సభ్యులతో కూడిన ఈ ధర్మాసనంలో జస్టిస్ నజీర్‌తోపాటు మహిళా న్యాయమూర్తి జస్టిస్ బి.వి.నాగరత్న, జస్టిస్ బి.ఆర్.గవాయ్, జస్టిస్ ఎ.ఎస్.బోపన్న, జస్టిస్ వి.రామసుబ్రమణియన్‌లు కూడా సభ్యులుగా ఉన్నారు. 4ః1 మెజారిటీతో రాజ్యాంగ ధర్మాసనం ఈ తీర్పు చెప్పింది. ప్రభుత్వంలో ఒక మంత్రి
ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా చేసిన ప్రకటనను ఆ ప్రభుత్వంలో ఉన్న యావత్ మంత్రివర్గానికీ, యావత్ ప్రభుత్వానికీ ఆపాదించలేమని, ఒక మంత్రి చేసిన ప్రకటన ఒక్కటే ప్రభుత్వానికి ప్రత్యామ్నాయం కాదని రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని 19(2) (ఎ) అధికరణ కింద ఉన్న నిబంధనల ప్రకారం అమలులో ఉన్న ్రప్రాథమిక మినహా ఎలాంటి అదనపు ఆంక్షలను చట్టసభల్లోని సభ్యులపై విధించలేమని ధర్మాసనం చెప్పింది. 2016 జులైలో ఉత్తర ప్రదేశ్‌లో భార్యా కుమార్తెలపై జాతీయ రహదారిపై సామూహిక అత్యాచారం జరిగిన కేసులో భర్త ఈ కేసును సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలని కోరారు. ఈ సామూహిక అత్యాచార ఘటనపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఆనాటి మంత్రి అజామ్ ఖాన్‌పై కేసు నమోదు చేయాలని కూడా డిమాండ్ చేశారు. అయితే మంత్రి వ్యాఖ్యలు, వాక్‌స్వాతంత్రంపై ఆంక్షలు విధించాలా వద్దా? అనే అంశంపై ఆనాటి త్రిసభ ధర్మాసనం ఈ కేసును తదుపరి విచారణ నిమిత్తం 2017 అక్టోబరు 5వ తేదీన విస్తృత రాజ్యాంగ ధర్మాసనానికి అప్పగించింది. ఐదుగురు సభ్యుల విస్తృత ధర్మాసనం 2022 నవంబరు 15న విచారణ వాదనలు పూర్తిచేసి తీర్పును వాయిదా వేసింది. ఈ తీర్పును తాజాగా మంగళవారంనాడు ప్రకటించింది. మంత్రులు ఎవరికి ప్రకటనల్లో వారే స్వీయ నియంత్రణ పాటించాలని కూడా రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రభుత్వవ్యవహారాలు చక్కబెట్టే ప్రజానాయకులకు ప్రవర్తనా నియమావళిని రూపొందించాల్సిన అవసరం లేదని, దేశంలో ఈ నియమావళి రాజ్యాంగ సంస్కృతిలో ఒకభాగంగానే ఉంటుందని ధర్మాసనం ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. ప్రభుత్వంలో ఉండే ప్రజా ప్రతినిధులు ఎవరికి వారే ప్రజలపట్ల బాధ్యత వహించాలని, స్వీయ నియంత్రణ పాటించాలని తెలియజేసింది.